1300 షోల రద్దు.. ఫిలింమేకర్స్ కి ప్రమాద హెచ్చరిక!

ఇది ప్రమాద హెచ్చరిక. దిగ్గజాలం అని చెప్పుకునే అత్యంత ప్రతిభావంతులైన ఫిలింమేకర్స్ కి డేంజర్ బెల్. భారతదేశంలోనే లెజెండ్ అని చెప్పుకోదగ్గ నటుడు నిర్మాతకు ఎదురైన ఈ అనుభవం పరిశీలిస్తే నిజంగానే మేధోవర్గాలు సైతం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది వందేళ్ల సినీచరిత్రలో అరుదైన ఘటన. బహుశా దేశ సినిమా భవిష్యత్ ని నిర్ధేశిస్తున్న హెచ్చరికగా దీనిని భావించాలి. రొటీన్ ఫలింమేకింగ్ కి ఇది చరమగీతం! అని కూడా ఇందులో మీనింగ్ దాగి ఉంది. ఇంతకీ అంతటి ప్రమాదం సినిమా భవిష్యత్ కి ఏం ఉంది? అని ప్రశ్నిస్తే పూర్తి వివరాల్లోకి వెళ్లాలి.

అసాధారణ సక్సెస్ రేటుతో భారతదేశ సినీపరిశ్రమలో అత్యుత్తమ ఫిలింమేకర్ గా భావించే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి ఎదురవుతున్న తాజా అనుభవాలను పరిశీలిస్తే ఇది అసలు సిసలు హెచ్చరిక గా సినీమేధావులు భావించాలి. అమీర్ నటించిన పాన్ ఇండియా చిత్రం `లాల్ సింగ్ చద్దా`కు ఎదురవుతున్న ఊహాతీత అనుభవాలు ఈ విషయాన్ని ప్రాక్టికల్ గా కళ్లకుగడుతున్నాయి. ఈ సినిమా హిందీ బెల్ట్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా స్థానిక భాషల్లోనూ విడుదల కాగా తొలి రోజు క్రిటిక్స్ పెదవి విరిచేసిన సంగతి తెలిసిందే. కంటెంట్ తో పాటు మేకింగ్ పరంగానూ ఎన్నడూ లేని విధంగా అమీర్ ఖాన్ విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. లాల్ సింగ్ బాక్సాఫీస్ వద్ద కేవలం 12 కోట్ల లోపు ఓపెనింగులతో తీవ్రంగా నిరాశపరిచింది. తాజా సమాచారం మేరకు.. మొదటి రోజు గడిచాక దాదాపు 1300 షోలను (శుక్రవారం) ఎగ్జిబిటర్లు తగ్గించి ప్రదర్శనలు రద్దు చేసారని ముంబై మీడియాలు సంచలన కథనాన్ని ప్రచురించాయి.

ఆగస్ట్ 11న విడుదలైన అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చడ్డా`.. అక్షయ్ `రక్షా బంధన్` బాక్సాఫీస్ వద్ద పోటీపడుతూ ఓ మోస్తరుగా ఓపెనింగులు మాత్రమే అందించాయి. ఈ రెండు చిత్రాలు కలిపి మొత్తం రూ. తొలిరోజు 20 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగాయి. `రక్షా బంధన్` హాలిడేని కూడా ఉపయోగించుకోవడంలో విఫలమైంది. ఈ రెండు భారీ చిత్రాల ఓపెనింగ్ డే పెర్ఫామెన్స్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. ఇది నిజంగా ట్రేడ్ ను అయోమయ స్థితిలోకి నెట్టింది. ఇంతలోనే లాల్ సింగ్ చడ్డా గురించి షాకింగ్ న్యూస్ అందింది. లాల్ సింగ్ చద్దా రెండో రోజు ఏకంగా 1300 షోలను ఎగ్జిబిటర్లు రద్దు చేసారన్న వార్త దావానలంలా వ్యాపించింది. అమీర్ ఖాన్ లాంటి అసాధారణ నటుడికి ఇది ఊహించనిది. అనూహ్యమైనదని కథనాలు వెలువడ్డాయి.

బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన కారణంగా థియేటర్ యజమానులు లాల్ సింగ్ చడ్డా - రక్షా బంధన్ రెండింటి షోలను స్వచ్ఛందంగా తగ్గించారని ముంబై మీడియా కథనాలు వెలువరించింది. రెండు భారీ సినిమాలు దేశవ్యాప్తంగా దాదాపు 10000 షోలతో విడుదలయ్యాయి. వాటిలో ఏ ఒక్కటీ గొప్ప ప్రదర్శనకు హామీ ఇవ్వలేదు. ప్రారంభ రోజు కూడా గరిష్ట ప్రదర్శనలలో చాలా వరకు 10 మంది ఆడియెన్ తోనే ఆడించారు అంటే ఆక్యుపెన్సీ ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవాలి. ఆల్మోస్ట్ నో- షో సన్నివేశం దాపురించగా.. వెనువెంటనే పరిమిత షోలలో ఆక్యుపెన్సీని పెంచడానికి రెండవ రోజు ఇరు చిత్రాల ప్రదర్శనను తగ్గించాలని ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారని ట్రేడ్ వెల్లడించినట్టు ప్రముఖ మీడియా కథనం ప్రచురించింది.

`లాల్ సింగ్ చడ్డా` దాదాపు 1300 షోలు తగ్గించగా.. రక్షా బంధన్ దేశవ్యాప్తంగా 1000 షోల తగ్గింపును చవిచూసిందనేది సదరు కథనం సారంశం. ఇంత భారీగా విడుదలైనా కానీ ఏ సినిమా కూడా కలెక్షన్ల పరంగా రాణించలేదు. `లాల్ సింగ్ చడ్డా` మాస్ బెల్ట్ లలో ఆల్మోస్ట్ వాష్ అవుట్ కాగా.. రక్షా బంధన్ కొన్ని మల్టీప్లెక్స్ లలో నో -షో సన్నివేశాన్ని  ఎదుర్కొంటోందని సదరు కథనం వెల్లడించింది. వాస్తవానికి స్వచ్ఛందంగానే షోలను తగ్గించినా కానీ.. ప్రేక్షకులు లేకపోవడంతో శుక్రవారం ఉదయం రెండు చిత్రాలకు సంబంధించిన అనేక షోలు రద్దు చేసారు. ఇది నిజంగా ఇద్దరు దిగ్గజ హీరోల కెరీర్ లో అత్యంత వినాశకరమైన దృశ్యం! అని సదరు కథనం అభివర్ణించడం సంచలనంగా మారింది.

ప్రపంచ దేశాల్లో నంబర్ వన్ వసూళ్లు సాధించిన దంగల్ ని అందించిన అమీర్ ఖాన్ ఇంతగా భేజారవ్వడం అనేది హిస్టరీలోనే ఇది మొదటి సారి. వరుసగా రెండు భారీ వైఫల్యాలను అతడు ఎదుర్కొన్నాడు. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తర్వాత లాల్ సింగ్ చడ్డా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. అలాగే వరుస హిట్లతో జోష్ మీద ఉండే  ఖిలాడీ అక్షయ్ కుమార్ సైతం దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందించి బాలీవుడ్ నుంచి రక్షించాల్సిన ఇద్దరు హీరోలు ఇలాంటి దారుణ సన్నివేశాన్ని ఎదుర్కోవడంపై బాలీవుడ్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
× RELATED డబ్బు జల్లడంలో టాలీవుడ్ తర్వాతనే ఎవ్వరైనా?
×