లాల్ సింగ్ చడ్డా

మూవీ రివ్యూ : ‘లాల్ సింగ్ చడ్డా’

నటీనటులు: ఆమిర్ ఖాన్-కరీనా కపూర్-నాగచైతన్య-మోనా సింగ్-మానవ్ విజయ్-ఆర్య శర్మ-షారుఖ్ ఖాన్ (క్యామియో)
సంగీతం: ప్రీతమ్
నేపథ్య సంగీతం: తనూజ్ టికు
ఛాయాగ్రహణం: సత్యజిత్ పాండే
రచన-అతుల్ కులకర్ణి
నిర్మాతలు: ఆమిర్ ఖాన్-కిరణ్ రావు-జ్యోతి దేశ్ పాండే-అజిత్ అందారె
దర్శకత్వం: అద్వైత్ చందన్

‘లగాన్’ సహా అద్భుతమైన చిత్రాలతో హిందీ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నటుడు ఆమిర్ ఖాన్. ఏ సినిమా చేసినా ఎంతో శ్రద్ధంగా.. మనసు పెట్టి చేసే ఆయన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ను ఎంతో ఇష్టపడి దాని ఆధారంగా ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా చేశాడు. దీనికి నిర్మాత కూడా ఆయనే. ఆమిర్ సినిమాల మీద ఉన్న గురికి తోడు మన అక్కినేని నాగచైతన్య ఇందులో కీలక పాత్ర పోషించడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’ వారి ఆసక్తిని నిలబెట్టే స్థాయిలో ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

లాల్ సింగ్ చడ్డా (ఆమిర్ ఖాన్) చిన్నతనంలోనే తండ్రికి దూరమై తల్లి (మోనా సింగ్) సంరక్షణలో పెరిగి పెద్దవాడైన కుర్రాడు. కొంచెం బుద్ధి మాంద్యం లక్షణాలున్న అతను తన తల్లి.. అలాగే తన చిన్ననాటి స్నేహితురాలైన రూప (కరీనా కపూర్) సాయంతో జీవితంలో ముందడుగు వేస్తూ సాగుతాడు. పెద్దవాడయ్యాక మిలిటరీలో చేరిన అతడికి బాలరాజు (నాగచైతన్య)తో స్నేహం కుదురుతుంది. ఐతే తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఒక్కొక్కరుగా అతడికి దూరం అయిపోతారు. మరి ఈ ఎదురు దెబ్బల్ని తట్టుకుని లాల్ సింగ్ తన జీవిత ప్రయాణాన్ని ఎక్కడిదాకా తీసుకెళ్లాడు అన్నది మిగతా కథ.

క‌థ‌నం-విశ్లేష‌ణ:

రీమేక్ అంటే ఒక‌ప్పుడు హిట్ కొట్ట‌డానికి అతి సులువైన మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు రీమేక్ సినిమా తీసి స‌క్సెస్ సాధించ‌డం అతి పెద్ద స‌వాలుగా మారిపోయింది. ఇంట‌ర్నెట్ విప్లవం మూలంగా మామూలుగానే వివిధ భాష‌ల్లో పేరున్న చిత్రాల‌న్నీ ముందే చూసేస్తున్నారు జ‌నాలు. ఒక కాస్త పేరున్న హీరో సినిమాను రీమేక్ చేస్తున్నాడు అన‌గానే వెతికి మ‌రీ ఆ సినిమా చూస్తున్నారు. ఇక రీమేక్ మూవీ నుంచి చిన్న ప్రోమో రిలీజైన ద‌గ్గ‌ర్నుంచి మొద‌ల‌వుతాయి పోలిక‌లు. ఉన్న‌దున్న‌ట్లు తీస్తే జిరాక్స్ అంటారు. మార్పులు చేర్పులు చేస్తే చెడ‌గొట్టేశారు అంటారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రీమేక్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం అతి పెద్ద స‌వాలుగా మారిపోతోంది. అయినా స‌రే.. మేటి న‌టుడు.. క‌థల ఎంపిక‌లో.. సినిమాల మేకింగ్ మీద గొప్ప ప‌ట్టు ఉన్న ఆమిర్ ఖాన్ ఏరికోరి 28 ఏళ్ల నాటి హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ ఆధారంగా లాల్ సింగ్ చ‌డ్డా సినిమా చేసేస‌రికి ఇందులో ఏదో ఒక ప్ర‌త్యేక‌త ఉండే ఉంటుందని.. త‌న టీంతో క‌లిసి ఆమిర్ ఏదో మ్యాజిక్ చేసే ఉంటాడ‌ని ఆశిస్తాం. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆమిరే ఈ సినిమాకు అతి పెద్ద బ‌ల‌హీన‌త‌గా మార‌డం.. త‌న యాక్ట్స్ అన్నీ పేల‌వంగా మార‌డం.. ఫారెస్ట్ గంప్ లో ఉన్న ప్యూరిటీ.. ఫీల్ ఇందులో మిస్ అయిపోవ‌డం విచార‌క‌రం.

ఏ పాత్రలో అయినా చాలా సులువుగా ఒదిగిపోయి.. ఆ పాత్ర‌కు అవ‌స‌ర‌మైన మేర కొలిచిన‌ట్లు న‌టించ‌డం ఆమిర్ ఖాన్ ప్ర‌త్యేక‌త‌. తాను పోషించే పాత్రను ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ చేసి.. ఆ పాత్ర తాలూకు భావోద్వేగాల‌ను ప్రేక్ష‌కులు ఫీల‌య్యేలా చేసి దాంతో పాటు ట్రావెల్ చేయిస్తాడ‌ని ఆమిర్ కు పేరుంది. చాలా సినిమాల్లో అత‌ను అదే ప‌ని చేశాడు. కానీ లాల్ సింగ్ చ‌డ్డా పాత్రకు వ‌చ్చేస‌రికి అదొక కృత్రిమ‌మైన‌.. అస‌హ‌జ‌మైన పాత్ర‌లా త‌యారై ప్రేక్ష‌కుల‌ను ఆద్యంతం చిరాకు పెడుతుంది. ఫారెస్ట్ గంప్ లో టామ్ హాంక్స్ ను చూస్తున్న‌పుడు ఆ పాత్ర ప‌ట్ల క‌లిగే ఆపేక్ష దీని మీద క‌ల‌గ‌దు. అందులో ఉన్న స‌హ‌జ‌త్వం ఇక్క‌డ మిస్ అయిన ఫీలింగ్ క‌లుగుతుంది. ముందే అన్న‌ట్లు పాత్ర‌కు త‌గ్గ‌ట్లు కొలిచిన‌ట్లు న‌టించే ఆమిర్.. రీమేక్ అనేస‌రికి తాను ఇంకొంచెం భిన్నంగా ఏదో చేయాల‌ని చూశాడు. ఈ క్ర‌మంలో బుద్ధి మాంద్య‌త ఉన్న కుర్రాడిగా అత‌డి హావ‌భావాలు హ‌ద్దులు దాటిపోయాయి. ప‌నిగ‌ట్టుకుని న‌టిస్తున్న‌ట్లు.. అతి చేస్తున్న‌ట్లు అనిపిస్తుందే త‌ప్ప అది ఆ పాత్ర తాలూకు ల‌క్ష‌ణంగా క‌నిపించ‌దు. ఆ పాత్ర ప‌ట్ల  జాలి.. ఆపేక్ష లాంటివి క‌ల‌గ‌వు. అన్నింటికీ మించి ఈ పాత్ర‌లో ఆమిర్ కొత్త‌గా క‌నిపించ‌క‌పోవ‌డం పెద్ద మైన‌స్. ధూమ్-3 సినిమాలో చేసిన స‌మ‌ర్ పాత్ర‌.. పీకేలో చేసిన రోల్ దీనికి చాలా ద‌గ్గ‌ర‌గా అనిపిస్తాయి. అందువ‌ల్ల ప్రేక్ష‌కులు కొత్త‌ద‌నాన్ని ఎంత‌మాత్రం ఫీల్ కాలేరు.

క‌థ‌గా చూసుకుంటే ఫారెస్ట్ గంప్ ఏమంత ప్ర‌త్యేకంగా అనిపించేది కాదు. అస‌లిది 28 ఏళ్ల ముందు సినిమా అని మ‌రిచిపోకూడదు. దీని స్ఫూర్తితో వివిధ భాష‌ల్లో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఒక వ్య‌క్తి జీవితంలోని వివిధ ద‌శ‌ల‌ను హృద్యంగా చూపించే ప్ర‌య‌త్నాలు బోలెడ‌న్ని జ‌రిగాయి. కాబ‌ట్టి ఇప్పుడీ స్లైస్ ఆఫ్ లైఫ్ క‌థ‌లు కొత్త‌గా అనిపించే అవ‌కాశం లేదు. సినిమా క‌నెక్ట్ అవుతుందా  లేదా అన్న‌ది హీరో పాత్ర చిత్ర‌ణ‌.. దాంతో ప్రేక్ష‌కుల‌కు క‌లిగే ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. ఐతే ఆమిర్ ఏదో చేద్దామ‌నే తాప‌త్ర‌యంతో చేసిన అతి వ‌ల్ల.. అత‌ణ్ని ఇంత‌కుముందే ఇలాంటి పాత్ర‌ల్లో చూసి ఉండ‌డం వ‌ల్ల అది సాధార‌ణంగా అనిపిస్తుంది. ఆమిర్ ఆహార్యం.. అత‌డి హావ‌భావాలు కొంత మేర మిస్ట‌ర్ బీన్ ను గుర్తుకు తెచ్చి ఎమోష‌న‌ల్ గా అనిపించాల్సిన సీన్లు కామెడీగా త‌యార‌య్యాయంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. అక్క‌డ‌క్క‌డా కొన్ని సీన్లు మిన‌హాయిస్తే చాలా సాధార‌ణంగా సాగిపోయే లాల్ సింగ్ చ‌డ్డా చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు నీర‌స‌మే తెప్పిస్తుంది.

మాతృక‌తో పోలిస్తే నేటివిటీ ప‌రంగా మార్పులు చేర్పులు చేయ‌డానికి అతుల్ కుల‌క‌ర్ణి బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు. 80వ ద‌శ‌కంతో క‌థ‌ను మొద‌లుపెట్టి స్వ‌ర్ణ దేవాల‌యంపై దాడి.. 1983 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం.. ఎమ‌ర్జెన్సీ.. ఇందిరాగాంధీ హ‌త్య‌.. సిక్కుల ఊచ‌కోత‌.. అద్వానీ ర‌థ యాత్ర‌.. ఇలా అనేక అంశాల‌ను ట‌చ్ చేస్తూ హీరో ప్ర‌యాణాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేశారు. షారుఖ్ ఖాన్ ట్రేడ్ మార్క్ స్టైల్ లాల్ సింగ్ చ‌డ్డా నుంచే నేర్చుకున్న‌ట్లు.. రూపా బ‌నియ‌న్స్ పాపుల‌రైంది కూడా చ‌డ్డా వ‌ల్లే అన్న‌ట్లు కొన్ని స‌న్నివేశాల‌కు ఫ‌న్నీ ట‌చ్ ఇచ్చారు. ఇలాంటి సీన్లు ఓకే అనిపించినా.. సైనికుడైన హీరో ఒరిజిన‌ల్లో త‌న క‌మాండ‌ర్ ను కాపాడితే.. ఇక్క‌డ మాత్రం ఒక ఉగ్ర‌వాదిని కాపాడగా.. అత‌ను ప‌రివ‌ర్త‌న చెందిన‌ట్లు చూపించ‌డం విడ్డూరంగా అనిపిస్తుంది. అస‌లే లాల్ సింగ్ చ‌డ్డా మీద ఒక వ‌ర్గంలో ఉన్న నెగెటివిటీ చాల‌ద‌న్న‌ట్లు ఇలాంటి సీన్లు సినిమాకు చేటు చేయొచ్చు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే సినిమాలో వావ్ అనిపించే మూమెంట్స్ అయితే ఏమీ లేవు. కార్గిల్ నేప‌థ్యంలో వ‌చ్చే వార్ ఎపిసోడ్ సైతం తెర‌పై సాధార‌ణంగా అనిపించిందంటే సినిమా ఎలా మిస్ ఫైర్ అయిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక సినిమాలో నాగచైత‌న్య చేసిన బాల‌రాజు పాత్ర విష‌యానికి వ‌స్తే.. ఇది కూడా అనుకున్నంత ప్ర‌భావ‌వంతంగా లేదు. మాతృక‌లోని పాత్ర‌ను అనుక‌రించేలా చైతూ నోట్లో ఏదో పెట్టించి డైలాగులు చెప్పించ‌డానికి చూశారు కానీ అది కాస్తా ఎబ్బెట్టుగా త‌యారైంది. త‌న పాత్ర వెయ్యాల్సిన ఇంపాక్ట్ వేయ‌లేదు. ఒరిజిన‌ల్లో క‌దిలించేలా ఉండే ఈ పాత్ర ఇక్క‌డ విఫ‌ల‌మ‌వ‌డానికి కార‌ణాలేంటో విశ్లేషించ‌డం కూడా క‌ష్ట‌మే. ఇక సినిమాలో పూర్తిగా మిస్ ఫిట్ అనిపించే మ‌రో పాత్ర కరీనా క‌పూర్ చేసిన రూప‌. 40 ఏళ్లు దాటి ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన క‌రీనా.. ఇందులో హీరోతో టీనేజీ నుంచి సాగే పాత్ర‌లో ఎంత‌మాత్రం ఫిట్ అనిపించ‌దు. చాలా అస‌హ‌జంగా అనిపించే త‌న పాత్ర తెర‌పై క‌నిపించిన‌పుడ‌ల్లా చికాకు పుడుతుందే త‌ప్ప మంచి ఫీలింగ్ ఇవ్వ‌దు. పాత్ర‌లతో ఎమోష‌న‌ల్ క‌నెక్ష‌న్ లేక‌.. క‌థాక‌థ‌నాల్లోనూ మెరుపులు లేకపోవ‌డంతో లాల్ సింగ్ చ‌డ్డాను ఒక ద‌శ దాటాక భ‌రించ‌డం క‌ష్ట‌మే అవుతుంది. చివ‌రికొచ్చేస‌రికి నీర‌స‌మే మిగులుతుంది.

న‌టీన‌టులు:

ఆమిర్ కెరీర్లో చాలా వ‌ర‌కు త‌న వ‌ల్ల ఇంకా మెరుగుప‌డ్డ పాత్ర‌లే క‌నిపిస్తాయి కానీ.. త‌న వ‌ల్ల పూర్తిగా దెబ్బ తిన్న పాత్ర‌గా లాల్ సింగ్ చ‌డ్డా నిలుస్తుంది. ఒరిజిన‌ల్ క్యారెక్ట‌ర్ని కొంచెం భిన్నంగా చేసే ప్ర‌య‌త్నంలో ఆమిర్ అదుపు త‌ప్పాడు. త‌న లుక్స్.. హావ‌భావాలు చాలా ఇబ్బందిక‌రంగా మారాయి. చ‌డ్డా పాత్ర త‌న‌కో చేదు జ్ఞాప‌కంగా మిగిలిపోవ‌డం ఖాయం. క‌రీనా క‌పూర్ ను రూప పాత్ర‌కు తీసుకోవ‌డం మరో పెద్ద త‌ప్పిదం. ఆమె పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా క‌నిపించేందుకు బాగానే క‌ష్ట‌ప‌డ్డ‌ప్ప‌టికీ.. త‌ను మిస్ ఫిట్ అనే అనిపిస్తుంది. ప్ర‌త్యేక పాత్ర‌లో నాగ‌చైత‌న్య ప్ర‌త్యేక‌మైన ముద్ర ఏమీ వేయ‌లేక‌పోయాడు. త‌న వ‌ల్ల సినిమాకు కానీ.. సినిమా వ‌ల్ల త‌న‌కు కానీ ఏ ప్ర‌యోజ‌నం లేద‌నే చెప్పాలి. హీరో త‌ల్లి పాత్ర‌లో మోనా సింగ్ ప‌ర్వాలేదు. మిగ‌తా న‌టీన‌టులంతా మామూలే.

సాంకేతిక వ‌ర్గం:

లాల్ సింగ్ చ‌డ్డాకు సాంకేతిక హంగులైతే బాగానే కుదిరాయి. ప్రీత‌మ్ పాట‌లు బాగున్నాయి. తెలుగు సాహిత్యం విష‌యంలో శ్ర‌ద్ధ పెట్టారు. మామూలుగా హిందీ డ‌బ్బింగ్ సినిమాల్లోని పాట‌లతో పోలిస్తే ఇందులోనివి చాలా మెరుగ్గా. త‌ర‌రంపం పాట శ్రావ్యంగా అనిపిస్తుంది. మిగ‌తా పాట‌లూ ఓకే. త‌నూజ్ టికు నేప‌థ్యం సంగీతం కూడా బాగానే సాగింది. స‌త్య‌జిత్ పాండే విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌ల విష‌యంలో ఢోకా ఏమీ లేదు. బాగానే ఖ‌ర్చు పెట్టారు. ఈ సినిమాకు ర‌చ‌న చేసిన అతుల్ కుల‌క‌ర్ణిని త‌ప్పుబ‌ట్ట‌డానికేమీ లేదు. అత‌ను త‌న ప్ర‌య‌త్నం బాగానే చేశాడు. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాలు ఫారెస్ట్ గంప్ కు లాల్ సింగ్ చ‌డ్డాను పేల‌వ‌మైన అనుక‌ర‌ణ‌గా మార్చాయి. ద‌ర్శ‌కుడిగా అద్వైత్ చంద‌న్ విఫ‌ల‌మ‌య్యాడు.

చివ‌ర‌గా: లాల్ సింగ్ చ‌డ్డా.. క్లాసిక్ కాస్తా కామెడీ అయింది

రేటింగ్ - 2/5
× RELATED లవ్ టుడే
×