అందుకే రష్మిక ఆ పాత్రను ఒప్పుకుని ఉంటుందేమో!

తెలుగు .. కన్నడ భాషల్లో రష్మిక స్టార్ హీరోయిన్. ఈ రెండు భాషల్లో ఆమె తన పొజిషన్ ను కాపాడుకుంటూనే తమిళ .. హిందీ భాషల్లో నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. 'పుష్ప' సినిమాలో ఆమె పోషించిన 'శ్రీవల్లి' పాత్ర ద్వారా ఆమెకి పాన్ ఇండియా స్టార్ గుర్తింపు వచ్చింది. ఆ సినిమా సీక్వెల్లో కూడా ఆమె తన జోరు చూపించనుంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక మరొకరు హీరోయిన్ గా చేసిన సినిమాలో కీలకమైన పాత్రను పోషించడం నిజంగా విశేషమే. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు ఇలాంటి ప్రయోగాలు చేయరు.

సాధారణంగా సినిమాల్లో కొత్తదనం కోసమో .. మొహమాటం కోసమో ఒక మెట్టు క్రిందికి దిగితే ఇక అక్కడే ఉండిపోయే పాత్రలు వెతుక్కుంటూ వస్తుంటాయి. అందువలన హీరోయిన్లంతా కూడా 'దిగిరాను దిగిరాను దివి నుంచి భువికి ' అన్నట్టుగానే బెట్టు చేస్తుంటారు.

 అలా కాకుండా రష్మిక 'సీతా రామం' సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేసింది. దుల్కర్ - మృణాల్ జంటగా నటించిన ఈ సినిమాలో ఆమె అఫ్రీన్ అనే పాత్రలో కనిపించింది. 1960లలో రామ్ తో ప్రేమలో పడిన సీతా మహాలక్ష్మికి ఆయన రాసిన ఉత్తరాన్ని 1985 అందజేయడానికి వెళ్లే పాత్ర అది.

మామూలుగానే హీరోయిన్ కాకుండా మరో పాత్ర అంటూ ఏ దర్శకుడైనా ఎంట్రీ ఇస్తే ఏ హీరోయిన్ కూడా అలాంటి కథలను వినడానికి ఆసక్తిని చూపించదు. ఎందుకంటే రష్మిక కెరియర్ గ్రాఫ్ ఒక రేంజ్ లో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తరహా పాత్రలు చేస్తే .. తేడా కొట్టే అవకాశం లేకపోలేదు. పైగా ఇది ముస్లిమ్ యువతి పాత్ర .. అందునా పాకిస్తాన్ కి చెందిన పాత్ర. ఈ పాత్రను గురించి చెప్పినప్పుడు రష్మిక ఆలోచనలో పడిందనీ ఒక రోజంతా ఆలోచించుకుని ఆ తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హను రాఘవపూడి చెప్పాడు. ఆమె తప్ప ఆ పాత్రలో తాను మరొకరిని ఊహించుకోలేదని అన్నాడు.

ఈ సినిమా మొదలైన కొంతసేపటికే రష్మిక పాత్ర ఎంట్రీ ఇస్తుంది. హీరోహీరోయిన్ల కంటే ముందుగానే తెరపైకి వచ్చేస్తుంది. ప్రేక్షకులను హీరో హీరోయిన్ల దగ్గరికి చేర్చే బాధ్యతను తన భుజాలపై వేసుకుని ఆమె వెళుతుంటుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రలన్నింటినీ ఆమె టచ్ చేస్తుంది. మొదటి నుంచి చివరివరకూ ఆమె జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. అంతే కాదు కథలో అత్యంత కీలకమైన ట్విస్ట్ కూడా ఆమె పాత్రపైనే ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకూ ఆమెది కథను నడిపించే పాత్ర .. కథతో కలిసి నడిచే పాత్ర. అందువల్లనే రష్మిక ఈ పాత్రను చేయడానికి అంగీకరించి ఉంటుందనే విషయం సినిమా చూసిన తరువాతగానీ అర్థం కాదు.
× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×