టాలీవుడ్ మేకర్స్ ఈ విషయాన్ని గ్రహిస్తే మరిన్ని విజయాలు ఖాయం..!

పాండమిక్ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఏవిధంగా అయితే మార్పులు వచ్చాయో.. ప్రేక్షకుల అభిరుచి మరియు ఆలోచనా విధానంలోనూ చాలా మార్పులు వచ్చాయి. కరోనా టైంలో ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు.. ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా థియేటర్లలో సినిమాలు చూస్తున్నారు.

ప్రమోషనల్ కంటెంట్ తో వారి దృష్టిని ఆకర్షించిన చిత్రాలను చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందిస్తున్నారు. మిగతా సినిమాలను డిజిటల్ వేదికల మీద వీక్షించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

గట్టిగా ప్రమోషన్స్ చేసినా సినిమాలో విషయం లేకపోతే మాత్రం లాభం ఉండటం లేదు. మొదటి ఆటకే ప్లాప్ అని ముద్రవేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రచార కార్యక్రమాలతో హడావిడి చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బ తినడాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పొచ్చు.

ఎలాంటి సినిమాలు చూడాలనే విషయంలో ఆడియన్స్ చాలా క్లియర్ గా ఉన్నారు. కానీ ఫిలిం మేకర్స్ మాత్రం ప్రేక్షకుల నాడిని పట్టుకోలేకపోతున్నారు. గత ఆరేడు వారాలుగా ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా హిట్ లిస్టులో చేరలేదంటే పరిస్థితి అర్థం అవుతుంది.

ఈ నేపథ్యంలో 'బింబిసార' మరియు 'సీతా రామం' వంటి రెండు చిత్రాలు ఆగస్ట్ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. రెండూ తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' చిత్రం అన్ని ఏరియాల్లో విశేష స్పందన తెచ్చుకుంది. మ్ముఖ్యంగా మాస్ ఆడియన్స్ బాగా ఆకర్షిస్తోంది. ఫస్ట్ డే మార్నింగ్ షోకి అడ్వాన్స్ బుకింగ్స్ అంత గొప్పగా ఏమీ లేనప్పటికీ.. పాజిటివ్ టాక్ రావడంతో మ్యాట్నీ నుంచి పుంజుకుంది. ఫస్ట్ అండ్ సెకండ్ షో నాటికి హౌస్ ఫుల్స్ కనిపించాయి.

మరోవైపు వైజయంతీ మూవీస్ బ్యానర్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'సీతా రామం' మూవీ కూడా పాజిటివ్ టాక్ తో ప్రారంభించబడింది. ఎ సెంటర్స్ మరియు మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి.

'బింబిసార' మరియు 'సీతా రామం' చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ఏలోనూ మంచి వసూళ్ళు రాబడుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఫస్ట్ వీకెండ్ లో భారీ కలెక్షన్స్ గ్యారెంటీ అని చెబుతున్నారు. ఇది టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊరటానిచ్చే విజయాలని చెప్పాలి.

మంచి కంటెంట్ మరియు ఆసక్తికరమైన చిత్రాతో వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని ఈ రెండు సినిమాలతో మరోసారి నిరూపించారు. రొటీన్ కంటెంట్ - పాత కంటెంట్ ను థియేటర్లలో చూడటానికి సిద్ధంగా లేమని జనాలు చెప్పకనే చెప్పారు. ఫిలిం మేకర్స్ అంతా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని విజయాలు ఖాయమని చెప్పాలి.
× RELATED గౌట్ అఫీషియల్స్ గా మన వాళ్లు కామెడీ చేస్తున్నారా?
×