'కార్తికేయ 2' ట్రైలర్-2: చరిత్ర - పురాణాల మధ్య ఎపిక్ వార్..!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన పాన్ ఇండియా చిత్రం ''కార్తికేయ 2''. చందు మొండేటి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ 'కార్తికేయ' కు సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ రిలీజ్ కు రెడీ అయింది.

'కార్తికేయ 2' చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్ - ట్రైలర్ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకుని.. సినిమాపై అంచనాలు పెంచేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో తాజాగా ట్రైలర్-2 ను విడుదల చేశారు. మాస్ మహారాజా రవితేజ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం.. పరిష్కారం లిఖితం' అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. 'కార్తికేయ' లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి అన్వేషించగా.. ఈ భాగంలో శ్రీకృష్ణ తత్వం నేపథ్యంలో మిస్టరీని ఛేదించబోతున్నట్లు తెలుస్తోంది.

శ్రీకృష్ణుడి దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకోడానికి ద్వారక వెళ్లిన కార్తికేయ.. అక్కడి పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని తెలుసుకుంటాడు. 'నా వరకు రానంతవరకే సమస్య.. నా వరకు వచ్చాక అది సమాధానం' అంటూ అతను ఏదో మిస్టరీని ఛేదించడానికి బయలుదేరాడు. అతనితో పాటుగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ట్రావెల్ చేస్తుంది.

'ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడివి నువ్వే..' అని చెప్పడాన్ని బట్టి ఆ మిస్టరీతో డాక్టర్ కార్తికేయ కు లింక్ ఉన్నట్లు అర్థం అవుతోంది. ఈ క్రమంలో అతను తన ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.

చరిత్ర మరియు పురాణాల మధ్య యుద్ధాన్ని 'కార్తికేయ 2'  సినిమాలో చూడబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలియజెప్పారు. ఆసక్తికరమైన కథాకథనాలతో థ్రిల్లింగ్ అంశాలతో ఈ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ రూపొందించారు చందు మొండేటి. విజువల్స్ పరంగా ఈ సినిమా అబ్బుర పరుస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ - శ్రీనివాసరెడ్డి - ఆదిత్యా మీనన్ - వైవా హర్ష - తులసి తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు. మొత్తం మీద కృష్ణ ఈజ్ ట్రూత్ అంటూ వచ్చిన 'కార్తికేయ 2' రెండో ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసిందని చెప్పాలి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభోట్ల‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. కాల భైరవ సంగీతం సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 13న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 'కార్తికేయ 2' చిత్రం విడుదల కాబోతోంది. 'అర్జున్ సురవరం' వంటి సూపర్ హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్ నుంచి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 
 

× RELATED నితిన్ 'విక్రమ్' బిల్డప్ అవసరమా?
×