లుంగీలో సినిమాకు వెళ్లారని నో.. తర్వాతేమైందంటే?

లుంగీ ధరించిన వ్యక్తి సినిమా థియేటర్ కు రావటం.. అతగాడికి టికెట్ ఇచ్చేందుకు నో చెప్పిన వైనం సంచలనంగా మారటమే కాదు.. ఆ దేశంలోని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. మొత్తంగా లుంగీ ధరించి సినిమాకు వెళ్లిన వ్యక్తి ఉదంతం పెద్ద రచ్చగా మారటమే కాదు.. పలువురు లుంగీల్లో థియేటర్ కు వెళ్లి మరీ నిరసన తెలిపే వరకు వెళ్లింది. ఇంతకీ ఈ చిన్న విషయం అంత పెద్ద రచ్చగా మారిందన్న విషయంలోకి వెళితే..

బంగ్లాదేశ్ లోని ప్రముఖ మల్టీఫ్లెక్స్ గా ‘స్టార్ సినీ ప్లెక్స్’కు మంచి పేరుంది. తాజాగా ఢాకాలోని సదరు మల్టీ ప్లెక్సులో సినిమా చూసేందుకు సమన్ అలీ సర్కార్ అనే వ్యక్తి లుంగీ ధరించి వెళ్లాడు. అయితే.. అతడు లుంగీ ధరించాడన్న కారణాన్ని చూపించి టికెట్ కు నో చెప్పినట్లుగా సమన్ ఆరోపిస్తున్నారు.

తాను ఢాకాలోని మల్టీఫ్లెక్సుకు ‘పోరన్’ మూవీ చూసేందుకు వెళ్లగా.. తాను లుంగీ ధరించి వచ్చానన్న కారణంగా తనకు టికెట్ ఇచ్చేందుకు నో చెప్పినట్లుగా ఆయన ఆరోపించారు. ఈ వీడియో వైరల్ గా మారటం.. పలువురు ఈ మల్టీఫ్లెక్సు తీరుపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరసనలు చేపట్టారు.

పలువురు లుంగీ కట్టుకొని మరీ సదరు మల్టీఫ్లెక్సుకు వెళ్లి నిరసన చేపట్టారు. దీంతో.. విషయం సీరియస్ గా మారుతుందని గ్రహించిన సదరు మల్టీఫ్లెక్స్ సంస్థ.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

వస్త్రధారణ ప్రకారంగా తాము వినియోగదారుల పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించమని వివరణ ఇచ్చింది. సదరు వ్యక్తి అపార్థం చేసుకోవటం వల్లే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని చెప్పింది.

అయితే.. జరిగిన ఉదంతానికి తాము బాధ పడుతున్నట్లుగా పేర్కొన్న సదరు సంస్థ.. ఆ వ్యక్తితో పాటు.. వారి కుటుంబాన్ని అదే మల్టీఫ్లెక్సులో సినిమా చూసేందుకు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపింది. ట్విస్టు ఏమంటే.. ఈ సినిమాను చూసిన సదరు కుటుంబం.. అదే షోకు ‘పోరన్’ మూవీ నటుల్లో ఒకరైన సరిపుల్ రాజ్ కూడా వారితో కలిసి సినిమా చూడటం. కాస్త ఇబ్బంది ఎదురైనా.. చివరికి ఈ ఇష్యూకు శుభం కార్డు పడిందనే చెప్పాలి.
× RELATED తెలంగాణాలో టీడీపీ రీ ఎంట్రీ ... అక్కడ నుంచేనట...
×