కాంగ్రెస్ కు గడ్డుకాలం..: ఎప్పుడు ఎవరు వీడుతారో తెలియని భయం..

మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లుంది తెలంగాణలోని  కాంగ్రెస్ పరిస్థితి. గత ఎనిమిదేళ్లుగా కోలుకోలేని దెబ్బ తగిలించుకున్న ఆ పార్టీని ఇప్పుడు  సీనియర్లు ఒక్కొక్కరు విడిచిపెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితికి మరింత గడ్డుకాలం ఏర్పడింది.  ఇప్పటికే నల్గొండ జిల్లాలో పట్టున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా కమలం పార్టీలో చేరనున్నారు. ఒకరోజు ముందు ఆయన కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేశారు. అయితే పార్టీని వీడితున్నట్లు అర్థమైపోయినా ఏ పార్టీలోకి వెళుతారో చెప్పలేదు. కానీ శనివారం అనూహ్యంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. దీంతో ఆయన బీజేపీలోకి చేరున్నారనుకోవచ్చు. దీంతో కాంగ్రెస్ లో ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ కు కష్టకాలం మొదలైంది. 2014లో కాస్త సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదాను కలిగి ఉంది. 2018లో ఆ సీట్లు మరిన్ని తగ్గి ఆందోళనకరంగా మారింది. అయితే కాంగ్రెస్ లోగెలిచిన వారు ఒక్కొక్కరు అధికార టీఆర్ఎస్ లోకి జంప్ కొట్టడంతో ఆ పార్టీ మూడో స్థానానికి వెళ్లింది. అయితే ఈ పరిస్థితిని గమనించిన అధిష్టానం పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించారు. అప్పటికే కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ యూత్ ఫాలోయింగ్ ను బాగా పెంచుకున్నారు. ఇక పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత మరింత కేడర్లో మరింత ఉత్సాహం నెలకొంది.

అయితే పార్టీలోని సీనియర్లు మాత్రం రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించారు. వీహెచ్ లాంటి తదితరులు బహిరంగంగానే ప్రకటించారు.ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి ఢిల్లీ వెళ్లి పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి సీనియర్లను కలుస్తూ బుజ్జగిస్తూ వచ్చారు. కొన్ని రోజులు సమావేశాల ద్వారా సీనియర్లు ఒక్కతాటిపైకి వచ్చారని అనుకున్నారు. కానీ ఇంతలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత మరింతగా పెరిగింది. ఈ క్రమంలో బీజేపీ పట్టు సాధిస్తుండడంతో అసంతృప్తులంతా కమలం వైపు చూస్తున్నారు.

బీజేపీ ఇస్తున్న ఆఫర్లకు తోడుగా కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేకిలంతా ఆ పార్టీని వీడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని రోజుల కిందట రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ఆయన సోదరుడు వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పై శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు.

పార్టీలో రేవంత్ రెడ్డి వర్గాలను ఏర్పాటు చేశారని ఓ వర్గంపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఖైరతాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో దాసోజు శ్రవణ్ పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఈ నియోజవకవర్గంలో పీజీఆర్ కూతురును పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదేమోనని పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే శుక్రవారం రేవంత్ ను టార్గెట్ చేసుకొని సంచలన ఆరోపణలు చేసిన ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఉన్న ఫొటోలో నెట్టింట్లో ప్రసారం కావడంతో శ్రవణ్ బీజేపీలోకి చేరుతున్నారని అర్థమైపోయింది. నిన్న మొన్నటి వరకు  ఎలాంటి వ్యాఖ్యలు చేయని శ్రవణ్ ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. దీంతో ఇంకెవరు పార్టీని వీడుతారోనని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
× RELATED తెలంగాణాలో టీడీపీ రీ ఎంట్రీ ... అక్కడ నుంచేనట...
×