ఢిల్లీలో చంద్రబాబు జగన్ కలవడం లేదా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒకే రోజు వీరిద్దరూ ఢిల్లీలో ఉండనుండటమే ఇందుకు కారణం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్బంగా నిర్వహించే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో పాల్గొనాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం అందింది. అలాగే ఇదే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ కు కూడా ఆహ్వానం వచ్చింది. అంతేకాకుండా నీతిఆయోగ్ నిర్వహించే ముఖ్యమంత్రుల సమావేశానికి సీఎం జగన్ వెళ్లనున్నారు.

అయితే సీఎం జగన్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పాల్గొనబోరని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ముఖం చూడటం ఇష్టం లేక ఆయన ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టనున్నారని ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. సీఎం జగన్ కేవలం నీతిఆయోగ్ గవర్నరింగ్ కౌన్సిల్ ఏడో సమావేశంలో మాత్రమే పాల్గొంటారని చెబుతున్నారు.

ఆగస్టు 6న శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయల్దేరి.. 3.40కి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగే స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరవుతారని సమాచారం. సాయంత్రం 5.20గంటలకు విశాఖ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారని తెలుస్తోంది.

వాస్తవానికి ఆగస్టు 6న శనివారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్లో ఆజాదీ కా అమృతోత్సవ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. చంద్రబాబుకు ఎదురుపడకూదనే ఉద్దేశంతోనే సీఎం దానికి వెళ్లడం లేదని చర్చ జరుగుతోంది. పైగా శనివారం సీఎం షెడ్యూల్లో ఆజాదీ కా అమృతోత్సవ్ కంటే విశిష్టమైన కార్యక్రమాలేవీ లేవని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయినా సీఎం జగన్ ఈ కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నారని చెబుతున్నాయి.

కాగా ఆగస్టు 7న ఆదివారం ఉదయం 9.30కి జగన్ రాష్ట్రపతి భవన్కు వెళ్తారు. 9.45నుంచి 430 వరకు అక్కడ జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనమవుతారు. రాత్రి 8.15కి తాడేపల్లి చేరుకుంటారు.

కాగా.. ఢిల్లీలో సీఎం జగన్... ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు నిధులు తదితర అంశాలపై వారితో చర్చలు జరుపుతారని అంటున్నారు.
× RELATED నేనే పెద్ద తోపు...కాంగ్రెస్ అంటే కోమటి రెడ్డి ఒక్కడేనా .?
×