థాంక్యూ

చిత్రం : థాంక్యూ

నటీనటులు: నాగచైతన్య-రాశి ఖన్నా-మాళవిక నాయర్-అవికా గోర్-సుశాంత్ రెడ్డి-ప్రకాష్ రాజ్-ఈశ్వరి రావు-సంపత్-తులసి తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్
కథ: బి.వి.ఎస్.రవి
నిర్మాత: దిల్ రాజు-శిరీష్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్

'మనం' లాంటి మరపురాని సినిమాతో అలరించిన విక్రమ్ కుమార్-నాగచైతన్యల కలయికలో తెరకెక్కిన రెండో చిత్రం 'థాంక్యూ'. ఆహ్లాదకరమైన ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి విక్రమ-చైతూ జంట మరోసారి మ్యాజిక్ చేసిందా..? చూద్దాం పదండి.

కథ:

అభిరామ్ (నాగచైతన్య) ఇండియాలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం అమెరికాలో అడుగు పెడతాడు. ఓవైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే.. సొంతంగా ఒక మెడికల్ యాప్ తయారు చేసి ఇన్వెస్టర్స్ దృష్టిని ఆకర్షించడంతో అదే తన వ్యాపారంగా మారుతుంది. అందులో గొప్ప స్థాయికి చేరుకుంటాడు. కానీ ఈ విజయం తన ఒక్కడిదే అనే గర్వం తలకెక్కి అందరితోనూ దురుసుగా వ్యవహరిస్తాడు. అలాగే తనకు మొదట్నుంచి తోడుగా ఉన్న ప్రియ (రాశి ఖన్నా)ను నిర్లక్ష్యం చేస్తాడు. ఒకప్పుడు తనకు సాయపడి.. ఇప్పుడు తన సాయం కోసం వచ్చిన రావు (ప్రకాష్ రాజ్)ను అభి పట్టించుకోకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోతాడు. అభి తీరు నచ్చక ప్రియ అతణ్ని వదిలి వెళ్లిపోతుంది. ఈ స్థితిలో అభిలో అంతర్మథనం మొదలై.. ఏం చేశాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'థాంక్యూ' సినిమాతో మరే చిత్రానికీ పోలిక ఉండదని చిత్ర బృందం నొక్కి వక్కాణించినా.. ఈ సినిమా ప్రోమోలు చూస్తే 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్'.. 'ప్రేమమ్' లాంటి సినిమాలు గుర్తుకొచ్చిన మాట వాస్తవం. ఒక వ్యక్తి జీవితంలోని వివిధ దశలను చూపిస్తూ.. మనసు తలుపుల్ని తట్టే.. జీవిత సారాన్ని ప్రభోదించే సినిమాలు పై రెండే కాదు.. ఇంకా కొన్ని కనిపిస్తాయి. మలయాళంలో ఈ మధ్యే వచ్చిన 'హృదయం' కూడా ఈ కోవలోనిదే. ఐతే ఎంచుకున్న కథను ఒక ఫీల్ తో చెబితే.. ఎమోషన్ క్యారీ అయితే పాత చిత్రాలతో పోలిక అన్నది సమస్యే కాదు. ఇలా ఒకే కథతో మళ్లీ మళ్లీ మెప్పించిన సినిమాలు వివిధ జానర్లలో కనిపిస్తాయి. 'ఇష్క్'.. 'మనం' లాంటి చిత్రాలతో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను బాగా డీల్ చేయగలడని పేరున్న విక్రమ్ కుమార్.. చైతూతో కలిసి 'థాంక్యూ'లో మ్యాజిక్ చేసి ఉంటాడనే ఆశిస్తాం. కానీ ఒక దశ వరకు ఆ ప్రయత్నం బాగానే సాగినా.. ఆ తర్వాత కథాకథనాలు ఒక మూసలో సాగిపోవడం.. విక్రమ్ మార్కు మ్యాజికల్ మూమెంట్స్ మిస్ అవడంతో 'థాంక్యూ' చివరికి నిరాశనే మిగులుస్తుంది.

'థాంక్యూ' సినిమా గురించి నిర్మాత దిల్ రాజు సహా అందరూ ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది.. ఇందులోని ఫీల్ గురించే. ట్రైలర్ చూసినా సినిమాకు అదే ప్లస్ అవుతుందనిపించింది. కానీ ఇలాంటి సినిమాలకు అత్యంత కీలకమైన ఆ ఫ్యాక్టరే సినిమాలో మిస్ అయిన ఫీల్ కలుగుతుంది. దీనికి తోడు సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అంటూ ఏమీ లేవు. సినిమా ఆరంభంలోనే ఈ కథ ఎలా సాగుతుందనే విషయంలో ఒక అంచనా వచ్చేస్తుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి.. అన్నీ తానే సాధించానని విర్రవీగడం.. ఈ క్రమంలో అందరూ అతడికి దూరం కావడం.. ఒక దశలో అంతర్మథనం మొదలై వెనక్కి తిరిగి చూసుకోవడం.. తన ఎదుగుదలకు కారణమైన వ్యక్తులను కలిసి 'థ్యాంక్స్' చెప్పుకోవడం.. ఇదీ సినిమా లైన్. నిజానికి ఈ కథ మొత్తం తెలుసుకోవడానికి సినిమా అంతా చూడాల్సిన అవసరం లేదు. ఆరంభంలో చూపించే కొన్ని సన్నివేశాలతోనే ప్రేక్షకుడికి దీనిపై ఒక అంచనా వచ్చేస్తుంది. హీరో ఎదుగుదలను.. అహంకారంతో అందరినీ దూరం చేసుకునే తీరును చాలా సాధారణంగా చూపించాడు విక్రమ్ కుమార్. తొలి అరగంటలో అతడి మార్కు ఎక్కడా కనిపించదు.

ఐతే వెనక్కి వెళ్లి హీరో ప్రయాణాన్ని జీరో నుంచి చూపించే క్రమంలో అతడి తొలి ప్రేమకథను ప్రెజెంట్ చేసిన తీరు 'థాంక్యూ'లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కథ కొత్తది అని చెప్పలేం కానీ.. దాన్ని ఉన్నంతలో ఆసక్తికరంగా.. మంచి ఫీల్ తోనే చెప్పే ప్రయత్నం జరిగింది. అందులో రియలిస్టిగ్గా సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇంటర్మీడియట్ దశలో ప్రేమ అయినప్పటికీ.. ఆ కథను చాలా మెచ్యూర్డ్ గా అనిపించేలా డీల్ చేశాడు విక్రమ్. ఈ లవ్ స్టోరీలో బ్రేకప్ కు దారి తీసే సన్నివేశం చాలా కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్లో పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం.. తమన్ సంగీతం కూడా ఉత్తమంగా సాగడంతో 'థాంక్యూ' సరైన దిశలోనే నడుస్తున్నట్లు అనిపిస్తుంది. కొంచెం ఒడుదొడుకులతో సాగినా ఇంటర్వెల్ సమయానికి 'థాంక్యూ' ఓకే అనే అనిపిస్తుంది.  ద్వితీయార్ధంలో కాలేజ్ స్టోరీని చూడబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు మరింత ఎగ్జైట్ అవుతారు. కానీ ఇంటర్వెల్ నుంచి ఇంకో స్థాయికి వెళ్లాల్సిన 'థాంక్యూ'.. ఉన్న ఫీల్ ను చెడగొడుతుంది. ఎంతో ఊహించుకున్న కాలేజ్ స్టోరీ విషయం లేకుండా సాధారణంగా నడవడంతో క్రమంగా ఆసక్తి తగ్గిపోతుంది. 'పోకిరి' కటౌట్ నేపథ్యంలో సాగే ఈ ఎపిసోడ్ ఆరంభ సన్నివేశాలు బాగున్నా.. తర్వాతి సీన్లన్నీ విసుగెత్తిస్తాయి.

ఇందులో ఒక ప్రేమకథను చూపిస్తే రొటీన్ అయినప్పటికీ ఆసక్తి ఉండేదేమో. కానీ.. ఒక అబ్బాయితో హీరో వైరాన్ని చూపిస్తే కొత్తగా ఉంటుందని రచయిత-దర్శకుడు ఫీలయినట్లున్నారు. అదే దీనికి మైనస్ అయింది. కాలేజీలో అదే పనిగా కొట్టుకునే ఇద్దరు కుర్రాళ్ల స్టోరీ నీరసం తెప్పించేస్తుంది. అవికా గోర్ ను చూసి ఇంకో హీరోయిన్ అనుకుంటాం కానీ.. ఆమె పాత్రతో ట్విస్ట్ ఇచ్చారు. అది కూడా బ్యాక్ ఫైర్ అయింది. ఈ ఎపిసోడ్ ను ముగించిన తీరు కూడా సాధారణంగా అనిపిస్తుంది. హీరో తొలి ఫ్లాష్ బ్యాక్ కు ఇచ్చినట్లుగా.. ఈ స్టోరీకి సరైన పేఆఫ్ ఇవ్వలేకపోయాడు విక్రమ్ కుమార్. ఇక హీరో ప్రెజెంట్ స్టోరీకి ఇచ్చిన ముగింపు అయితే మరీ పేలవంగా అనిపిస్తుంది. ఆ సీన్లన్నీ చాలా రొటీన్ గా.. డ్రమటిగ్గా అనిపిస్తాయి. పతాక సన్నివేశాలకు వచ్చేసరికి ఎమోషన్ పూర్తిగా మిస్ అయి 'థాంక్యూ' ఒక సాధారణ చిత్రంగా మిగులుతుంది. విక్రమ్ కుమార్ నుంచి ఇంత మామూలు సినిమాను అసలు ఊహించలేం. ఏ కథ ఎంచుకున్నా ఎంతో కొంత కొత్తదనం ఉండేలా చూసుకోవడమే కాదు.. తన మార్కు మ్యాజికల్ మూమెంట్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలని చూసే విక్రమ్.. ఈసారి మాత్రం బాగా రాజీ పడిపోయాడనిపిస్తుంది.

నటీనటులు:

అక్కినేని నాగచైతన్య ఇప్పటికే 'ప్రేమమ్'లో ఇలాంటి పాత్రే చేశాడు. కాబట్టి అతను కొత్తగా ఏమీ కనిపించడు. కానీ అభిరామ్ పాత్రకు అతను పూర్తి న్యాయం చేశాడు. మూడు వేర్వేరు వయసుల్లో లుక్స్ పరంగా.. అలాగే ఆ సమయాల్లో పాత్ర తాలూకు ఆలోచన తీరుకు తగ్గట్లుగా అతను కన్విన్సింగ్ గా అనిపిస్తాడు. పెర్ఫామెన్స్ పరంగా చైతూకు కెరీర్లో గుర్తుంచుకోదగ్గ పాత్రల్లో ఇదొకటి. రాశి ఖన్నా అందంగా కనిపించింది. తక్కువ పరిధి ఉన్న పాత్రలో నటన పరంగా ఓకే అనిపించింది. లీడ్ హీరోయిన్ కాకపోయినప్పటికీ.. మాళవిక నాయర్ హైలైట్ అయింది. హీరోయిన్లలో ఎక్కువ గుర్తుంచుకునే పాత్ర తనదే. అవికా గోర్ బాగానే చేసింది కానీ.. తన పాత్ర అంత ఆకట్టుకోదు. ప్రకాష్ రాజ్ తన స్థాయికి తగని.. నామమాత్రమైన పాత్ర చేశాడిందులో. సంపత్ కూడా అంతే. సుశాంత్ రెడ్డికి కీలక పాత్రే దక్కింది కానీ.. ఆ క్యారెక్టర్ ప్రేక్షకులను చికాకు పెడుతుంది. సినిమాలో ఇంకే గుర్తుంచుకునే పాత్రలు లేవు.

సాంకేతిక వర్గం:

'థాంక్యూ'కు టెక్నికల్ సపోర్ట్ బాగానే కుదిరింది. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం గురించి కొత్తగా చెప్పేదేముంది? చాలా సాధారణమైన ఈ చిత్రానికి తన కెమెరాతో కొంచెం కళ తెచ్చింది ఆయనే. హీరో ఫస్ట్ లవ్ స్టోరీలో విజువల్ గా ఆయన మాయాజాలం స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని క్లోజప్ షాట్స్ కట్టి పడేస్తాయి. కాలేజీ ఎపిసోడ్లోనూ విజువల్స్ ఆకట్టుకుంటాయి. సంగీత దర్శకుడు తమన్ కూడా మెప్పించాడు. చార్ట్ బస్టర్స్ అనిపించే పాటలు లేవు కానీ.. ఉన్నవన్నీ సందర్భానికి తగ్గట్లు బాగానే కుదిరాయి. నేపథ్య సంగీతం కూడా ఓకే. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. బీవీఎస్ రవి కథతో విక్రమ్ సినిమా చేశాడంటే.. ఇందులో ఏదో విశేషం ఉండే ఉంటుందని అనుకుంటాం. కానీ అంత ప్రత్యేకంగా ఏమీ అనిపించదు కథ. విక్రమ్ కూడా స్క్రీన్ ప్లేతో పెద్దగా మెప్పించలేకపోయాడు. 'గ్యాంగ్ లీడర్' లాంటి ఫ్లాప్ మూవీలో కూడా తన మార్కు చూపించిన విక్రమ్.. ఈసారి మాత్రం సాధారణమైన ఔట్ పుట్ ఇచ్చాడు.

చివరగా: థాంక్యూ.. ఫీల్ మిస్సింగ్!

రేటింగ్- 2
× RELATED మాచర్ల నియోజకవర్గం
×