గార్గి

చిత్రం : 'గార్గి'

నటీనటులు: సాయిపల్లవి-కాళి వెంకట్-జయప్రకాష్-ఐశ్వర్యా లక్ష్మి-శరవణన్-ఆర్.ఎస్.శివాజి-లివింగ్ స్టన్ తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
ఛాయాగ్రహణం: స్రయంతి-ప్రేమ్ కృష్ణ
మాటలు: రాకేందు మౌళి
నిర్మాతలు: రవిచంద్రన్-థామస్ జార్జ్-ఐశ్వర్యా లక్ష్మి-గౌతమ్ రామచంద్రన్
రచన-దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్

పర భాషా నటి అయినప్పటికీ.. తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించి తన కోసం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చేసిన కథానాయిక సాయిపల్లవి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త సినిమా 'గార్గి'. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బహు భాషా చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గార్గి (సాయిపల్లవి) ఒక ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయురాలు. స్కూల్లోనే కాక సాయంత్రం పూట ఇంట్లోనూ పిల్లలకు పాఠాలు చెబుతూ తన పరిధిలో తాను సంతోషంగా బతుకుతుంటుంది. ఐతే ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే ఆమె తండ్రిని గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో గార్గి జీవితం ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. గార్గి తండ్రికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలుండడంతో ఆయనకు మద్దతుగా ఈ కేసును వాదించడానికి లాయర్ కూడా దొరకని పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి సమయంలో ఒక జూనియర్ లాయర్ సాయంతో గార్గి పోరాటం మొదలుపెడుతుంది. ఆ లాయర్ కీలక సాక్ష్యాలు సేకరించి.. కోర్టులో బలంగా వాదించడంతో కేసు కీలక మలుపులు తిరుగుతుంది. మరి గార్గి పోరాటం ఫలించిందా.. ఆమె తండ్రి ఈ కేసు నుంచి బయటికి వచ్చాడా.. వాస్తవంగా అసలేం జరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సినిమా అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా మారిపోయింది. సినిమాకు వచ్చేది కాసేపు ఎంటర్టైన్ కావడానికే అన్న ఉద్దేశంతో అటు ప్రేక్షకుడూ ఆలోచిస్తున్నాడు. ఇటు ఫిలిం మేకర్స్ ఆలోచనా అలాగే ఉంటోంది. అంతిమంగా సినిమా అనేది వ్యాపార ప్రయోజనంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టలేం. కానీ ఈ ఆలోచన ధోరణి వల్ల తప్పక చెప్పాల్సిన కథలు కొన్ని మరుగున పడిపోతున్నాయి. జనాల్లో ఆలోచన రేకెత్తించే ప్రయత్నాలు ఆగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో కొంతమంది మాత్రమే ఈ వ్యాపార ప్రయోజనాల గురించి ఆలోచించకుండా.. ప్రేక్షకుల ఆలోచన ధోరణి గురించి పట్టించుకోకుండా.. నిజాయితీగా కొన్ని 'చీకటి' కథల్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. 'గార్గి' టీం ఆ కోవకే చెందుతుంది. 'చిన్న పిల్లలపై లైంగిక ఈ వేధింపులు' అనే జనాలు బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడని ఒక సున్నితమైన అంశాన్ని ఎంతో అర్థవంతంగా చర్చిస్తూ.. చూసే ప్రతి ప్రేక్షకుడినీ ప్రభావితం చేసేలా.. ఒక ఆలోచన రేకెత్తించేలా తెరకెక్కిన మంచి ప్రయత్నం 'గార్గి'. ఈ కథను నరేట్ చేసిన తీరులో కొన్ని సమస్యలు ఉండొచ్చు. కథనం పరుగులు పెట్టకపోయి ఉండొచ్చు. కానీ అంతిమంగా ఈ సినిమా వేసే 'ఇంపాక్ట్' మాత్రం బలమైంది అనడంలో సందేహం లేదు.

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆరేళ్ల పాప మీద అఘాయిత్యం అని తరచుగా పేపర్లలో టీవీల్లో వార్తలు చూస్తుంటాం. కానీ ఆ క్షణానికి అయ్యో అనుకోవడం తప్ప.. ఆ దారుణానికి బలైన చిన్నారి మానసిక స్థితి ఎలా ఉంటుంది.. ఆ కుటుంబం పరిస్థితేంటి.. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కుటుంబాన్ని సమాజం ఎలా చూస్తుంది.. వారి కుటుంబ సభ్యులు పడే నరక యాతన ఎలా ఉంటుంది.. ఇలాంటి కేసుల్లో తప్పు చేయకుండానే నిందితుడిగా మారితే తన పరిస్థితేంటి.. అనే ఆలోచనలేవీ మనకు రావు. వేరే ఏ నేరం అయినా సరే.. లోతుపాతులన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కానీ.. ఇలాంటి కేసుల గురించి బహిరంగంగా ఒక చర్చ పెట్టడానికి మనసు అంగీకరించదు. ఐతే ఇలాంటి విషయాల మీద చర్చించకపోవడమే పెద్ద సమస్య అని.. ఇలాంటి విషయాలను కప్పి పెట్టేయడం వల్ల మరిన్ని ఘోరాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పే ప్రయత్నం జరిగింది 'గార్గి'లో. ఇలాంటి కథలను తెరపై చూడడం మనసుకు బాధ కలిగించవచ్చు. కానీ సినిమా మొత్తం పూర్తయ్యాక మనలో రేకెత్తే ఆలోచన.. ఈ సినిమా చూడాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. మనకు మనం అడ్డుగా ఒక తెర పెట్టుకుని మన ఆలోచనల్లోకి రానివ్వకుండా పక్కన పడేసిన కొన్ని విషయాల మీద లోతైన చర్చ జరిగింది 'గార్గి'లో.

తొమ్మిదేళ్ల చిన్నారిపై జరిగిన గ్యాంగ్ రేప్.. దానికి సంబంధించిన కోర్టు విచారణ నేపథ్యంలో నడిచే 'గార్గి' సినిమా చాలా వరకు పెయిన్ ఫుల్ గానే అనిపిస్తుంది. ఇది సినిమా చూడ్డానికి ముందే ప్రిపేరవ్వాల్సిన విషయం. కానీ బాధగా అనిపించినా సరే తట్టుకుని చూడగలిగితే ఈ సినిమా ఒక పాఠం లాగా మిగులుతుంది. ఒక గొప్ప సందేశం మన ఆలోచనల్లో నాటుకుపోతుంది. సినిమాకు అతి పెద్ద బలం.. కోర్టు విచారణ నేపథ్యంలో నడిచే సన్నివేశాలే. అవి చాలా సహజంగా ఆసక్తికరంగా సాగుతాయి. ఒక హిజ్రాను జడ్జిగా చూపించడం చూసి ముందు ఏదోలా అనిపించినా.. తనను చూసి సీనియర్ లాయర్ ఎగతాళిగా మాట్లాడితే.. ''ఒక అమ్మాయి బాధను.. మగాడి పొగరును సరిగ్గా అర్థం చేసుకోగల శక్తి నాకు మాత్రమే ఉంది. ఈ కేసు డీల్ చేయడానికి నేనే రైట్ పర్సన్'' అంటూ చెప్పే డైలాగ్ తో ఆ లాయర్ తో పాటు మన కళ్లు కూడా తెరుచుకుంటాయి. ఇలాంటి పాత్రను సృష్టించినందుకు దర్శకుడిని అభినందించకుండా ఉండలేం. ఇలా సినిమాలో మనసుకు హత్తుకునే మరిన్ని సన్నివేశాలున్నాయి.

మంచి కథ.. గొప్ప సందేశం.. ఆలోచన రేకెత్తించే సన్నివేశాలు ఉన్నప్పటికీ.. 'గార్గి'లో నరేషన్ కొంచెం ఎగుడు దిగుడుగానే సాగుతుంది. కొన్ని అనవసర సన్నివేశాలు.. ప్రేక్షకుడి ఆలోచనను తప్పుదోవ పట్టించే విషయాలు ఇబ్బంది పెడతాయి. చివరికి ఇచ్చే ట్విస్టు చూశాక.. అంతకుముందు చూపించిన చాలా సన్నివేశాలు వృథా అనిపిస్తాయి. వాటి ఔచిత్యం ఏంటో అర్థం కాదు. కొన్ని సన్నివేశాలు ఇల్లాజికల్ గా కూడా అనిపిస్తాయి. కానీ ఇందులో చర్చించిన మంచి అంశాలు.. ఇవ్వాలనుకున్న సందేశం ఈ తప్పులను మన్నించేలా చేస్తాయి. సాయిపల్లవి మరోసారి సినిమాల ఎంపికలో తన ప్రత్యేకతను ఈ సినిమాతో చాటిచెప్పింది. ఆమెను నమ్మి సినిమా చూసే వారికి కచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందీ సినిమా. కమర్షియల్ గా 'గార్గి' ఎలాంటి ఫలితాన్నందుకుంటున్నప్పటికీ.. ఇదొక మంచి ప్రయత్నం అనడంలో సందేహం లేదు.

నటీనటులు:

సాయిపల్లవి కీర్తి కిరీటంలో 'గార్గి' మరో కలికితురాయి అనడంలో సందేహం లేదు. ఇలాంటి సినిమాను ఎంచుకున్నందుకే ఆమెను ముందు అభినందించాలి. తన పెర్ఫామెన్స్ గురించి చెప్పడానికి చాలా ఉంది. సినిమా మొదలైన కాసేపటికే సాయిపల్లవి కాకుండా గార్గి కనిపించేలా చాలా సహజంగా ఆ పాత్రను పోషించిందామె. బయట ఎంతో పోరాడి ఇంటికి వచ్చాక నిరాశపూర్వకంగా తల్లి మాట్లాడినపుడు నిస్తేజంతో డైలాగులు చెప్పే సన్నివేశంలో సాయిపల్లవి నటన స్టాండౌట్‌ గా నిలుస్తుంది. ఆమెకు అండగా నిలిచే లాయర్ పాత్రలో కాళి వెంకట్ కూడా చాలా బాగా చేశాడు. సాయిపల్లవి తండ్రిగా కీలక పాత్రలో ఆర్.ఎస్.శివాజి కూడా చక్కగా నటించాడు. లివింగ్ స్టన్.. జయప్రకాష్.. శరవణన్.. ఇలా సహాయ పాత్రలు పోషించిన వాళ్లందరూ బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

'96' ఫేమ్ గోవింద్ వసంత మరోసారి హృద్యమైన నేపథ్య సంగీతంతో సినిమాకు బలంగా నిలిచాడు. పాటల్లేని ఈ సినిమాలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. స్రయంతి-ప్రేమ్ కృష్ణ కెమెరా పనితనం సినిమా శైలికి తగ్గట్లుగా సాగింది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రాకేందు మౌళి మాటలు సందర్భానికి తగ్గట్లుగా కుదిరాయి. ఇక రచయిత-దర్శకుడు మాత్రమే కాక ఈ సినిమా నిర్మాతల్లోనూ ఒకడైన గౌతమ్ రామచంద్రన్ ను ఇలాంటి కథతో చేసిన సాహసానికి ఎంత అభినందించినా తక్కువే. కమర్షియల్ హంగుల గురించి ఏమీ ఆలోచించకుండా అతను నిజాయితీగా ఒక కథ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలాంటి వాళ్లు అరుదుగా ఉంటారు. అతను ఇవ్వాలనుకున్న సందేశం చూసే ప్రతి ప్రేక్షకుడిలోకి బలంగా వెళ్తుంది. కథనాన్ని అతను ఇంకాస్త ఆసక్తికరంగా.. వేగంగా నడిపి ఉంటే బాగుండేది.

చివరగా: గార్గి.. చెప్పాల్సిన చూడాల్సిన కథ

రేటింగ్-2.75/5
× RELATED మాచర్ల నియోజకవర్గం
×