మా నీళ్ల ట్యాంక్‌

వెబ్ సిరీస్ రివ్యూ : మా నీళ్ల ట్యాంక్‌

న‌టీన‌టులు: సుశాంత్ - ప్రియా ఆనంద్ - సుద‌ర్శ‌న్ - ప్రేమ్ సాగ‌ర్ - నిరోషా  రామ‌రాజు - అప్పాజీ అంబ‌రీశ - బిందు చంద్ర‌మౌళి - బిగ్‌బాస్ దివి - అన్న‌పూర్ణ‌మ్మ - సందీప్ వార‌ణాసి - లావ‌ణ్య‌రెడ్డి త‌దిత‌రులు న‌టించారు.
సంగీతం: న‌రేన్‌ ఆర్ కె సిద్ధార్ధ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: అర్వింద్ విశ్వ‌నాథ్‌
స్టోరీ - స్క్రీన్‌ప్లే రాజ్ శ్రీ‌బిష్ట్‌, సురేష్ మైసూర్ (యాక్ట‌ర్ సురేష్‌)
మాట‌లు - పాట‌లు : కిట్టు విస్సాప్ర‌గ‌డ‌
ఎడిటింగ్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర రావు
నిర్మాత : ప్ర‌వీణ్ కొల్ల‌
ద‌ర్శ‌క‌త్వం : ల‌క్ష్మీ సౌజ‌న్య‌

వెండితెర‌పై జోరు త‌గ్గిన వాళ్లంతా ఇప్పుడు ఓటీటీల బాట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చేసి వెబ్ సిరీస్ లు, వెబ్ మూవీస్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి అక్కినేని నాగార్జున మేన‌ల్లుడు, యంగ్ హీరో సుశాంత్ ఎంట్రీ ఇస్తున్నారు. అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమాలో సెకండ్ హీరోగా క‌నిపించి మెప్పించాల‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ అది ప్రాధాన్య‌త లేని పాత్ర కావ‌డంతో సుశాంత్ కు పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం ర‌వితేజ న‌టిస్తున్న `రావ‌ణాసుర‌`లో నెగెటివ్ షేడ్స్ వున్న రోల్ లో క‌నిపించ‌బోతున్నాడు సుశాంత్. ఈ మూవీలో న‌టిస్తూనే సుశాంత్ డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. `మా నీళ్ల ట్యాంక్‌` వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. జీ 5 లో జూలై 15 శుక్ర‌వారం నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. నాగ‌శౌర్య‌ `వ‌రుడు కావ‌లెను` చిత్రంతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మైన ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ వెబ్ సిరీస్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

రాయ‌ల‌సీమ ప్రాంతంలోని బుచ్చివోలు గ్రామం. ఆ గ్రామ స‌ర్పంచ్‌ కోదండం (ప్రేమ్ సాగ‌ర్‌), అత‌ని భార్య చాముండి (నిరోషా)ల ముద్దుల త‌న‌యుడు గోపాల్ ( సుద‌ర్శ‌న్‌) ఆ ఊళ్లో వున్న నీళ్ల ట్యాంక్ పైకి ఎక్కి త‌ను ప్రేమిస్తున్న సురేఖ (ప్రియా ఆనంద్‌) క‌నిపించ‌డం లేద‌ని, త‌న‌ని త‌న తండ్రి కోదండ‌మే మాయం చేశాడ‌ని ఆరోప‌ణ‌లు చేస్తాడు. గోపాల్ తాత న‌ర‌సింహం (రామ‌రాజు) ఎప్పుడు అవ‌కాశం ల‌భిస్తుందా కోదండంని ఊరి జ‌నాల ముందు అడ్డంగా బుక్ చేసి స‌ర్పంచ్ ప‌ద‌విని ద‌క్కించుకోవాలా అని ఎదురుచూస్తుంటాడు. గోపాల్ నీళ్ల ట్యాంక్ ఎక్క‌డంతో త‌ను చెప్పింది చేయ‌క‌పోతే దూకి ఆత్య‌హ‌త్య చేసుకుంటాడ‌ని, అందుకు అంగీక‌రిస్తే సురేఖ ఎక్క‌డుందో ఎస్ ఐ వంశీ (సుశాంత్‌) వెతికి తీసుకొస్తాడ‌ని చెబుతాడు. అందుకు అంగీక‌రించిన కోదండం వెంట‌నే గురుమూర్తి (వాసు ఇంటూరి)ని ఎస్ ఐ వంశీ ద‌గ్గ‌రికి పంపిస్తాడు. ఇంత‌కీ సురేఖ ఎవ‌రు? త‌ను ఎక్క‌డ‌కి వెళ్లింది? త‌నని వంశీ తిరిగి తీసుకొచ్చాడా?  త‌ను ఎందుకు ఇంటి నుంచి పారిపోయింది? బుచ్చిబోలు గ్రామం నుంచి ట్రాన్స్‌ఫ‌ర్ కోసం ఎదురుచూస్తున్న వంశీ.. సురేఖ‌ని ఏం చెప్పి తిరిగి తీసుకొచ్చాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌దే ఈ వెబ్ సిరీస్ అస‌లు క‌థ.  

క‌థ - విశ్లేష‌ణ :

`మా నీళ్ల ట్యాంక్‌`.. రాజ్ శ్రీ‌బిష్ట్ తో క‌లిసి న‌టుడు సురేష్ ఈ వెబ్ సిరీస్ కు క‌థ‌ని అందించాడు. త‌నే డైరెక్ట్ చేయాల‌ని ప్లాన్ చేసుకున్నా చివ‌రి నిమిషంలో త‌ప్పుకోవ‌డంతో దీనికి లక్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. నాగ‌శౌర్య హీరోగా న‌టించిన `వ‌రుడు కావ‌లెను` సినిమాతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మైన లక్ష్మీ సౌజ‌న్య తొలిసారి ఈ వెబ్ సిరీస్ తో డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తోంది. రాయ‌ల‌సీమ‌లోని ఓ ప‌ల్లెటూరు బుచ్చివోలు నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. రాయ‌లసీమ ప్రాంత క‌థ కావ‌డంతో పాత్ర‌లన్నీ రాయ‌ల‌సీమ గ్రామీణ యాస‌తో ప‌క్కా సీమ నేటివిటీతో సాగుతాయి. కామెడీ ప్ర‌ధానంగా సాగే ఈ సిరీస్ ని స‌ర్పంచ్ ప‌ద‌వి కోసం సాగే రాజ‌కీయాలు, నీళ్ల ట్యాంక్, ఓ అమ్మాయి వ్య‌థ నేప‌థ్యంలో రూపొందించారు. మొత్తం 8 ఎపిసోడ్ లుగా నాలుగు గంట‌ల‌కు పైగా నిడివితో సాగ‌దీశారు. అంత వ‌ర‌కు ప్రేక్ష‌కుడు స‌హ‌నంతో ఎదురుచూసే ఆస‌క్తిక‌ర అంశాలు, ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు ఏ మాత్రం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

సుశాంత్ ని ఇందులో ఎస్ ఐ గా చూపించారు. ఒక్క‌సారి కూడా స్టేష‌న్ ని గానీ, ఆ ఎట్నాస్పియ‌ర్ ని గానీ చూపించే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోయారు. త‌ను న‌టించ‌ద‌గ్గ సిరీస్ కూడా కాదు ఇది. పేరు తెలియ‌ని న‌టుడు చేసినా ఓకే అనిపించే పాత్ర కోసం సుశాంత్ ని ఎంచుకు తీసుకున్నారో అర్థం కాదు. ఇక గోపాల్ పాత్ర‌లో న‌టించిన క‌మెడియ‌న్ సుద‌ర్శ‌న్ యూట్యూబ్ స్టార్ గా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా తండ్రి పాత్ర‌ని బ‌ఫూన్ చేస్తూ క‌నిపించాడు. బిగ్ బాస్ దివి పాత్ర కూడా ఇదే త‌ర‌హాలో సాగింది. ఇక క‌థ‌కు కీల‌కంగా నిలిచిన ప్రియా ఆనంద్ సురేఖ పాత్ర‌లో క‌నిపించింది. కానీ ఆ పాత్రని మ‌రింత ఫీల్‌తో చూపించ‌లేక‌పోయారు.

ఇక సిరీస్ ప్రారంభం లోనే హీరోయిన్ ప్రియా ఆనంద్‌ ఎవ‌రికీ చెప్ప‌కుండా అర్థ్రరాత్రి ఊరు వ‌దిలి చీరాల‌కు వెళ్ల‌డం.. గోపాల్ తో ప్రేమ, పెళ్లి కార‌ణంగానే తాను చీరాల వెళ్లాన‌ని చెప్ప‌డం స‌గ‌టు ప్రేక్ష‌కుడికి అంత ఎఫెక్టీవ్ గా అనిపించ‌దు. ఆ త‌రువాత క‌థలో హీరో, హీరోయిన్ లు వున్నా ఎక్కువ భాగం క‌మెడియ‌న్  సుద‌ర్శన్ నేప‌థ్యంలోనే సాగ‌డం, హీరో , హీరోయిన్ ల మ‌ధ్య పెద్ద‌గా ఆక‌ట్టుకునే సీన్ లు లేక‌పోవ‌డం.. ఫోక‌స్ మొత్తం స‌ర్పంచ్ రాజ‌కీయాలు, సుద‌ర్శ‌న్ యూట్యూబ్ వీడియోల గోల చుట్టే సాగ‌డం చాలా వ‌ర‌కు ఎపిసోడ్లు బోర్ కొట్టించాయి. వెబ్ సిరీస్ అంటే చాలా స్లోగా సాగుతుంది. కానీ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో వుంటుంది. కానీ ఈ సీరీస్ లో అవేవీ క‌నిపించ‌వు. ఆస‌క్తిని రెకెత్తించే స‌న్నివేశాలు కానీ, మ‌లుపులు కానీ ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఈ సిరీస్ లో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎస్ ఐ వంశీ, సురేఖ‌ల‌కు ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం వున్నా అది ఏ సంద‌ర్భంలోనూ బ‌య‌ట‌పెట్టే సీన్ ల‌ని రాసుకోక‌పోవ‌డంతో చూసే ఆడియ‌న్ కి ఇది క‌మెడియ‌న్ సుఎద‌ర్శ‌న్ కోసం చేసిన వెబ్ సిరీసా? లేక సుశాంత్ కోసం చేసిందా? అనే అనుమానం క‌లుగుతుంది. ప్ర‌తీ సీన్ చాలా స‌ప్ప‌గా సాగుతూ చూసే వాడికి నీర‌సం వ‌చ్చేలా వుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. బల‌మైన క‌థ‌, క‌థ‌నాలు లేక‌పోవ‌డంతో స‌న్నివేశాలు కూడా అదే స్థాయిలో సాగాయి.  

న‌టీన‌టుల న‌ట‌న‌:

`మా నీళ్ల ట్యాంక్‌`.. హీరో సుశాంత్ కిది తొలి వెబ్ సిరీస్. అయితే ఈ క‌థ త‌న లాంటి హీరో చేయ‌ద‌గ్గ‌ది మాత్రం కాదు. బ‌ల‌మైన క‌థ‌తో సుశాంత్ డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి వుంటే బాగుండేది. కొత్త వారు చేసినా ఫ‌ర‌వాలేద‌నిపించే పాత్ర కోసం సుశాంత్ ని ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. అత‌నికి త‌గిన ప్రాధాన్యం క్లైమాక్స్ లో త‌ప్ప‌ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఓ నాలుగు డైలాగ్ లు చెప్పించారు. అంత‌కు మించి త‌న పాత్ర‌కు, ప్రియా ఆనంద్ పాత్ర‌కు మ‌ధ్య సాగే ల‌వ్ ట్రాక్ గానీ, ఇద్ద‌రికి ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం అని బ‌య‌టికి చెప్ప‌లేని సీన్ లు కానీ లేవు. హీరో మ‌న‌సులో ఏముందో హీరోయిన్ తెలుసు కోవ‌డానికి మందు పార్టీ ఇవ్వ‌డం, త‌న‌తో క‌లిసి హీరోయిన్ మందు తాగ‌డం వంటివి చూపించారు. అది పెద్ద‌గా పేల‌లేదు. ఇక వంశీ పాత్ర‌లో సుశాంత్ కు న‌టించ‌డానికి పెద్ద‌గా స్కోప్ దొర‌క‌లేదు. రోటీన్ క్యారెక్టర్‌ లాగే వుంది. చివ‌రి ఎపిసోడ్ లో త‌ప్ప మిగ‌తా భాగాల్లో పెద్ద‌గా స్కోపే క‌నిపించ‌లేదు.

హీరోయిన్ ప్రియా ఆనంద్ ఇందులో సురేఖ‌గా కీల‌క పాత్ర‌లో న‌టించింది. త‌ల్లి చ‌నిపోవ‌డంతో స‌వ‌తి త‌ల్లి కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతూ వుండే పాత్ర త‌న‌ది. త‌న మ‌న‌సులో ఏముందో తండ్రికి చెప్ప‌లేక‌, త‌న మ‌న‌సులో దాచుకోలేక స‌త‌మ‌త‌మ‌య్యే యువ‌తిగా క‌నిపించింది. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక‌, తండ్రి మాట కాద‌న‌లేక.. వంశీకి త‌న మ‌న‌సులో వున్న మాట చెప్ప‌లేక‌ మాన‌సిక సంఘ‌ర్ష‌ణ ప‌డే యువ‌తిగా క‌నిపించి ఆక‌ట్టుకుంది. అయితే ఈ పాత్ర‌ని మ‌రింత కొత్త‌గా మ‌లిచి వుంటే బాగుండేది. ఈ సిరీస్ మొత్తంలో సింహ భాగాన్ని సొంతం చేసుకుంది క‌మెడియ‌న్ సుద‌ర్శ‌న్ ఒక్క‌డే. గోపాల్ పాత్ర‌లో త‌న‌దైన కామెడీతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. త‌ను హీరో అయితే సుశాంత్ పాత్ర సైడ్ హీరో అనేట్టుగా అత‌ని పాత్ర సాగింది. ఇక ఇత‌ర పాత్ర‌ల్లో స‌ర్పంచ్ కోదండంగా ప్రేమ్ సాగ‌ర్‌, అత‌ని భార్య‌గా `సిందూర‌పువ్వు` నిరోషా న‌టించారు. నిరోష‌కు బాబాయ్ గా రామ‌రాజు, ప్రియా ఆనంద్ త‌ల్లిదండ్రులుగా అప్పాజీ అంబ‌రీష‌,  బిందు చంద్ర‌మౌళి, ర‌మ్య‌గా బిగ్‌బాస్ ఫేమ్ దివి, టిఫిన్ అమ్ముకునే పాత్ర‌లో అన్న‌పూర్ణ‌మ్మ, ప్రేమ జంట‌గా సందీప్ వార‌ణాసి - లావ‌ణ్య‌రెడ్డి, కోదండం అసిస్టెంట్ గా వాసూ ఇంటూరి త‌మ త‌మ పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక వ‌ర్గం:

మా నీళ్ల ట్యాంక్ టెక్నిక‌ల్ వ్యాల్యూస్ సోసోగా వున్నాయి. డీఐ అంత‌గా చేయించిన‌ట్టుగా లేదు. అది తెర‌పై స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇక కిట్టు విస్సాప్ర‌గ‌డ మాట‌లు - పాట‌లు బాగున్నాయి. కానీ న‌రేన్‌ ఆర్ కె సిద్ధార్ధ్ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకునే స్థాయిలో లేదు. నేప‌థ్య సంగీతంపై మ‌రింత‌గా దృష్టి పెట్టి వుంటే బాగుండేది. అర్వింద్ విశ్వ‌నాథ్ ఛాయాగ్ర‌హణం బాగుంది కానీ సిరీస్ కాన్సెప్ట్ కు త‌గ్గ‌ట్టుగా టింట్ ని మెయింటైన్ చేసి వుంటే ఇంకా బాగుండేది. స్టోరీ - స్క్రీన్‌ప్లే రాజ్ శ్రీ‌బిష్ట్‌, సురేష్ మైసూర్ (యాక్ట‌ర్ సురేష్‌) అందించారు. అయితే దీనికి బ‌ల‌మైన స‌న్నివేశాల్ని క్రియేట్ చేయలేక‌పోయారు. స్క్రీన్ ప్లే కూడా ఆస‌క్తిక‌రంగా సాగ‌దు. `వ‌రుడు కావ‌లెను` సినిమాతో ద‌ర్శ‌కురాలిగా ఎంట్రీ ఇచ్చిన ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ వెబ్ సిరీస్ తోనూ ఆక‌ట్టుకోలేక‌పోయింది. త‌న‌కు బ‌ల‌మైన క‌థ‌, ప్రేక్ష‌కుడిని ఎంగేజ్ చేయ‌ద‌గ్గ స్క్రీన్ ప్లే ని రాసుకోవ‌డంతో విఫ‌లం కావ‌డంతో `మా నీళ్ల ట్యాంక్ `ని ర‌క్తిక‌ట్టించ‌లేక‌పోయింది.

చివ‌ర‌గా :`మా నీళ్ల ట్యాంక్` లో నీళ్లు లేవు.

రేటింగ్ : 1.5
× RELATED మాచర్ల నియోజకవర్గం
×