హ్యాపీ బర్త్ డే

చిత్రం : 'హ్యాపీ బర్త్ డే'

నటీనటులు: లావణ్య త్రిపాఠి-వెన్నెల కిషోర్-సత్య-నరేష్ అగస్త్య-గెటప్ శీను-వైవా హర్ష-సుదర్శన్-విద్యు తదితరులు
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
నిర్మాతలు: చెర్రి-హేమలత
రచన-దర్శకత్వం: రితేష్ రాణా

హ్యాపీ బర్త్ డే.. ఈ మధ్య కాలంలో ఆసక్తికర ప్రోమోలతో.. వెరైటీ ప్రమోషన్లతో యువ ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన చిత్రం. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రాణా రూపొందించిన సినిమా ఇది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

హ్యాపీ (లావణ్య త్రిపాఠి) తన పుట్టిన రోజు పార్టీ కోసమని రిట్జ్ గ్రాండ్ అనే హోటల్ కు వెళ్తుంది. కానీ అక్కడ బోరింగ్ గా సాగుతున్న పార్టీ నచ్చక.. అదే హోటల్లోని పోష్ పబ్ లో అడుగు పెడుతుంది. కొన్ని అనూహ్య పరిణామాల మధ్య ఆమె పర్సులోకి ఒక లైటర్ వచ్చి చేరుతుంది. దాని కోసం లక్కీ (నరేష్ అగస్త్య) అనే వెయిటర్ ఆమె వెంట పడతాడు. అతడితో పాటు మ్యాక్స్ పెయిన్ (సత్య).. ఇంకా కొందరు ఆమెను టార్గెట్ చేస్తారు. ఇంతకీ ఆ లైటర్లో ఏముంది.. హ్యాపి వెంట అందరూ ఎందుకు పడతారు.. అసలా హోటల్లో ఏం జరుగుతోంది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'హ్యాపీ బర్త్ డే' సినిమా జనాల దృష్టిని ఆకర్షించడానికి.. చిత్ర బృందం చేసిన క్రేజీ ప్రమోషన్లు ముఖ్య కారణం. ఆ ప్రమోషన్లను రొటీన్ గా లాగించేయకుండా.. వెరైటీగా ట్రై చేశారు. ఈ సినిమాలో హీరో ఎవరు అనే టాపిక్ మీద ఒక టీవీ స్టూడియోలో చర్చా కార్యక్రమం చేపట్టినట్లుగా సెటప్ చేయించి సత్య.. నరేష్ అగస్త్య.. వెన్నెల కిషోర్ వాదించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే టామ్ క్రూయిజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని రిలీజ్ చేసిన పోస్టర్.. అలాగే ప్రి రిలీజ్ ఈవెంట్లో అతడి పేరుతో ప్రదర్శించిన వీడియో.. ఇలాంటివన్నీ కూడా ఫన్నీగా.. క్రేజీగా అనిపించాయి. ఇవన్నీ దర్శకుడి సెన్సాఫ్ హ్యూమర్ ను తెలియజేసేవే. సినిమాలో సైతం రితేష్ రాణా ఇదే సెన్సాఫ్ హ్యూమర్  చూపించాడు. వ్యంగ్యం జోడిస్తూ.. పేరడీ టచ్ ఇస్తూ అతను తీర్చిదిద్దిన సన్నివేశాలు.. పేల్చిన పంచ్ డైలాగులకు కొన్ని చోట్ల నవ్వు ఆగదు. కానీ కేవలం కొన్ని సన్నివేశాలు బాగున్నంత మాత్రాన సినిమా మెప్పించేయదు. కథలోనూ విషయం ఉండాలి. కథనం ఆసక్తికరంగా సాగాలి. 'హ్యాపీ బర్త్ డే'లో అవే మిస్సయ్యాయి. విడివిడిగా కొన్ని ఎపిసోడ్లు.. సన్నివేశాల వరకు చూస్తే ఫన్నీగా అనిపించినా.. కథాకథనాలు మరీ బలహీనంగా ఉండడం వల్ల ఒక సినిమాగా మెప్పించడంలో 'హ్యాపీ బర్త్ డే' విఫలమైంది.

'హ్యాపీ బర్త్ డే' చూసిన వాళ్లను ఈ సినిమా కథేంటి అని అడిగితే.. పూర్తిగా వివరించాలంటే శక్తికి మించిన పనే అవుతుంది. అలా కాకుండా కట్టె కొట్టె తెచ్చె అనే తరహాలో సింపుల్ గా నాలుగు ముక్కలు చెప్పాలన్నా కూడా కష్టమే. అంత గందరగోళంగా నడుస్తుందీ సినిమా. కథను చెప్పే విధానంలో వైవిధ్యం చూపించుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ.. అదే సమయంలో అవసరమైన చోట్ల క్లారిటీ ఇవ్వడం కూడా ముఖ్యమే. కానీ కథలో కీలకమైన సన్నివేశాల్లో కూడా సూపర్ ఫాస్ట్ ఎడిటింగ్ తో.. విపరీతమైన జెర్కులతో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తూ సాగే నరేషన్ వల్ల అసలు తెరపై ఏం జరుగుతోందో అర్థం కాని అయోమయం తలెత్తుతుంది. అలా అని కథలో ఏమైనా మర్మం ఉందా.. షాకింగ్ గా ఏదైనా చూపించారా అంటే అదీ లేదు. ఆరంభం నుంచే సినిమా నాన్ సీరియస్ గా సాగడంతో కథ గురించి ఎక్కువ ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు. సర్రియల్ కామెడీ అంటూ.. లాజిక్స్ వెతకొద్దు.. సినిమాలో చూపించే ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకోవద్దు అంటూ ముందే డిస్క్లైమర్ కూడా వేసేయడంతో అదే మైండ్ సెట్ తోనే సినిమా చూడడం మొదలుపెడతాం కానీ.. అక్కడక్కడా కామెడీ సీన్లు మినహాయిస్తే ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కథనం మిస్ అవడంతో 'హ్యాపీ బర్త్ డే'తో కనెక్ట్ కావడం కష్టమవుతుంది.

ఐతే కథాకథనాల గురించి పట్టించుకోవడం మానేసి.. ఇదొక సినిమా అన్న విషయం మరిచిపోయి విడి విడిగా కామెడీ సీన్లను ఎంజాయ్ చేయడం మొదులపెడితే.. కొంత వరకు పైసా వసూల్ అనిపిస్తుంది 'హ్యాపీ బర్త్ డే'. సోషల్ మీడియాలో మీమ్స్ ఫాలో అయ్యే వాళ్లకు.. వాటిని ఎంజాయ్ చేసే వారికి కనెక్ట్ అయ్యేలా ప్రతి సీన్లోనూ పేరడీ టచ్ ఇస్తూ.. సెటైరికల్ కామెడీతో రితేష్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఒకటి రెండు అని కాదు.. ఇలా 'మీమ్' టచ్ ఉన్న మెరుపులకైతే సినిమాలో లెక్కే లేదు. అబ్బాయిలు అమ్మాయిల్లా మారి చేసే టిక్ టాక్ వీడియోల స్ఫూర్తితో వెన్నెల కిషోర్ చేయించిన కామెడీ కావచ్చు.. మ్యాక్స్ పెయిన్ గా సత్యతో చేయించిన విన్యాసాలు కావచ్చు.. వాట్సాప్ కొటేషన్లతో గుండు సుదర్శన్ వెన్నెల కిషోర్ కు చుక్కలు చూపించే సీన్స్ కావచ్చు.. కథతో సంబంధం లేకుండా నవ్వులు పంచుతాయి. ఇక ద్వితీయార్ధంలో ఒకచోట వెన్నెల కిషోర్ కు.. రష్యన్ స్మగ్లర్ కు మధ్య సత్య అనువాదకుడిగా వ్యవహరించే సీన్ ఒకటుంటుంది. ఆల్రెడీ 'నువ్వు నేను' లాంటి సినిమాల్లో చూసిన సన్నివేశానికి కొనసాగింపులా అనిపించినప్పటికీ.. అది కూడా కడుపుబ్బ నవ్విస్తుంది.

ఐతే ఇలా కొన్ని సన్నివేశాలకు వరకు కామెడీ వర్కవుట్ అయినా.. విషయం లేని కథ.. గందరగోళంగా నడిచే కథనం వల్ల ప్రేక్షకులు ఏ దశలోనూ సినిమాతో ట్రావెల్ అవ్వడానికి మాత్రం అవకాశం లేకపోయింది. సినిమా అంతా కామెడీ సీన్లతో నడిపించడమంటే కష్టం. కథ చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పిన ప్రతిసారీ ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అయిపోతాడు. సినిమాకు లీడ్ అయిన లావణ్య త్రిపాఠితో ముడిపడ్డ సన్నివేశాలన్నీ తేలిపోయాయి. ఇంటర్వెల్ దగ్గర ఇద్దరు లావణ్యలను చూపించి.. ద్వితీయార్ధంలో ఆ రెండు పాత్రల తాలూకు బ్యాక్ స్టోరీలను చూపించగా అవి మరీ బోరింగ్ గా తయారయ్యాయి. లావణ్య ఎపిసోడ్ నడుస్తున్నంతసేపు ఇదెప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇక కథలో కీలకంగా ఉన్నట్లుగా మొదట్లో చూపించే 'లైటర్'కు సంబంధించిన సీక్రెట్ ఏంటా అని చివర్లో చూస్తే అదీ తుస్సుమనిపిస్తుంది. ప్రథమార్ధంలో లావణ్య.. అగస్త్య.. సత్యలను పరిచయం చేస్తూ వారి కోణంలో వెరైటీ స్క్రీన్ ప్లేతో కథను చెబుతూ కాస్త ఎంగేజింగ్ గానే సినిమాను నడిపించాడు రితేష్. నిడివి కూడా తక్కువగా ఉండడంతో ఓకే అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధంలో అసలు కథను చెబుతున్నపుడు.. 'హ్యాపీ బర్త్ డే' పూర్తిగా ట్రాక్ తప్పేసింది. సాగతీతగా అనిపించి చివరికి చప్పగా ముగిసింది. సెటైరికల్.. పేరడీ టచ్ తో సాగే కామెడీ సీన్లు కొంత నవ్వించినా.. 'హ్యాపీ బర్త్ డే' ఓవరాల్ ఇంపాక్ట్ మాత్రం నెగెటివే.

నటీనటులు:

కెరీర్లో ఎక్కువగా సీరియస్.. ఏడుపుగొట్టు పాత్రలు చేసి విసుగొచ్చి ఈ పాత్ర చేసినట్లు లావణ్య త్రిపాఠినే విడుదలకు ముందు ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆమెకు కచ్చితంగా ఇది వైవిధ్యమైన పాత్రే. క్రేజీగా.. ఫన్నీగా సాగే పాత్రలో లావణ్యను చూడడం ప్రేక్షకులకు కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ పాత్రకు తగ్గట్లు గ్లామర్ డోస్ కూడా బాగానే ఇచ్చింది లావణ్య. కానీ సినిమాలో అత్యంత చికాకు పెట్టే.. బోర్ కొట్టించే పాత్ర లావణ్యదే కావడం విచారకరం. తన వంతుగా లావణ్య బాగానే కష్టపడ్డప్పటికీ.. ఈ పాత్ర ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోదు. రిత్విక్ సోధి పాత్రలో వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడు. అతడికి ఇలాంటి క్యారెక్టర్లు కొట్టిన పిండే. సత్యను సరిగ్గా వాడుకుంటే సటిల్ కామెడీతో ఎలా మెప్పించగలడో ఈ చిత్రం రుజువు చేస్తుంది. తనకే సొంతమైన టిపికల్ కామెడీ టైమింగ్ తో అతను అదరగొట్టాడు. 'మత్తు వదలరా'తో ఆకట్టుకున్న నరేష్ అగస్త్యకు ఇందులో సరైన పాత్ర పడలేదు. అతడి పాత్రతో ముడిపడ్డ సెంటిమెంటల్ కామెడీ వర్కవుట్ కాలేదు. గెటప్ శ్రీను పాత్ర పండలేదు. గుండు సుదర్శన్ వాట్సాప్ కోట్స్ కామెడీతో అలరించాడు. వైవా హర్ష.. విద్యు పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

'హ్యాపీ బర్త్ డే'కు సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. కాలభైరవ దర్శకుడి నరేషన్.. అభిరుచికి తగ్గట్లు డిఫరెండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. 'మత్తు వదలరా'లోని పాపులర్ థీమ్ ను కూడా వాడుకున్నాడు. అలాగే పేరడీ సీన్లకు తగ్గట్లు ఫన్నీ బీజీఎం ఇచ్చాడు. సురేష్ సారంగం కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. సినిమా జానర్.. మూడ్ కు తగ్గ కలర్ థీమ్స్ వాడాడతను. ఆర్ట్ వర్క్.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. రైటర్ కమ్ డైరెక్టర్ రితేష్ రాణా.. 'మత్తు వదలరా' తరహాలోనే రొటీన్ కు భిన్నమైన సినిమానే తీసే ప్రయత్నం చేశాడు కానీ.. తన తొలి చిత్రంలో మాదిరి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమీ ఇందులో లేవు. ఎంత సర్రియల్ కామెడీ అయినా.. లాజిక్కులతో సంబంధం లేకున్నా.. కథలో  కాస్తయినా సీరియస్నెస్ ఉండాలి. ప్రేక్షకులు ఏ దశలోనూ సీరియస్ గా తీసుకోని విధంగా మొత్తంగా రితేష్ సిల్లీ సీన్లతో నింపేయడం సమస్యగా మారింది.

చివరగా: హ్యాపీ బర్త్ డే.. నేల విడిచి కామెడీ

రేటింగ్-2.25/5
× RELATED పొన్నియన్ సెల్వన్
×