సంక్షోభంలో లంకేయులకు ఊపిరి క్రికెట్

భారత ఉప ఖండంలో క్రికెట్ క్రేజ్ అంతాఇంతా కాదు. భారత్ పాకిస్థాన్ శ్రీలంక బంగ్లాదేశ్.. కొన్నాళ్లుగా నేపాల్.. ఇలా ఒక్కో జట్టు ప్రపంచ క్రికెట్ పై తన ముద్ర చాటుతున్నాయి. భారత్ పాక్ఎన్నడో అంతర్జాతీయ జట్లుగా ఎదిగాయి. మూడు దశాబ్దాల కిందట శ్రీలంకకూ ఆ గుర్తింపు హోదా దక్కాయి. ఇక 1996 వన్డే ప్రపంచ కప్ గెలుపుతో లంక పెద్ద జట్టుగా ఎదిగిపోయింది.ఒక అర్జున రణతుంగ ఒక అరవింద డిసిల్వా సనత్ జయసూర్య కలువితరణ చమిందా వాస్ ముత్తయ్య మురళీధరన్ జయవర్థనే సంగక్కర దిల్షాన్ చెప్పుకొంటూ పోతే ఇలా ఎందరో మేటి క్రికెటర్లను అందించింది శ్రీలంక. ప్రస్తుతం ఆ జట్టు ఒడిదొడుకుల్లో ఉంది.

స్థానిక పరిస్థితులు క్రికెట్ పాలకులకు ముందుచూపు లేకపోవడంతో తదుపరి తరం క్రికెటర్లను తయారు చేసుకోలేకపోయింది. అయినా కొందరు ఉన్నత స్థాయి ఆటగాళ్లు ప్రస్తుతం ఆ దేశ జట్టుకు ఆడుతున్నారు. ఈ ద్వీప దేశం కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ద్రవ్యోల్బణం సైతం భారీగా పెరిగింది. ఇంధన సంక్షోభం ముదిరింది. శ్రీలంకను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సాయం కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది చివరి వరకు దేశంలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుందని ప్రధాని రణిల్ విక్రమసింఘే నేడు పార్లమెంటులో చెప్పారు. ఐఎంఎఫ్‌తో కొనసాగుతున్న బెయిల్ ఔట్ చర్చలు.. ఆగస్టు నాటికి రుణ పునర్నిర్మాణ ప్రణాళికను ఖరారు చేయడంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. దివాలా తీసిన దేశంగా ఈ చర్చల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.

బ్రిటిష్ కాలం నుంచే..

భారత్ లోలాగానే బ్రిటీష్ కాలం నుంచే శ్రీలంక లో క్రికెట్ భాగమైంది. తీవ్రమైన తమిళ ఈలం తీవ్రవాదం కొనసాగిన కాలంలోనూ లంకలో క్రికెట్ క్రేజ్ తగ్గలేదు. సరికదా.. ఆ సమయంలోనే వన్డే ప్రపంచ కప్ గెలిచింది. అయితే రెండేళ్లుగా కరోనా దెబ్బ.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అప్పుల భారం పెరగడం ఆర్థిక ప్రణాళికలు సరిగా లేకపోవడం ముందు చూపుతో వ్యవహరించక పోవడం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భారం అవినీతి తొందరపాటు నిర్ణయాలు వ్యవస్థ దివాలాకు కారణాలయ్యాయి.

నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. వంట గ్యాస్ కొరత కారణంగా.. వేలాది హోటళ్లు మూతపడ్డాయి. గంటల తరబడి కరెంట్ కోతలతో ప్రజలు కొవ్వొత్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. పెట్రోల్ కొరతతో  రవాణా సౌకర్యం లేక ఎన్నో స్కూళ్లు మూతపడ్డాయి. ప్రభుత్వం సైతం పాఠశాలలు యూనివర్సిటీలను నడిపించే పరిస్థితిలేక మూసేసింది. ఇంధన సరఫరాలను  పరిమితం చేసింది.  నిత్యవర వస్తువులు పెట్రోల్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు.

ప్రాణం పోస్తున్న క్రికెట్

ఇటీవల ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య వన్డే టి20 సిరీస్ జరిగింది. వన్డ్లే సిరీస్ ను శ్రీలంక 3-2తో గెల్చుకుంది. ప్రస్తుతం శ్రీలంక ఉన్న పరిస్థితుల్లో ఇది గొప్ప విషయమే. ఇలాంటి గందరగోళ పరిస్థితుల నుంచి శ్రీలంక ప్రజలకు క్రికెట్ కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఇటీవల శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్ట్‌కు హాజరైన ఓ వ్యక్తి చెప్పిన సంగతే దీనికి ఉదాహరణ. దేశంలోని   కఠిన పరిస్థితుల నుంచి క్రికెట్ చూసినప్పుడే ఈ బాధలన్నీ మరిచిపోయి సంతోషంగా ఉంటున్నామని అతడు చెప్పాడు. 'దేశంలో చాలా ఇబ్బందులున్నాయి.

ఈ సమస్యలతో చాలామంది ప్రజలు పేదలుగా నిస్సహాయులుగా మారారు. ఇందనం కోసం మేం ఐదు ఆరు రోజులు క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా పిల్లలకు సంతోషం లేదు. వారికి కావాల్సినవి తెచ్చివ్వలేని పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ చూసినప్పుడు మాకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నా కొడుకును ప్రొఫెషనల్ క్రికెటర్‌ను చేయాలని కలలు కన్నాను. కానీ ఈ ఊహించని సంక్షోభం మా జీవితాలను మార్చేసింది. మాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ మా పూర్తి సమయాన్ని దానికి కేటాయించే పరిస్థితి లేదు. దేశంలో సరైన ఉపాధి లేదు. అయితే క్రికెట్ చూడటం వల్ల ఈ ఒత్తిడి నుంచి మాకు కాస్త ఉపశమనం దొరుకుతుంది.'అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు.

ఆశలు రేపుతున్న లంక జట్టు

ఐదారేళ్లుగా తీవ్ర ఒడిదొడుకుల్లో ఉన్న లంక క్రికెట్ జట్టు ఇటీవల పుంజుకుంటోంది. సీనియర్లతో పాటు ప్రతిభావంతులైన జూనియర్ క్రికెటర్లు రాణిస్తుండడంతో గాడినపడుతోంది. ఆసీస్ పైన వన్డే సిరీస్ విజయమే దీనికి ఉదాహరణ. ముఖ్యంగా ఏంజెలో మాథ్యూస్ షనక చండిమాల్ కుశాల్ మెండిస్ ధనంజయ డిసిల్వా తదితరులతో బలంగా ఎదుగుతోంది. అయితే సంప్రదాయ టెస్టుల్లో మాత్రం లంక ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టును గమనిస్తే.. లంక పది వికెట్ల తేడాతో ఓడింది. కాగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు చేదు అనుభవం ఎదురైంది.

దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారన్న విపక్ష సభ్యుల నినాదాల నడుమ ఆయన మధ్యలోనే పార్లమెంటును వీడారు. కొంతమంది పార్లమెంటేరియన్లు ప్లకార్డులు పట్టుకుని ‘గొటా.. గో హోం’ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వీడియోను స్థానిక ఎంపీ హర్ష డిసిల్వా ట్విటర్ వేదికగా పంచుకున్నారు. దీన్ని దేశ చరిత్రలోనే ఇప్పటివరకు జరగని పరిణామంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గొటబాయ తన సహాయకులతో మాట్లాడి సభ నుంచి లేచి వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. ‘అయ్యో! శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ పార్లమెంటుకు రాక ఈ విధంగా ముగిసింది. ఆయన మధ్యలోనే సభను వీడాల్సి వచ్చింది. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు’ అంటూ ఎంపీ హర్ష ట్వీట్లో వ్యాఖ్యానించారు.
× RELATED ఏపీ ప్రజలకు మరో బాదుడు తెచ్చిన జగన్ సర్కార్?
×