బీజేపీ చాయిస్ : కాబోయే ఉప రాష్ట్రపతి ఆయనే....?

దేశంలో ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఈ నెల 18న ఎన్నికలు జరుగుతాయి. ఎన్డీయ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉంటే విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా రేసులో ఉన్నారు. ఇక ఇపుడు ఉప రాష్ట్రపతి ఎన్నికకు కూడా రంగం సిద్ధమైంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా జారీ అయింది.

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకారణ ఘట్టం కూడా స్టార్ట్ అయింది. ఇక బీజేపీ ఎవరిని నిలబెడుతుందో తెలియడంలేదు. అయితే సడెన్ గా కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మంత్రి  పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఐతే రేపటితో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పదవీ కాలం ముగుస్తుంది. ఆయన మళ్లీ రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేయలేదు. ఈ క్రమంలోనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

అయితే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం పొడిగించడకపోవడానికి కారణం ప్రతిష్ట కలిగిన భారత  ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకే అని చాలా కాలంగా వినిపిస్తున్న విషయం. ఇపుడు అది నిజం కాబోతోంది అని అంటున్నారు. నక్వీ పేరుని నేడో రేపో బీజేపీ హై కమాండ్ ప్రకటిస్తుంది అని అంటున్నారు.

బలమైన ముస్లిం మైనారిటీ నాయకుడ్గా నక్వీ ఉన్నారు. ఆయన ఎమర్జెన్సీ టైమ్ నుంచి రాజకీయాల్లో ఉన్న నేత. అన్నిటికీ మించి ఆయన బీజేపీకి వీర విధేయుడు. వాజ్ పేయ్ మంత్రి వర్గంలో తొలిసారి మంత్రిగా చేసిన ఆయన ఈ రోజు దాకా మోడీ కొలువులో కూడా పనిచేసి సమర్ధుడిగా పేరు తెచ్చుకున్నారు.

దేశంలో మత అసహనం పెచ్చరిల్లుతున్న నేపధ్యంలో బీజేపీ కేంద్రాన్ని ఏలుతున్న పార్టీగా గట్టి సందేశం ఇవ్వాలని భావించే నక్వీ పేరుని ఉప రాష్ట్రపతి పదవిని ప్రతిపాదిస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ అని ద్రౌపది ముర్ముకు చాన్స్ ఇచ్చిన బీజేపీకి ఇపుడు నక్వీని ఉప రాష్ట్రపతిని చేయడం ద్వారా దేశంలో బలమైన మైనారిటీ వర్గాలకు గట్టి భరోసా ఇవ్వాలని చూస్తోంది అంటున్నారు.

ఇపుడున్న పరిస్థితుల్లో ఏ రకమైన  మార్పు ఏమీ లేకపోతే కనుక నక్వీ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ తరఫున బరిలోకి దూసుకురావడం ఖాయం. ఇక ఉభయ సభలలో బీజేపీకి ఉన్న బలం కారణంగా ఆయన నెగ్గి తీరడం అన్నది లాంచనప్రాయం.
× RELATED ఏపీ ప్రజలకు మరో బాదుడు తెచ్చిన జగన్ సర్కార్?
×