పులివెందుల సీటు : ఆమె అక్కడ... జగన్ ఎక్కడ...?

పులివెందుల సీటు అంటే ఏపీలో ఒక చర్చ సాగుతుంది. 1978లో ఫస్ట్ టైమ్ వైఎస్సార్ పులివెందుల నుంచి పోటీ చేశారు. నాటి నుంచి వారి కుటుంబానికి అది కంచుకోటగా మారిపోయింది. వైఎస్సార్ తరువాత తమ్ముడు వివేకానందరెడ్డి వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ కుమారుడు జగన్ కూడా పులివెందుల నుంచే గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. జగన్ అయితే సీఎం గా కూడా చేస్తున్నారు.

పులివెందుల నుంచి ఎవరు గెలిచినా రాజకీయంగా ఫుల్ ఫోకస్ లో ఉంటారు. వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి అలాగే అంతా రాష్ట్ర నాయకులు అయ్యారు. ఇప్పటికి రెండుసార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యే అయిన జగన్ 2024 ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ రావడమే విచిత్రం. ఎందుకంటే ఈసారి కూడా ఆయన పులివెందుల నుంచే అన్న టాక్ ఉంది.

కానీ ప్రచారం అయితే అలా లేదు. ఈసారి జగన్ పులివెందుల నుంచి మారుతారు అని అంటున్నారు. పైగా ఆ సీటు మీద దివంగత నేత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత పోటీ చేస్తారు అని చెబుతున్నారు. సునీత అయితే ఏకంగా జగన్ కి ఎదురు నిలిచి పోరాడుతున్నారు. తన తండి హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం అసలు నిందితులను పట్టుకోవడం లేదని ఆమె గతంలో ఆరోపించి సంచలనం రేపారు.

ఆమె గట్టి ప్రయత్నం మీదనే సీబీఐ విచారణ జరుగుతోంది. అయితే సీబీఐ విచారణ కూడా నత్తనడకగా సాగుతూండడంతో వైఎస్ సునీత అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమె వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా తనను తాను రుజువు చేసుకునే పనిలో ఉన్నారని అంటున్నారు. అందుకే ఆమె పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగుతారు అని అంటున్నారు.

అయితే టీడీపీ తరఫున ఆమె కడప లోక్ సభ అభ్యర్ధిగా కూడా బరిలో ఉంటారని మరో టాక్ ఉంది. కానీ ఇపుడు జరుగుతున్న ప్రచారం కాస్తా ఆసక్తిని రేపేదిగా ఉంది. అదెలా ఉంటే పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్ధిగా సునీత పోటీ చేస్తారు అన్నదే ఆ టాక్. మరి జగన్ అన్న తో విభేదించి సాగుతున్నా ఈ చెల్లెమ్మ పోటీ నిజంగా చేస్తారా. వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉంటారా అన్న ప్రశ్నలు ఉన్నాయి.

అయితే రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చే క్రమంలోనే సునీతకు పులివెందుల సీటు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతునాయని అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ జమ్మలమడుగు సీటు నుంచి పోటీకి దిగుతారు అని తెలుస్తోంది. వైఎస్సార్ ఫ్యామిలీకి పులివెందుల తరువాత కంచుకోట లాంటి మరో సీటుగా జమ్మలమడుగు చెబుతున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ సుధీర్ ఉన్నారు. ఆయన మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుని కుమారుడు.

ఇక ఇక్కడ టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుని కుమారుడు పోటీలోకి దిగుతారు అని అంటున్నారు. బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి కూడా ఆ సమయానికి తన మద్దతు ఇస్తారు అని అంటున్నారు. ఏకంగా జగనే పోటీకి దిగితే అక్కడ టీడీపీ కూడా తన ప్లాన్ మార్చడం ఖాయం. ఇవన్నీ పక్కన పెడితే తండ్రి కాలం నుంచి అట్టేబెట్టుకున్న పులివెందుల సీటు చెల్లెలు సునీతకు ఇచ్చేందుకు జగన్ నిజంగా రెడీ అవుతారా. ఆ విధంగా బాబాయ్ వివేకా ఫ్యామిలీకి రాజకీయంగా అవకాశాన్ని ఇవ్వడంద్వారా టీడీపీ సహా విపక్షాలకు చెక్ చెప్పాలని భావిస్తున్నారా అంటే జవాబు కాలమే చెప్పాలి.
× RELATED ఏపీ ప్రజలకు మరో బాదుడు తెచ్చిన జగన్ సర్కార్?
×