మెగా హీరో లండన్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?

టాలీవుడ్ లో కొంత మంది హీరోలు పాన్ ఇండియా స్థాయి బ్లాక్ బస్టర్ లని సూపర్ హిట్ లని సొంతం చేసుకుంటుంటే కొంత మంది మాత్రం కొత్తగా ఏది చేసినా కలిసి రావడంలేదు. ఈ జాబితాలో యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ముందు వరుసలో నిలుస్తున్నాడు. కొత్త తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవాలని కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలని ఎంచుకుంటూ వెళుతున్న వరుష్ తేజ్ కు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు.  

బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ నటించిన మూవీ `గని`. అల్లు బాబి సిద్దు ముద్దల కాంబినేషన్ లో అల్లు అరవింద్ సమర్పణలో చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాలతో ఎంతో శ్రమించి చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించకపోవడంతో రెండవ రోజే డిజప్పాయింగ్ కి గురైన వరుణ్ తప్పు జరిగిపోయిందని ఓపెన్ లెటర్ ని విడుదల చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక ఆ తరువాత విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ చేసిన కామెడీ ఎంటర్ టైనర్ `ఎఫ్ 3` కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. `ఎఫ్ 2`కు సీక్వెల్ గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సక్సెస్ ని ఏ మాత్రం మ్యాచ్ చేయలేకపోయింది.

అయితే నష్టాలని మాత్రం అందించలేదు. దీంతో రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ తనకు చేదు అనుభవాన్ని అందించడంతో వరుణ్ తేజ్ ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో వున్నారట.

ఇందులో భాగంగా ఆయన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ భారీ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ లండన్ లో జరగబోతోంది. ఇందు కోసం త్వరలో వరుణ్ తేజ్ లండన్ వెళ్లబోతున్నాడు. వరుణ్ కి ఇంతకు ముందు లండన్ సెంటిమెంట్ వుంది. గతంలో తను నటించిన `తొలి ప్రేమ` అత్యధిక భాగం షూటింగ్ లండన్ లోనే చేశారు. రాశిఖన్నా హీరోయిన్ గా వెంకీ అట్లూరి రూపొందించిన ఈ మూవీ వరుణ్ తేజ్ కు మంచి విజయాన్ని అందించింది.

అదే సెంటిమెంట్ ప్రవీణ్ సత్తారు సినిమాకు సెంటిమెంట్ గా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట. అంతే కాకుండా ఇటీవల `గని` తో గట్టి ఎదురుదెబ్బ తగలడంతో ఇకపై కొత్త దర్శకులతో చేయకూడదని స్టార్ డైరెక్టర్ లతో మాత్రమే సినిమాలు చేయాలని వరుణ్ నిర్ణయించుకున్నారట. త్వరలోనే స్టార్ డైరెక్టర్ సుకుబమార్ డైరెక్షన్ లో ఓ భారీ మూవీని పట్టాలెక్కించాలనే ఆలోచనలో వరుణ్ తేజ్ వున్నట్టుగా తెలుస్తోంది. 
× RELATED డబ్బు జల్లడంలో టాలీవుడ్ తర్వాతనే ఎవ్వరైనా?
×