పిక్ టాక్: చేతిలో హాకీ స్టిక్ తో.. మాస్ లుక్ లో చైతూ..!

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. 'మజిలీ' 'వెంకీ మామ' 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న చైతూ.. ఇప్పుడు ''థాంక్యూ'' చెప్పడానికి రెడీ అయ్యారు.

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''థ్యాంక్యూ''. 'మనం' వంటి క్లాసిక్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే 'థాంక్యూ' సినిమా నుంచి వచ్చిన టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇందులో చై మూడు విభిన్నమైన షేడ్స్ తో కనిపిస్తారని ప్రమోషనల్ కంటెంట్ ను బట్టి అర్థమైంది. ఓవైపు లవర్ బాయ్ గా కనిపిస్తూనే.. మరోవైపు మాస్ లుక్ తో ఆకట్టుకున్నారు.

ఈ క్రమంలో తాజాగా 'థాంక్యూ' నుంచి ఓ కొత్త పోస్టర్ వచ్చింది. ఇందులో నాగచైతన్య చేతిలో హాకీ స్టిక్ పట్టుకొని యాటిట్యూట్ చూపిస్తున్నాడు. డెనిమ్ షర్ట్ - జీన్స్ ధరించిన చైతూ.. రఫ్ గడ్డంతో మాసీగా కనిపిస్తున్నారు.

తన ఎదుగుదలకు తన ప్రతిభే కారణమని భావించే ఓ యువకుడు.. తన తప్పు తెలుసుకుని కెరీర్ లో భాగమైన వారందరినీ వెదుక్కుంటూ వెళ్లి కృతజ్ఞతలు చెప్పడమే 'థాంక్యూ' సినిమా కథాంశమని తెలుస్తుంది.

ఇందులో చైతన్య సరసన అందాల రాశీ ఖన్నా - మాళవిక నాయర్ - అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. హీరో లైఫ్ లో మూడు స్టేజ్ లలో ముగ్గురు కథానాయికలు కనిపిస్తారు. ప్రకాష్ రాజ్ - సుశాంత్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి బీవీఎస్ రవి కథ అందించారు. దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తుండగా.. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

''థాంక్యూ'' మూవీ జూలై 22 నుండి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్న నాగచైతన్య.. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×