పాయింటే మరి : ఈపాటి భాగ్యానికి ఉద్ధవ్ నే సీఎం చేస్తే ...?

వ్రతం  చెడింది ఫలితం దక్కలేదు ఇది మహారాష్ట్ర కమలదళాన్ని రగిలిస్తున్న విషయం. సాయంత్రం దాకా తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని బీజేపీ  నేతలు గంతులేశారు. సంబరాలు చేశారు. మరి ఏమైదో ఏమో ఢిల్లీ ఆదేశాలు వేరేగా ఉన్నాయి. క్షణాల్లో డిప్యూటీ కాస్తా సీఎం అయిపోయారు. అలా ఏక్  నాధ్ షిండే ముఖ్యమంత్రి కాగా అయిదేళ్ల పాటు దర్జాగా బీజేఎపీ తరఫున సీఎం గిరీని వెలగబెట్టిన ఫడ్నఫీస్ డిప్యూటీగా బాగా తగ్గిపోయారు.

మరి ఈ తగ్గుడేదో నాడే చేసి ఉంటే ఉద్ధవ్ సీఎం అయ్యేవారు కదా. అసలు సీన్ లోకి శరద్ పవార్ ఎన్సీపీ కానీ సోనియా గాంధీ కాంగ్రెస్ కానీ వచ్చేవా అన్న ప్రశ్నలు అయితే సామాన్యుడి నుంచి మేధావుల దాకా వినిపిస్తున్నాయి. దీని మీదనే తాజా మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కూడా గట్టిగానే  రియాక్ట్ అయ్యారు. తన లేటెస్టు బద్ధ  శత్రు పక్షం బీజేపీని ఆయన ఇలా అడిగి కడిగేశారు.

నాడే అంటే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాకనే చెరి సగం పదవీకాలం అని తాము పెట్టిన ప్రతిపాదనను మర్యాదగా బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే సరిపోయేది కదా అని ఉద్ధవ్ థాక్రే అన్న మాటలు అందరినీ ఇపుడు ఆలోచింపచేస్తున్నాయి. తాను నాడు చేసిన ప్రతిపాదనను అమిత్ షా ఎందుకు ఒప్పుకోలేదని ఆయన నిలదీశారు. మీ వల్లనే కదా మహా వికాస్ అఘాడీ అన్నది సీన్ లోకి వచ్చింది అని కూడా బాగా దుయ్యబెట్టారు.

ఇక మూడేళ్ళ పాలనకు దగ్గరపడుతున్న వేళ అన్ని రకాల పిల్లి మొగ్గలూ  చేసి అంతకంతకు దిగజారి నేలబారుడు రాజకీయమంతా చేసి బీజేపీ చేసింది అదే పని కదా అని ఆయన నిగ్గదీయడంలో లాజిక్ పాయింట్ ఉంది అనే అంటున్నారు. మనం కూటమిగా ఉన్నపుడు ప్రభుత్వానికి అంగీకరించి ఉంటే మర్యాద బాగా ఉండేది ఇపుడు ఏం జరుగింది  మీ మర్యాద మీరు తీసుకున్నారు అని ఉద్ధవ్ బీజేపీ పెద్దల చెవికి సోకని చేదు నిజాలు చెబుతున్నారు.

కిందా పడి మీదా పడి ఇంతా మీరు చేసిన ఈ మహా  ప్రయోగంలో శివసేన సీఎం అంటూ ఎవరూ లేరు. ఏక్ నాధ్ షిండే శివసేన కార్యకర్త అని చెప్పుకునే వారు మాత్రమే అని గాలి తీసేశారు. అయినా కానీ ఇంతకీ బీజేపీ ఏం సాధించింది అంటే మహారాష్ట్ర భూభాగం అంతా  రాజకీయ మచ్చను అని అంటున్నారు.

సర్కార్లను కూలదోయడం అన్న చెడ్డ పేరుని మోస్తున్నారు. తీరా అంతా చేసి చివరి రెండేళ్ళు అయినా బీజేపీ పాలన చేస్తోందా అంటే అదీ లేదు. మొత్తానికి కమలానికి పీఠమైనా  దక్కలేదు ఒకనాటి మిత్రపక్షం అయిన శివసేన దెప్పులు సూటిపోటి మాటలు  బోనస్ గా దండీగానే దక్కుతున్న పరిస్థితి. మహా బీజేపీ కష్టాలు ఇన్ని అన్ని కావుగా. మర్యాద పోయిందిగా అన్న ఉద్ధవ్ మాటలు అసలు ఏ రాత్రికైనా  నిద్ర పట్టనిస్తాయా.
× RELATED ఏపీ ప్రజలకు మరో బాదుడు తెచ్చిన జగన్ సర్కార్?
×