చోర్ బజార్

మూవీ రివ్యూ :  చోర్ బజార్

నటీనటులు: ఆకాశ్ పూరి-గెహనా సిప్పీ-సుబ్బరాజు-సునీల్-సంపూర్ణేష్ బాబు తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
నిర్మాత: వి.ఎస్.రాజు
రచన-దర్శకత్వం: జీవన్ రెడ్డి

బాల నటుడిగా పేరు తెచ్చుకుని.. హీరోగా కూడా కొన్ని ప్రయత్నాలు చేసిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాశ్.. ఇంకా కథానాయకుడిగా తొలి విజయాన్నందుకోలేదు. గత ఏడాది ‘రొమాంటిక్’తో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న అతను.. ఇప్పుడు ‘చోర్ బజార్’తో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ‘జార్జి రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం ఆకాశ్ కు ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.

క‌థ:

బ‌చ్చ‌న్ (ఆకాష్ పూరి) ఒక అనాథ‌. బేబీ (అర్చ‌న‌) ప‌సిబిడ్డ‌గా ఉన్న‌పుడే చేర‌దీసి పెంచుతుంది. అత‌ను హైద‌రాబాద్ సిటీలో దొంగ‌త‌నం చేసిన వ‌స్తువులు అమ్మే చోర్ బజార్‌లోనే పెరిగి పెద్ద‌వుతాడు. ఆ బజార్ అంతా అత‌డి క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తుంటుంది. బ‌య‌ట ఖ‌రీదైన కార్ల టైర్లు చోరీ చేసి ప‌ట్టుకొచ్చి చోర్ బ‌జార్లో అమ్ముతుంటాడు బ‌చ్చ‌న్. అత‌ను తాను జ‌మీందారు కొడుకున‌ని చెప్పి ఒక పేరున్న కుటుంబానికి చెందిన ఒక మూగ‌ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అత‌ణ్ని ఇష్ట‌ప‌డుతుంది. కానీ అమ్మాయి ఇంట్లో చెప్పి త‌మ పెళ్లికి ఒప్పించ‌డం ఎలాగో తెలియ‌ని అయోమ‌యంలో ఉంటాడు బ‌చ్చ‌న్. ఇంత‌లో ఒక మ్యూజియం నుంచి మాయ‌మైన 200 కోట్ల వజ్రం చోర్ బ‌జార్ చేరుతుంది. దీంతో పోలీసులు ఆ బ‌జార్ మీద ప‌డతారు. మ‌రోవైపు చోర్ బ‌జార్ ను మూయించ‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటినీ బ‌చ్చ‌న్ ఎలా అధిగ‌మించాడు.. తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా ద‌క్కించుకున్నాడు అన్న‌ది మిగ‌తా క‌థ‌.

కథనం-విశ్లేషణ:

దళం.. జార్జి రెడ్డి సినిమాలు అనుకున్నంతగా ఆడకపోయి ఉండొచ్చు. కానీ ఆ సినిమాలు చూసినవాళ్లు అవి తీసిన దర్శకుడిలో విషయం ఉందని ఒప్పుకుంటారు. ఎందరో స్టార్లకు సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు ఇచ్చి తన కొడుక్కి మాత్రం సక్సెస్ ఇవ్వలేకపోయిన పూరి జగన్నాథ్ అతన్ని జీవన్ చేతికి అప్పగించాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకమైన సినిమా తీస్తాడని ఆశిస్తాం. కానీ జీవన్ మాత్రం ఆకాష్ ఇప్పటిదాకా చేసిన సాధారణ స్థాయి సినిమాలే పెంచేలా ఎంతో న‌యం అనిపించేలా అత్యంత పేల‌వ‌మైన చిత్రం తీశాడు చోర్ బ‌జార్ రూపంలో. మామూలుగా స‌బ్ స్టాండ‌ర్డ్ సినిమాలు వ‌చ్చిన‌పుడు షార్ట్ ఫిలిమ్స్ న‌యం అని అంటుంటాం. కానీ ఈ రోజుల్లో అవే ఎంతో క్వాలిటీతో తెర‌కెక్కుతున్నాయి. చోర్ బ‌జార్‌ను ల‌ఘు చిత్రాల‌తో పోలిస్తే వాటిని కించ‌ప‌రిచిన‌ట్లు అవుతుంది అంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌టి త‌లా తోకా లేని అర్థ‌ర‌హిత‌మైన సినిమా చోర్ బ‌జార్‌.

త‌న తొలి రెండు చిత్రాల‌తో అభిరుచి ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న‌ జీవ‌న్ రెడ్డి చోర్ బ‌జార్ అనే టైటిల్ పెట్టి దాని లోగోను డిజైన్ చేసిన తీరు చూస్తే.. హైద‌రాబాద్ లో ఫేమ‌స్ అయిన చోర్ బ‌జార్ నేప‌థ్యంలో ఒక వాస్త‌విక‌మైన‌ క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా చూపించే ప్ర‌య‌త్నం చేసి ఉంటాడ‌ని అనుకుంటాం. ఈ హడావుడి అంతే టైటిల్ వ‌ర‌కే ప‌రిమితం అయింది. పైన ప‌టారం లోన లొటారం అన‌డానికి స‌రైన ఉదాహ‌ర‌ణ చోర్ బ‌జార్. రెండొందల కోట్ల విలువైన వ‌జ్రం అనుకోకుండా చోర్ బ‌జార్లోకి వ‌చ్చి ప‌డితే.. ఆ బ‌జార్లో పిస్తాలా తిరిగే హీరో దాన్ని ఎలా చేజిక్కించుకుని చేరాల్సిన చోటికి చేరాడ‌నే నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా ఇది. పేప‌ర్ మీద చూస్తే మంచి విష‌యం ఉన్న క‌థ‌లాగే అనిపిస్తుందిది. కానీ ఆ పాయింట్ ను డీల్ చేసిన విధానానికి దిమ్మ‌దిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. అస‌లు ఎక్క‌డా క‌థ ఒక తీరుగా న‌డిచింది లేదు. ఏ స‌న్నివేశం ఎందుకొస్తుందో తెలియ‌దు. ఏ పాత్ర ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో తెలియ‌దు. అస‌లు మొత్తంగా ద‌ర్శ‌కుడు ఏం చెప్ప‌ద‌లుచుకున్నాడో అర్థం కాదు. ఈ పాత్ర‌కు ఆ పాత్ర తెర‌మీద చేసే విన్యాసాల‌కు.. వాటి ప్ర‌వ‌ర్త‌న‌కు బుర్ర బ‌ద్ద‌లైపోతుంది. సింక్ లేకుండా.. కంటిన్యుటీ లేకుండా.. వ‌చ్చి పోతున్న స‌న్నివేశాల‌కు ఎలా స్పందించాలో అర్థం కాదు. ముందుకు సాగుతున్న కొద్దీ అంత‌కంత‌కూ భ‌రించ‌లేని విధంగా త‌యార‌య్యే క‌థాక‌థ‌నాలు ప్రేక్ష‌కుల స‌హనానికి ప‌రీక్ష పెడ‌తాయి. ప్ర‌తి పాత్ర‌తోనూ తెలంగాణ యాస‌లో అతికీ అత‌క‌ని విధంగా డైలాగులు చెప్పించ‌డం మిన‌హాయిస్తే.. హైద‌రాబాద్-చోర్ బ‌జార్ నేటివిటీని స‌రిగ్గా చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ప్ర‌తి మాట‌లోనూ తెలియ‌కుండా గోదావ‌రి యాస ఉట్టిప‌డే సునీల్ లాంటి న‌టుడితో తెలంగాణ యాస‌తో డైలాగులు చెప్పించ‌డానికి ప‌డ్డ ప్ర‌యాస‌లో కాస్త‌యినా స్క్రిప్టు మీద పెట్టి ఉంటే చోర్ బ‌జార్ కాస్త‌యినా మెరుగ్గా త‌యార‌య్యేది.

అర్చ‌న పాత్ర‌కు పెట్టిన ఫ్లాష్ బ్యాక్ చోర్ బ‌జార్ సినిమా ఏ స్థాయి క్వాలిటీతో తెర‌కెక్కిందో చెప్ప‌డానికి రుజువు. ప‌ల్లెటూరిలో ఉండే ఆమెకు అమితాబ్ బ‌చ్చ‌న్ అంటే ప్రాణ‌మ‌ట‌. ఎవ‌రో బ‌చ్చ‌న్ తో పెళ్లి అని చెప్ప‌గానే ఇంట్లో ఉన్న డ‌బ్బు న‌గ‌ల‌న్నీ ప‌ట్టుకుని అతడితో వ‌చ్చేస్తుంద‌ట‌. మోస‌పోయాన‌ని తెలుసుకుని న‌దిలో దూక‌బోతుంటే స‌రిగ్గా అప్పుడే ప‌సిబిడ్డ ఏడుపు వినిపించి.. అత‌ణ్ని తీసుకుని చోర్ బ‌జార్ చేరుతుంద‌ట‌. త‌న‌కు బ‌చ్చ‌న్ సాబ్ అని పేరు పెడుతుంద‌ట‌. చ‌దువుతున్న‌పుడే సిల్లీగా అనిపించే ఈ స‌న్నివేశాల‌ను తెర‌పై చూసి జుట్టు పీక్కోవ‌డం మిన‌హా ఏమీ చేయ‌లేం. ఇక మూగ‌మ్మాయిగా హీరోయిన్‌.. జ‌మీందారున‌ని చెప్పుకుంటూ ఆమెకు చెప్పి ఇంప్రెస్ చేసే హీరో.. వీరి మ‌ధ్య ప్రేమ‌క‌థ ఒక క‌ళాఖండం లాంటిదే. ఇక 200 కోట్ల వ‌జ్రం అంటూ ఒక పేప‌ర్ వెయిట్ లాంటిది ఒక‌టి చూపించి దాని చుట్టూ అల్లిన స‌న్నివేశాలు చూస్తే.. నిజంగా స్క్రిప్టు చ‌దివే ఆకాష్ పూరి అండ్ కో ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నారా అని సందేహం క‌లుగుతుంది. గ‌త కొన్నేళ్ల‌లో పూరి జ‌గ‌న్నాథ్ స్థాయి ఎంత త‌గ్గినా స‌రే.. ఆయ‌న ఈ క‌థ విని త‌న కొడుకు కెరీర్ గురించి కాస్త‌యినా ఆలోచించ‌కుండా ఎలా ఈ సినిమా చేయ‌నిచ్చారన్నది సందేహం. రెండు గంట‌ల‌కు పైగా నిడివి ఉన్న ఈ సినిమాను.. మొత్తంగా చూసి బ‌య‌టికి రావ‌డం అంటే ఒక సాహ‌సం అని చెప్పాలి. ఆ స్థాయిలో టార్చ‌ర్ చూపిస్తుంది చోర్ బ‌జార్.

నటీనటులు:

కథాకథనాలు పేలవంగా ఉన్నప్పుడు హీరో మాత్రం ఏం చేస్తాడు. పూరి ఆకాష్ ఇందులో పెద్దగా చేయడానికి ఏమీ లేకపోయింది. ఒక ఎమోషనల్ సీన్లో హావభావాలు బాగా పలికించాడు. డైలాగ్స్ కూడా బాగా చెప్పాడు. అంతకుమించి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. కెరీర్ అసలే అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో ఆకాష్ ఇలాంటి సినిమా ఎలా ఒప్పుకున్నాడు అన్నది అర్థం కాని విషయం. కథానాయికగా నటించిన కొత్త అమ్మాయి గెహనా చూడ్డానికి బాగానే అనిపిస్తుంది. తనకు కూడా నటించడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది. తన పాత్రను చాలా పేలవంగా తీర్చిదిద్దారు. సీనియర్ నటి అర్చన చాన్నాళ్ల తర్వాత మెరిసింది. ఆమెది కూడా చాలా పేలవమైన పాత్ర. చాలా సిల్లీగా ఆ పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు. సునీల్ సుబ్బరాజు ఇలా ఇంకొందరు ప్రముఖ తారాగణం ఉన్నప్పటికీ అందరూ వృధానే అయ్యారు.

సాంకేతిక వర్గం:

పిండి కొద్దీ రొట్టె అన్నట్లు సినిమాలో విషయాన్ని బట్టే సాంకేతిక నిపుణులు పనితనాన్ని చూపించారు. ఇటీవల విరాటపర్వం లో తన అభిరుచిని చాటుకున్న సురేష్ బొబ్బిలి ఈ సినిమాలో పాటలు.. నేపథ్య సంగీతం విషయంలో మొక్కుబడిగా లాగించేశాడు. జగదీష్ చీకటి ఛాయాగ్రహణం ఓకే. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. దళం.. జార్జిరెడ్డి చిత్రాలతో విషయం ఉన్న దర్శకుడిలా కనిపించిన జీవన్ రెడ్డి నుంచి ఇంత బలమైన సినిమా వస్తుందని ఊహించలేము. రాత తీతా రెండింట్లోనూ కనీస కసరత్తు లేకుండా చాలా పేలవమైన సినిమా తీశాడు జీవన్. ఒక్కటంటే ఒక్క సన్నివేశంలోనూ దర్శకుడి ప్రతిభ కనిపించలేదు.

చివరగా: చోర్ బజార్.. టార్చర్

రేటింగ్: 1.5/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater
× RELATED పొన్నియన్ సెల్వన్
×