15 ఏళ్ల కిందట సరిగ్గా ఈ రోజు..

టీమిండియా ఎందరో మేటి బ్యాట్స్ మెన్ ను చూసుండొచ్చు.. భారత క్రికెట్ అభిమానులు మరెందరో గొప్ప బ్యాట్స్ మెన్ ను చూసుండొచ్చు. కానీ అతడు మాత్రం ప్రత్యేకం. బంతిని ఎంత అద్భుతంగా కనెక్ట్ చేసుకుంటాడో.. అంతే లాఘవంగా ఎత్తి స్టాండ్స్ లో పడేస్తాడు. బంతిని ఎంత బలంగా బాదగలడో.. అంతే మెరుపు వేగంతో పుల్ చేయగలడు. అతడే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. జూన్ 23 అతడికి ఎంతో ప్రత్యేకం. అతడికే కాదు టీమిండియాకూ. సరిగ్గా 15 ఏళ్ల కిందట ఇదే రోజు రోహిత్ శర్మ గురునాథ్ శర్మ (35) టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 2007 జూన్ 23న బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా హిట్మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.

దీనిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగంగా స్పందించాడు. ''15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను పూర్తి చేసుకున్నా. ఇన్నేళ్ల నా ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మధురానుభూతులు.. ఒడిదుడుకులు చీకటి రోజులు ఉంటాయి. కానీ వాటిన్నింటిని అదిగమిస్తూ ఈస్థాయికి చేరుకున్నానంటే దానికి మీ అందరి సపోర్ట్ ఒక కారణం. అందుకే నా ప్రయాణంలో మద్దుతగా నిలిచిన క్రికెట్ లవర్స్ అభిమానులు విమర్శలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు.. జూన్ 23నే భారత జట్టు ధోనీ నాయకత్వంలో 2013లో ఇంగ్లండ్పై అత్యద్భుత విజయంతో చేసి ఐసీసీ చాంపియన్స్ ట్రోపీని గెలుచుకుంది.

వన్డేటి20 అరంగేట్రం.. రెండిట్లో బ్యాటింగ్ రాలే

ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్ శర్మ. ఓపెనింగ్ బ్యాటర్ కూడా. అయితే 2007లో రోహిత్ అరంగేట్రం వన్డే ద్వారా జరిగింది. అదే ఏడాది టి20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ లో రోహిత్ టి20ల్లో అరంగేట్రం చేశాడు. అయితే రెండిండిలోనూ అతడికి బ్యాటింగ్ రాలేదు. అంతేకాదు.. డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు (బౌలర్ స్టువర్ట్ బ్రాడ్) కొట్టిన మ్యాచ్.. రోహిత్ అరంగేట్రం చేసిన టి20 మ్యాచ్ రెండూ ఒకటే కావడం మరో విశేషం.

టెస్టు అరంగేట్రంలోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

టి20 వన్డే అరంగేట్రం మ్యాచ్ ల్లో బ్యాటింగ్ దక్కని రోహిత్.. టెస్టు అరంగేట్రంలో మాత్రం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవడం విశేషం. వెస్టిండీస్ తో 2013-14 సిరీస్ లో తొలి మ్యాచ్ లోనే రోహిత్ 177 పరుగులు చేశాడు. ఈ సిరీస్ రెండో మ్యాచ్ లోనూ రోహిత్ 111 పరుగులు చేశాడు. మొత్తం 288 పరుగులతో అతడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. మరో విశేషమేమంటే.. సచిన్ కు ఇదే చివరి సిరీస్.

రాత మార్చిన ఓపెనింగ్

అద్భుత ప్రతిభావంతుడు.. మైదానంలో అన్ని వైపులా బంతిని కొట్టగలడు.. దూకుడు డిఫెన్స్ రెండూ ఉన్నవాడు.. ఇవీ కెరీర్ ఆరంభంలో రోహిత్ గురించి వచ్చిన విశ్లేషణలు. కానీ నాడు 20 ఏళ్ల రోహిత్ దీనిని నిలుపుకోలేకపోయాడు. వైఫల్యాలతో వెనుకబడిపోయాడు. దీనికి కారణం అతడు మిడిలార్డర్ లో రావడమే. కానీ సెహ్వాగ్ సచిన్ల రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్గా మారాడు. వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వన్డేల్లో భారీ ఇన్నింగ్స్లకు పెట్టింది పేరుగా నిలిచాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు కొట్టిన ఏ‍కైక బ్యాటర్ ఇతడే.

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కలిగిన రికార్డు కూడా రోహిత్ పేరిటే ఉంది.2014 నవంబర్ 13న ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 264 పరుగులు బాదాడు. ఆ తర్వాత 2019 అక్టోబర్ 5న సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు బాదాడు. టెస్టుల్లో ఓపెనర్గా ఆడుతున్న తొలి మ్యాచ్లోనే అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇక కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా వైదొలగడంతో సారధ్య బాధ్యతలు ఎత్తుకున్న రోహిత్కు ఇంగ్లండ్ పర్యటన ఒక సవాల్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విదేశాల్లో ఇదే తొలి సిరీస్.

మరో రెండేళ్లయినా...

రోహిత్ వయసు ప్రస్తుతం 35 ఏళ్లు. ఇప్పటివరకు 230 వన్డేల్లో 9283 పరుగులు 45 టెస్టుల్లో 3137 పరుగులు 125 టి20ల్లో 3313 పరుగులు సాధించాడు. రోహిత్ ఖాతాలో వన్డేల్లో 29 సెంచరీలు 8 టెస్టు సెంచరీలు 4 టి20 సెంచరీలు ఉన్నాయి. మరో రెండేళ్లు అతడు ఆడే అవకాశం ఉంది. అప్పటివరకు కెప్టెన్ గానూ కొనసాగే వీలుంది. ఈ క్రమంలో 300 వన్డేలు 10 వేల పరుగులు మార్క్ ను దాటే అవకాశం ఉంది. మరో 30 టెస్టులయినా ఆడొచ్చు. వాస్తవానికి టెస్టుల విషయంలో రోహిత్ కు అన్యాయమే జరిగింది. కానీ క్రికెట్లో ఇలాంటివి సహజం. ఇక రోహిత్.. తొలిసారిగా విదేశాల్లో టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు. స్వదేశంలో తనేంటో ఐపీఎల్ ద్వారా నిరూపించుచుకున్నాడు. మిగిలింది.. విదేశాల్లో రాణించడమే. ఈ మంచి అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.
× RELATED జగన్ పేరుతో మోసం చేస్తున్న ముఠా
×