'లైగర్'ను నాతో చేయమంటే మా నాన్న కాదంటాడా?

ఆకాశ్ పూరి హీరోగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో 'చోర్ బజార్' సినిమా రూపొందింది. వీ ఎస్ రాజు ఈ సినిమాను నిర్మించారు. సురేశ్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాతో కథానాయికగా గెహనా సిప్పీ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై ఆకాశ్ పూరి మాట్లాడుతూ.. "ఒక రోజున జీవన్ గారు నాకు కాల్ చేసి ఈ సినిమా కోసం నన్ను అనుకుంటున్నట్టుగా చెప్పారు.  

కథ వినగానే నాకు నచ్చేసింది.. వెంటనే ఓకే చెప్పేశాను. అలా పట్టాలపైకి వెళ్లిన సినిమా ఈ రోజున ఇక్కడి వరకూ వచ్చింది. గెహనాలో మంచి ఫైర్  ఉంది.. ఆ ఫైర్ ఆమెను తప్పకుండా స్టార్ ను చేస్తుంది. ఇక 'అర్చన' గారితో కలిసి పనిచేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. బండ్ల గణేశ్ గారు వస్తారనీ గానీ.. అలా మాట్లాడతారని గాని నేను ఊహించలేదు. అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. బహుశా ఆయన మాటలు ఈ పాటికి ట్రెండు అవుతుంటాయి. ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఈ రోజున మా నాన్న ఇక్కడికి రాలేకపోయినా మా బాబాయి వచ్చారు. సాధారణంగా స్టార్ కొడుకు హీరో అయితే అతనిపై  అంత సీరియస్ నెస్ ఉండదు. వాళ్ల నాన్నకి అన్నీ ఉన్నాయి.. కొడుక్కి డబ్బు విలువ.. కష్టం విలువ ఏం తెలుస్తాయని లైట్ తీసుకుంటారు.

ఎంతటి స్టార్ కొడుకైనా తనలో టాలెంట్ ఉంటేనే సక్సెస్ అవుతాడు. మా నాన్న నాకు అన్నీ ఇచ్చాడు.. కోటలాంటి ఇల్లు.. కార్లు. అవన్నీ మా నాన్నవి.. నావి కావు. పూరి మా ఫాదర్ అనే క్రెడిట్ కార్డును నేను పక్కన పడితే నేను ఒక జీరో అనే విషయం నాకు చాలా రోజుల క్రితమే అర్థమైంది. అప్పుడే నేను ఏం చేయాలా అని ఆలోచన చేశాను.

నాకు తెలిసింది సినిమానే.. అందులోనే కష్టపడాలి అనుకున్నాను. మా అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి. నా చెల్లి బాధ్యత నాపై ఉంది. రేపు భవిష్యత్తులో నన్ను నమ్మి నా చేయి పట్టుకుని ఒక అమ్మాయి వస్తుంది.. ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి.

మా నాన్న మేడలు.. కార్లు చూసి నేను హీరోను అవ్వాలని అనుకోలేదు. మా నాన్న చేతక్ స్కూటర్ పై తిరుగుతున్నప్పుడే నేను హీరోను కావాలని ఫిక్స్ అయ్యాను. కష్టాలు చూస్తూ పెరిగిన నాకు మీ సపోర్ట్ కావాలి. 'లైగర్' సినిమాను నాతో చేయమని అడిగితే మా నాన్న చేసేవాడే.. కానీ నాకు అది వద్దు. నేను  మా నాన్న స్టేజ్ కి నేను వెళ్లాకే ఇద్దరం కలిసి సినిమా చేస్తాము. నాకు కావలసింది మా నాన్న సపోర్ట్ కాదు.. మీ సపోర్ట్" అంటూ చెప్పుకొచ్చాడు.
× RELATED లండన్ వీధుల్లో యంగ్ హీరో... హీరోయిన్ సయ్యాట!
×