శివసేనలో ఇది నాలుగో తిరుగుబాటు!

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే కేబినెట్లో మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన ప్రభుత్వం మైనార్టీలో పడే ముప్పును ఎదుర్కొంటోంది. కాగా శివసేన పార్టీలో ఇప్పటివరకు ఇది నాలుగో తిరుగుబాటు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో మూడుసార్లు ఆ తిరుగుబాట్లను తట్టుకుని శివసేన నిలబడిందని పేర్కొంటున్నారు. ఈసారి మాత్రం ఏకనాథ్ షిండే రూపంలో పెద్ద తిరుగుబాటే వచ్చిందని వివరిస్తున్నారు.

మొదటి తిరుగుబాటు శివసేన వ్యవస్థాపకుడు ఆ పార్టీకి తిరుగులేని నాయకుడిగా చలామణి అయిన బాల్ థాకరే హయాంలో జరిగింది. 1991లో ఇది ఛగన్ భుజబల్ రూపంలో వచ్చింది. శివసేన పార్టీలో ఓబీసీ నాయకుడిగా ఉన్న భుజబల్కు గ్రామీణ మహారాష్ట్రలో మంచి పట్టు ఉంది. శివసేన పార్టీని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయడంలో ఆయనదే కీలకపాత్ర. అయితే తాను ఇంత చేస్తున్నా తనకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని చగన్ భుజబల్ శివసేనను వదిలి వెళ్లిపోయారు. అయితే తనతోపాటు 18 మంది ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుపోయారు.

వారంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించేశారు. అయితే అదే రోజు ఆ 18 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు తిరిగి శివసేనలోకి వచ్చేశారు. భుజబల్ కొంత మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా స్పీకర్ గుర్తించారు. ఆ తర్వాత 1999లో భుజబల్ శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఉద్దవ్ ఠాక్రే కేబినెట్లో చగన్ భుజ్ భల్ మంత్రిగా కొనసాగుతున్నారు.

ఇక శివసేన పార్టీలో రెండో తిరుగుబాటు 2005లో నారాయణ రాణే రూపంలో వచ్చింది. నారాయణ రాణె శివసేనను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలోకి ఫిరాయించారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా నారాయణ రాణె పనిచేశారు.

శివసేన పార్టీలో మూడో తిరుగుబాటు 2006లో బాల్ థాకరే సోదరుడి కుమారుడు రాజ్ థాకరే రూపంలో వచ్చింది. శివసేనలో రాజ్ థాకరేకి మంచి పట్టు ఉండేది. బాల్ థాకరేలాగా ఉద్వేగపూరిగ ప్రసంగాలు చేయగలరు. ప్రజలను ఉర్రూతలూగించగలరు. అప్పటిదాకా ఉద్ధవ్ థాకరే రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. పార్టీ పత్రిక సామ్నాను నడిపేవారు. బాల్ థాకరే తర్వాత శివసేన పగ్గాలు తనకు వస్తాయని రాజ్ థాకరే ఆశించారు. అయితే బాల్ థాకరే తన కుమారుడు ఉద్ధవ్ థాకరేకు పార్టీ పగ్గాలు అప్పగించారు. దీంతో రాజ్ థాకరే శివసేన నుంచి బయటకొచ్చి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు.

తాజాగా ఏక్నాథ్ షిండే రూపంలో మరోసారి శివసేన తిరుగుబాటును ఎదుర్కొంటోంది. అయితే తమకు శివసేన నాయకత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని.. కేవలం సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ ఎన్సీపీల తీరువల్లే రెబల్స్గా మారాల్సి వచ్చిందని ఏకనాథ్ షిండే చెబుతున్నారు. బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము శివసేనలోనే ఉంటామని పేర్కొంటున్నారు.
× RELATED కరెన్సీ నోట్లపై ఆర్బీఐ సంచలన ఆదేశాలు
×