'ఎవరినెవరినో స్టార్లను చేశాడు.. సూపర్ స్టార్లు చేశాడు'.. బండ్ల వ్యాఖ్యలు వైరల్..!

నటుడు నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ లకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారనే సంగతి తెలిసిందే. ఏ సినిమా ఫంక్షన్ లోనైనా ఐఆయన స్పీచ్ కోసం అందరూ ఆతృతగా వేచి చూస్తుంటారు. స్టేజి మీద పూనకం వచ్చినట్లు ఊగిపోతూ మాట్లాడుతుంటే ఈలలు చప్పట్లతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే బండ్ల.. తన వ్యవహార శైలితో అప్పుడప్పుడు వివాదాలు కొనితెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు లేటెస్టుగా 'చోర్ బజార్' ఈవెంట్ లో బండ్ల వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన చిత్రం 'చోర్ బజార్'. జార్జి రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 24న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి బండ్ల గణేష్ అతిథిగా హాజరయ్యారు. ఎన్నాళ్ల నుంచో ఆయన స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ను ఉత్సాహపపరిచేలా మాట్లాడారు బండ్ల.

పూరీ జగన్నాథ్ ముంబైలో తన కొత్త చిత్రం JGM షూటింగ్ లో బిజీగా ఉన్నందున కుమారుడి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు రాలేదు. ఇదే విషయమై నిరుత్సాహానికి గురైన బండ్ల గణేష్.. ఈ వేడుకకు పూరీ హాజరుకాకపోవడంతో సీరియస్ అయ్యారు. ఎంతమందినో స్టార్లను చేసిన దర్శకుడు.. తన కొడుకు సినిమా ఫంక్షన్ కి మాత్రం రాలేదని అన్నారు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ''దేశమంతా కళ్ళాపి చల్లాడు కానీ ఇంటి ముందు చల్లడానికి ఆయనకు టైం లేదు. ఎందరినో స్టార్లను చేశాడు.. సూపర్ స్టార్లను చేశాడు.. డైలాగులు రాని వాళ్లకి డైలాగులు నేర్పించాడు. డాన్స్ రాని వాళ్లకి డాన్స్లు నేర్పించాడు.. మామూలు వాళ్లని స్టార్లు చేశాడు.. సూపర్ స్టార్లు చేశాడు. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్ కి మాత్రం రాలేదు. అదే నేనైతే నేను లండన్ లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా భార్యా పిల్లల కోసం'' అని అన్నారు.
 
''మా అన్న ఎక్కడ ఉన్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో. ఈసారికి అయిపోయింది కానీ.. ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయకు. నీకు దండం పెడతా. ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ల కోసమే. మనం చస్తే తలకొరివి పెట్టాల్సిందే వాళ్లే. మనం సంపాదించే ఆస్తులు వాళ్లకే. అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే. మనం ఏం చేసినా కేరాఫ్ వాళ్లే. ఆకాశ్ - పవిత్ర (పూరీ కుమారుడు కుమార్తె) బాధ్యత తీసుకోవాల్సిందే. ఆకాష్ ని స్టార్ ని చేయాల్సిందే. వాడు స్టార్అవుతాడు.. ఎందుకంటే వాడికి టాలెంట్ ఉంది''

''ఎవరినెవరినో స్టార్స్ ని చేశావ్.. నీ కొడుకు వచ్చేసరికి వెళ్లి ముంబాయిలో ఉన్నావ్.. ఇదెక్కడి న్యాయం అన్నా.. ఇదేందన్నా.. అట్టా కుదరదు.. మేం ఒప్పుకోం. నాలాంటి వాడిని స్టార్ ప్రొడ్యూసర్ ని చేసి.. టాలెంట్ ఉన్న నీ కొడుకుని స్టార్ ని చేయకుండా బాంబేలో కూర్చుంటే మేం ఒప్పుకోము అన్నా. 'ఛోర్ బజార్' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్నా. నువ్వు చేసినా చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవుతాడు. నువ్ కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. నేను ఈరోజు చెప్తున్నా రాస్కో.. నువ్వు బ్యాంకాంగ్ పోయి కథ రాసుకుని.. ఆకాష్ కథ చెప్తా వినరా అని ఎదురుచూసే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. అలా జరక్కపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు'' అని బండ్ల తనదైన శైలిలో మాట్లాడారు.

''పూరీ అబ్బాయి సినిమా అంటే.. పూరీ వల్ల స్టార్స్ అయిన వాళ్లు వస్తారని అనుకున్నాను. పూరీ వల్లే మేం స్టార్లు అయ్యాం.. సూపర్ స్టార్లు అయ్యాం అని చెప్తారని ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే పూరీ వల్ల స్టార్లు అయ్యి ఇప్పుడు వందలు కోట్లు తీసుకుంటున్నారు. వాళ్లు ముందుకు వచ్చి పూరీ కొడుకు బాధ్యత తీసుకుంటారని అనుకున్నా. కానీ వాళ్లు రారు. పూరీతో సినిమా కోసం ఎదురుచూసిన వాళ్లు ఎవరూ ఈరోజు ఆయన కొడుకు బాధ్యతని తీసుకోలేదు''

''ఎవరు వచ్చినా రాకపోయినా ఆకాష్ అనేవాడు సూపర్ స్టార్ అవ్వడాన్ని ఎవరూ ఆపలేరు. వాడు ఖచ్చితంగా స్టార్ అవుతాడు.. మా వదిన కన్న కలలు నిజం అవుతాయి. నాకు నా కొడుకు ఎంతో ఆకాష్ కూడా అంతే. అప్పుడు నువ్వు మాత్రం మీ నాన్నకి డేట్స్ ఇవ్వకు (ఆకాష్ ను ఉద్దేశిస్తూ)'' అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. బండ్ల స్పీచ్ తో 'చోర్ బజార్' మూవీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

అయితే బండ్ల గణేష్ వ్యాఖ్యలతో స్టార్ హీరోల అభిమానులు హర్ట్ అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగొందుతున్న చాలామంది హీరోలు పూరీ జగన్నాథ్ తో సినిమాలు చేసి ఉన్నారు. ఇప్పుడు బండ్ల ఎవరినెవరినో స్టార్లు.. మెగాస్టార్లు.. సూపర్ స్టార్లను చేశావ్ అని అనడంతో వారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బండ్లపై ఫైర్ అవుతున్నారు. బండ్ల ఉద్దేశ్యపూర్వకంగా అన్నాడో లేదా ఎప్పటిలాగే అనుకోకుండా అలా మాట్లాడాడో తెలియదు కానీ.. అతని కామెంట్స్ మాత్రం స్టార్ హీరోల ఫ్యాన్స్ ను బాధించాయని అర్థం అవుతోంది.
× RELATED ఎన్టీఆర్ కోసం అనుకుంటే గోపీచంద్ రెడీ అవుతున్నాడే!
×