మహేష్ కోసం జక్కన్న రెండు ఫైనల్...!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేయబోతున్న తదుపరి సినిమా మహేష్ బాబుతో అనే విషయం అందరికి తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ విడుదల కాకముందు నుండే ఆ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

మహేష్ బాబు ను రాజమౌళి దర్శకత్వంలో చూడాలని ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు రాజమౌళి అందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టాడు. బాహుబలి మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాలకు చాలా సమయంను రాజమౌళి తీసుకున్నాడు. బాహుబలి రెండు పార్ట్ లకు దాదాపుగా అయిదు ఆరు సంవత్సరాల పాటు వర్క్ చేసిన విషయం తెల్సిందే.

ఆర్ ఆర్ ఆర్ సినిమా కు కరోనా వల్ల దాదాపు రెండేళ్లు అదనంగా కేటాయించాల్సి వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు తో సినిమాకు మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఏడాది నుండి ఏడాదిన్నర లో సినిమాను ముగించాలని జక్కన్న భావిస్తున్నాడట. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే మహేష్ బాబు కోసం రెండు మూడు స్క్రిప్ట్ లు రెడీ చేశాడు అనే వార్తలు కొన్ని రోజుల క్రితం వచ్చాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి రెండు స్క్రిప్ట్ లను రెడీ చేసి మహేష్ బాబు తో చివరి దశ చర్చల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ఇటీవలే విదేశాలకు ఫ్యామిలీ తో వెళ్లారు. ఆయన వచ్చిన వెంటనే రాజమౌళి స్క్రిప్ట్ విషయం లో తుది నిర్ణయానికి వచ్చేసి ఆ వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టేయాలని భావిస్తున్నారట.

ఇప్పటికే రాజమౌళి టీమ్ మహేష్ బాబు సినిమా కోసం లొకేషన్ల వేట ప్రారంభించారని.. రెండు కథలకు తగ్గట్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టారని కూడా సమాచారం అందుతోంది. త్వరలోనే కథ విషయంలో మహేష్ బాబు మరియు జక్కన్న తుది నిర్ణయానికి వస్తే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా పనులు మొదలు పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మహేష్ బాబు వచ్చే నెలలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు త్రివిక్రమ్ సినిమా పూర్తి అవుతుంది. ఆ వెంటనే జక్కన్న ఇదే ఏడాది చివర్లో సినిమా ను మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ప్రారంభం అయితే 2023 చివర్లో లేదా 2024 లో విడుదల అయ్యేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట.
× RELATED పేరున్న డైరెక్టర్..పాన్ ఇండియా మూవీ..బజ్ జీరో!
×