కిడ్నీలో 206 రాళ్లు.. గంటలో తొలగించిన వైద్యులు

కిడ్నీలో రాళ్లు రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. పది మందిలో ముగ్గురు కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే సమస్య చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్లు నీళ్లు ఎక్కువగా తాగమని చెబుతారు. అలా తాగితే మూత్రంలోనుంచి బయటకు పోతాయని అంటుంటారు. అయితే రాయి సైజు 5 ఎంఎం నుంచి 6 ఎంఎం ఉంటే అది నీరు తీసుకుంటే పడిపోయే అవకాశం ఉంటుందని.. కానీ అంతకంటే పెద్దవైతే మాత్రం సర్జరీ చేసి తొలగించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

కానీ ఓ వ్యక్తికి కిడ్నీలో ఏకంగా 206 రాళ్లని గుర్తించారు వైద్యులు. ఆరు నెలలుగా తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆ వ్యక్తికి హైదరాబాద్లోని అవారే గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో వైద్యులు.. కీ హోల్ సర్జరీ చేసి గంటలో 206 రాళ్లని కిడ్నీ నుంచి తొలగించారు.

నల్గొండకు చెందిన 56 ఏళ్ల వీరమళ్ల రామ లక్ష్మయ్య ఏప్రిల్ 22న అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లారు. స్థానిక వైద్యుడు ఇచ్చిన మందులు వాడుతున్న లక్ష్మయ్యకు మాత్రలు వేసుకున్నంత సేపే ఉపశమనం ఉంటుందని.. తర్వాత మళ్లీ నొప్పి మొదలవుతోందని గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్కు చెప్పాడు. తన సమస్య పూర్తిగా తగ్గించమని వేడుకున్నాడు.

లక్ష్మయ్య ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు అల్ట్రా సౌండ్ పరీక్షలు చేసిన అనంతరం అతడి కిడ్నీలో ఎడమ వైపు 206 రాళ్లను గుర్తించారు. వాటిని తొలగించకపోతే అతడి ఆరోగ్యం విషమిస్తుందని వెంటనే సర్జరీ చేశారు. గంటలోపు 206 రాళ్లను కిడ్నీ నుంచి తొలగించారు. ఇప్పుడు అతడి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

కిడ్నీలో రాళ్లు రావడం అనేది సాధారణ సమస్య అయిందని.. అయితే నీళ్లు సక్రమంగా తాగితే ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడొచ్చని వైద్యులు చెబుతున్నారు.  కిడ్నీలో రాళ్ల సమస్య ఒకసారితో పోయేది కాదని.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెట్టొచ్చని.. అందుకే ముందే రాళ్లు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల వేసవిలో డీహైడ్రేషన్కు ఎక్కువగా గురవుతారని.. పదేపదే జ్వరం వచ్చినట్లు అనిపిస్తుందని అన్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఎక్కువగా నీళ్లు కొబ్బరి నీళ్లు తాగుతుండాలని వైద్యులు సూచిస్తున్నారు.
× RELATED ఏపీ ప్రజలకు మరో బాదుడు తెచ్చిన జగన్ సర్కార్?
×