'ఆచార్య' దెబ్బకే చిరు ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయారా..?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల 'ఆచార్య' సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ అందుకున్నారు. తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది.

'సైరా నరసింహారెడ్డి' తర్వాత చిరు మొదలు పెట్టిన 'ఆచార్య' సినిమా దాదాపు మూడేళ్లు నిర్మాణంలోనే ఉంది. మెగా తండ్రీకొడుకులు తొలిసారిగా పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో.. ఎంత లేట్ అయినా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మెగా అభిమానులు కోరుకున్నారు.

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆచార్య' సినిమా తీవ్ర నిరాశ పరిచింది. తొలి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. నాలుగు రోజులకే థియేటర్లలో నుంచి వెళ్ళిపోయింది. దీంతో మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది.

మెగా డిజాస్టర్ తర్వాత చిరంజీవి తన హాలిడే కోసం ఫారిన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనా పాండమిక్ తరువాత ఇదే తన తొలి ఇంటర్నేషనల్ జర్నీ అని.. చాలా రోజుల తరువాత చిన్న బ్రేక్ తీసుకొని భార్య సురేఖాతో కలిసి అమెరికా - యూరప్ పర్యటనకు వెళ్ళినట్లు పేర్కొన్నారు.

అయితే అప్పటి నుండి మెగాస్టార్ ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయారు. సాధారణంగా చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా అప్డేట్లు ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చిరు చాలా లో ప్రొఫైల్ ను మెయింటైన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి 'ఆచార్య' సినిమా కారణంగా ఎన్నడూ లేని విధంగా మెగాస్టార్ పై ట్రోలింగ్ వచ్చింది. కొరటాల కథలో చిరు వేలు పెట్టడం వల్లనే అలాంటి రిజల్ట్ వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ.సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని దర్శకుడు కొరటాల ఒక్కరే ఫేస్ డీల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే విదేశీ పర్యటన నుండి చిరంజీవి ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై ఎటువంటి అప్డేట్ లేదు. సీనియర్ హీరో లైన్ లో పెట్టిన వివిధ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ పెండింగ్ లో ఉన్నాయో. అవి ఎప్పుడు రీస్టార్ట్ అవుతాయనేది తెలియడం లేదు. పలు సినిమాలు సెట్స్ మీద ఉన్నప్పుడు.. సీనియర్ స్టార్ హీరో ఇలా సుదీర్ఘ హాలిడేకు వెళ్లడం మాములు విషయం కాదు.

మెగా అభిమానులు మాత్రం వీలైనంత తర్వాత చిరు తిరిగి సెట్స్ లో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు. ఓ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో 'ఆచార్య' పరాభవాన్ని మరిచిపోయేలా చేయాలని కోరుకుంటున్నారు.

చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా చేస్తున్నారు. ఇదే క్రమంలో బాబీ డైరెక్షన్ లో 'వాల్తేర్ వీరయ్య' అనే చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. వీటి తర్వాత యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో మెగాస్టార్ ఓ మూవీ చేయనున్నారు.
× RELATED సూపర్ హీరో `థోర్`కి సాయితేజ్ ప్రమోషన్
×