ఈ సినిమా హిట్ కాకపోతే మళ్లీ మీకు కనిపించను: రాజేంద్రప్రసాద్

వెంకటేశ్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా .. మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ కథానాయికలుగా అలరించనున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని  సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ -  శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు .. సాంకేతిక నిపుణులు అంతా కూడా ఈ వేడుకకి హాజరయ్యారు.

ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన రాజేంద్రప్రసాద్ ఈ వేదికపై మాట్లాడుతూ .. " తెలుగు సినిమాకి సంబంధించి మూవీ మొగల్  గా రామానాయుడు గారిని పిలిచేవారు. ఆయన తరువాత మూవీ మొగల్ గా నేను మనస్ఫూర్తిగా పిలిచేది దిల్ రాజునే.

ఈ రోజున మనమంతా ఉన్న పరిస్థితికి అవసరమైన సినిమా 'ఎఫ్ 3'. సమాజంలో సమస్యల పరంగా .. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పరంగా ఉన్న వేడిని తట్టుకోవడానికి అవసరమైన సినిమా 'ఎఫ్ 3'. అది చెప్పడానికి అర్హత ఉన్న ఏకైన వ్యక్తిని నేను .. కారణం నవ్వు.

ఒక మనిషి జీవితానికి నవ్వు ఎంత అవసరమని చెప్పే సినిమాల్లో ఇది ఒకటి. ఈ లోకంలో ఎవరి స్థాయిలో వాళ్లకి  సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ ఒకటే  పరిష్కారం .. అదే నవ్వు. 45 సంవత్సరాలుగా నేను నమ్మింది నవ్వునే.

ఈ సినిమాలో ప్రతి పాత్ర హైలైట్ అవుతుంది .. అందుకు దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. గుండెపై   చేయి వేసుకుని చెబుతున్నాను .. ఈ సినిమా హిట్ కాకపోతే మళ్లీ మీ ముందు ఎప్పుడూ నిలబడను. ఈ సినిమాపై నాకున్న నమ్మకాన్ని మీరంతా నిలబడతారని ఆశిస్తున్నాను" అంటూ ముగించారు.
× RELATED సూపర్ హీరో `థోర్`కి సాయితేజ్ ప్రమోషన్
×