ఇరుకున పడిన మాజీ మంత్రి : పోలీసులకు బ్రాహ్మణ సంఘం ఫిర్యాదు

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇరుకున పడ్డారు. ఆయన నోరు జారారు. అంతే కాదు ఒక టీవీ చానల్ రిపోర్టర్ మీద అంతు చూస్తాను అని బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆయన మీద పోలీసులకు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు తాజాగా ఫిర్యాదు చేశారు. దీంతో ఇదెక్కడి తలనొప్పి అని మాజీ మంత్రి తలపట్టుకుంటున్నారు.

విషయానికి వస్తే ఈ మధ్యన  పద్మనాభం మండలంలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో ఆయన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు జనాలు రాలేదని ఒక చానల్ రిపోర్టర్ ప్రసారం చేస్తున్నారు అని వైసీపీ నేతలు చెప్పగా తెలుసుకున్న అవంతి వేదిక మీద నుంచే అది కూడా మైకు ముందే ఆయన్ని బెదిరించారు అని వార్తలు వచ్చాయి.

అంతే కాదు కులం పేరు పెట్టి దూషించారు అని కూడా చెబుతున్నారు. దీంతో మండిపడిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు అవంతికి వ్యతిరేకంగా తమ నిరసన తెలియచేశారు. అంతటితో ఊరుకోకుండా పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి మీద ఫిర్యాదు చేశారు కూడా.

సదరు చానల్ ప్రతినిధిని ఉద్దేశించి పంతులూ నీ అంతు చూస్తాను అని అవంతి బెదిరించినట్లుగా పోలీసులకు బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేశాయి. కులం పేరుతో రిపోర్టర్ ను దూషించారంటూ పోలీసులకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఫిర్యాదు చేసింది. ఐపీసీ 153 (సీ) 509 (ఏ) ప్రకారం మాజీ మంత్రి అవంతిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

దీని మీద స్పందించిన మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ తన మీద నిరాధారమైన ఆరోపణలు కొందరు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనక విపక్షాలు కూడా ఉన్నాయని  ఆయన అంటున్నారు. తాను ఎవరినీ కులం పేరిట దూషించలేదని బ్రాహ్మణ సోదరుల మనోభావాలు దెబ్బతింటే కనుక క్షమించాలని ఆయన కోరారు.

అయితే ఇప్పటికే అవంతికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ బ్రాహ్మణ సంఘాలు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో మాజీ మంత్రికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏది ఏమైనా పరిస్థితులు రివర్స్ అయితే ఇలాగే ఉంటుంది. అసహనంతో చేసే కామెంట్స్ ఇలాంటి పరిణామాలకు దారి తీస్తాయని అంటున్నారు.
× RELATED కోటం రెడ్డి బిగ్ వాయిస్ : అభివృద్ధి లేదు... ఎవరూ పట్టించుకోరు...
×