శేఖర్

మూవీ రివ్యూ : శేఖర్

నటీనటులు: రాజశేఖర్-ముస్కాన్-ఆత్మిక రాజన్-శివాని రాజశేఖర్-అభినవ్ గోమఠం-సమీర్-పోసాని కృష్ణమురళి-కిషోర్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నారగాని
కథ: షాహి కబీర్
మాటలు: లక్ష్మీ భూపాల్
నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి-శివాని రాజశేఖర్-శివాత్మిక రాజశేఖర్-బొగ్గారం వెంకట శ్రీనివాస్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవిత రాజశేఖర్

కొన్నేళ్ల ముందు ‘గరుడవేగ’ సినిమాతో చాలా కాలానికి ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడు సీనియర్ హీరో రాజశేఖర్. కానీ తర్వాత ‘కల్కి’తో మళ్లీ గాడి తప్పాడాయన. ఆపై మళ్లీ కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఇప్పుడాయన ‘శేఖర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళ హిట్ ‘జోసెఫ్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం రాజశేఖర్ ను మళ్లీ ట్రాక్ ఎక్కించేలా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

శేఖర్ (రాజశేఖర్) స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన పోలీస్. కూతురిని రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకుని.. భార్యను దూరం చేసుకుని.. తాగుడుకు బానిసగా మారిన శేఖర్.. తనకున్న ప్రత్యేక నైపుణ్యంతో పోలీసులకు సవాలుగా మారిన కేసులను ఛేదిస్తుంటాడు. ఈ వ్యవహారం ఒకవైపు.. కూతురి జ్ఞాపకాలు మరోవైపు.. ఇలా అతడి జీవితం సాగిపోతున్న తరుణంలో.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న తన మాజీ భార్య కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడి మృత్యువుతో పోరాడుతున్నట్లు శేఖర్ కు తెలుస్తుంది. ఆమెకు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించాక.. తనది యాక్సడెంట్ కాదని.. హత్య అని శేఖర్ కు అనుమానం కలుగుతుంది. మరి అతడి అనుమానం నిజమేనా.. దీని వెనుక ఉన్నదెవరు.. ఆ మిస్టరీని శేఖర్ ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

రీమేక్ సినిమాలు చాలా తేలిక.. వాటితో హిట్ కొట్టడం ఇంకా ఈజీ అనుకుంటారు చాలామంది. కానీ వాటితో ఉండే తలనొప్పులే వేరు. అందులోనూ ఈ ఇంటర్నెట్ యుగంలో అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న రోజుల్లో రీమేక్ తీసి ప్రేక్షకులను మెప్పించడం అంత సులువు కాదు. ఉన్నదున్నట్లు తీస్తే జిరాక్స్ కాపీ అంటారు. మార్పులు చేస్తే చెడగొట్టారంటారు. పైగా ఒరిజినల్ విజయవంతం కావడంలో నేటివిటీ.. ప్రేక్షకుల అభిరుచి కూడా కీలకమై ఉన్నపుడు ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమవుతుంది. అలాంటపుడు ఇక్కడి ప్రేక్షకుల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేయడం కూడా అవసరం కావచ్చు. అలాగే మాతృక విజయవంతం అయింది కదా అని దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోకుండా.. అందులో లోపాలను కూడా సరిదిద్దాల్సి ఉటుంది. ఐతే రాజశేఖర్ ఎప్పుడు రీమేక్ సినిమాలు చేసే.. చాలా వరకు ఒరిజినల్ ను ఫాలో అయిపోతుంటారు. కథాకథనాల్లో వేలు పెట్టే ప్రయత్నమే చేయరు. ఆయన భార్య జీవిత కూడా సొంతంగా దర్శకురాలిగా ఇప్పటిదాకా ఎలాంటి ముద్ర వేసింది లేదు. కాబట్టే అటు రాజశేఖర్ కానీ.. ఇటు జీవిత కానీ.. ‘జోసెఫ్’ను రీమేక్ చేస్తూ.. తమ క్రియేటివిటీని చూపించే ప్రయత్నం ఏమీ చేయలేదు. వీళ్లిద్దరూ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఒరిజినల్ ను ఫాలో అయిపోయినా సరే.. ఎందుకో ‘శేఖర్’లో ఆ ఇంపాక్ట్ మాత్రం కనిపించలేదు. పైగా అందులోని లోపాలు క్యారీ అయ్యాయి. కథ పరంగా కొత్తదనం ఉన్నా.. ఆసక్తికర మలుపులకు చోటున్నా.. ఇక్కడి ప్రేక్షకులు కోరుకునే స్థాయిలో కథనంలో వేగం లేకపోవడం.. ఫ్యామిలీ డ్రామా మరీ నీరసం తెప్పించేయడం ఈ చిత్రానికి ప్రతికూలంగా మారాయి. ‘గరుడవేగ’కు ముందు రాజశేఖర్ చేసిన చాలా చిత్రాలతో పోలిస్తే మెరుగే అయినా.. ఆయన కూడా అభిమానులకు చాలా కొత్తగా కనిపించినా.. ఓవరాల్ గా ‘శేఖర్’ ఇంపాక్ట్ మాత్రం తక్కువే.

తమిళంలో ‘సూదుకవ్వుం’ అని పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా. విజయ్ సేతుపతి అందులో ముఖ్య పాత్ర చేశాడు. అదే సినిమాను తెలుగులో రాజశేఖర్ హీరోగా రీమేక్ చేస్తే.. భరించలేని విధంగా తయారైంది. సినిమా చివరి వరకు కూడా కూర్చోవడం కూడా కష్టమైపోయింది ఇక్కడి ప్రేక్షకులకు. ఉన్నదున్నట్లుగా తీసినా.. ఆ సినిమా ఇక్కడ అంత ఎఫెక్టివ్ గా కనిపించలేదు. దానికి కారణమేంటి అంటే సమాధానం చెప్పడం కష్టం. ‘శేఖర్’ అలా భయపెట్టదు కానీ.. ప్రేక్షకులు ఆసక్తిగా కథలో ఇన్వాల్వ్ అయ్యేలా మాత్రం చేయలేకపోయింది. ఒరిజినల్లో హీరో ఫ్లాష్ బ్యాక్.. ఫ్యామిలీ యాంగిల్ అంత గొప్పగా ఏమీ ఉండవు. ఐతే ఆ మొత్తం ఎపిసోడ్ ను యథాతథంగా తెలుగులోకి తీసుకొచ్చేశారు. ప్రధాన కథలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండగా.. అందులో అక్కడికి రావడానికే సినిమాలో చాలా సమయం పట్టేస్తుంది. హీరో ఫ్లాష్ బ్యాక్.. అతడి కుటుంబంలో సమస్యలు.. ఇవే ప్రథమార్ధంలో ఎక్కువ టైం తినేశాయి. యువకుడిగా రాజశేఖర్ గెటప్.. మేకప్ చాలా ఎబ్బెట్టుగా ఉండటంతో అవి ఎప్పుడెప్పుడు అయిపోతాయా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక వర్తమానంలోకి వచ్చాక భార్య.. కూతురు తాలూకు ఎమోషనల్ బాండ్ కు సంబంధించిన సన్నివేశాలు భారంగా అనిపిస్తాయి తప్ప అవేమీ ఎమోషనల్ గా కదిలించేలా లేవు. హత్య కేసుల్ని ఛేదించడంలో హీరో నైపుణ్యాన్ని చూపించే ఇంట్రో సీన్ ఆసక్తికరంగా అనిపించినా.. ఆ తర్వాత వెంటనే ఈ ఫ్లాష్ బ్యాక్.. ఫ్యామిలీ ఎమోషన్ల మీదికి కథను మళ్లించడంతో ‘శేఖర్’ ఇంటర్వెల్ వరకు భారంగా గడుస్తుంది.

తన మాజీ భార్యది యాక్సిడెంట్ కాదు.. హత్య అని హీరో గుర్తించే దగ్గర ఇచ్చి.. తర్వాత అంత దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో ద్వితీయార్ధం నడుస్తుంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తరహాలో మెడికల్ మాఫియాలో మరో కోణాన్ని ‘శేఖర్’లో ఆసక్తికరంగానే చూపించారు. కాకపోతే ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ సీన్లు చూపించేపుడు.. సన్నివేశాలు పరుగులు పెట్టాలి. ప్రేక్షకుడు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి.. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠకు లోనవ్వాలి. కానీ కొన్ని కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. సన్నివేశాల్లో విషయం ఉన్నప్పటికీ.. ఈ వేగం.. ఉత్కంఠ మాత్రం మిస్సయ్యాయి. థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన ప్రధానమైన ఈ లక్షణాలు కొరవడడం వల్ల అనుకున్నంతగా ‘శేఖర్’ ఉత్కంఠ పంచలేకపోయింది. కానీ చివర్లో వచ్చే ట్విస్ట్.. ఈ మాఫియా ఎలా నడుస్తోందో చూపించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విలన్ల నెట్ వర్క్ గురించి.. వాళ్ల నేపథ్యం గురించి ఇంకొంత డీటైలింగ్ ఉండి ఉంటే బాగుండేది. కేవలం హీరో కోణం నుంచి అంతా చూపించి.. విలన్లను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం కూడా కొంత మైనస్ అయింది. ఓవరాల్ గా చూస్తే.. ‘శేఖర్’లో ఆసక్తికరమైన కథ ఉంది. కానీ దానికి అంతే ఆసక్తికరమైన కథనం తోడవలేదు. ఎమోషనల్ కనెక్షన్ లేని ఫ్యామిలీ డ్రామా అసలు కథలోని ఇంపాక్ట్ ను తగ్గించేసింది. నడివయస్కుడిగా పూర్తి స్థాయి పాత్రలో రాజశేఖర్ కొత్తగా కనిపించడం.. కథలోని కొత్త పాయింట్.. ట్విస్టుల కోసం ‘శేఖర్’ను తక్కువ అంచనాలతో ఓసారి చూడొచ్చు. అంతకుమించి ఆశిస్తే కష్టం.

నటీనటులు:

ఇన్నేళ్ల కెరీర్లో రాజశేఖర్ ఎప్పుడూ చేయని పాత్ర చేశారు ‘శేఖర్’లో. పూర్తిగా జుట్టు, గడ్డం తెల్లబడ్డ నడివయస్కుడిగా ఆయన పాత్ర.. లుక్ కొత్తగా అనిపిస్తాయి. హీరోయిజం గురించి ఎక్కడా ఆలోచించకుండా పాత్రకు తగ్గట్లు ఆయన నటించారు. కానీ వయసు.. మధ్యలో కొవిడ్ తాలూకు అనారోగ్య ప్రభావం పడడం వల్ల ఆయన మరీ డల్లుగా కనిపించారు. సినిమాలో.. పాత్రలో కూడా ఉత్సాహం కొరవడగా..రాజశేఖర్ కూడా డల్లుగా కనిపించడం కొంత నిరాశ పరుస్తుంది. హీరోయిన్ ముస్కాన్ కాసేపు తన అందంతో ఆకట్టుకుంది. హీరో భార్య పాత్రలో చేసిన ఆత్మీయ రాజన్ ను ఎక్కువసేపు తెరపై చూడటం కష్టమే. అంత నీరసం తెప్పించేలా ఉందామె. రాజశేఖర్ కూతురిగా నటించిన ఆయన పెద్దమ్మాయి శివాని అంతగా ఆకట్టుకోలేకపోయింది. తన లుక్స్.. నటన సాధారణంగా అనిపిస్తాయి. కిషోర్.. సమీర్.. అభినవ్ గోమఠం తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు. పోసాని కూడా ఓకే.

సాంకేతిక వర్గం:

అనూప్ రూబెన్స్ సంగీతం పర్వాలేదు. కిన్నెర పాట ఒకటి వినసొంపుగా ఉంది. మిగతా పాటలు.. నేపథ్య సంగీతం సోసోగా సాగిపోతాయి. మల్లికార్జున్ నారగాని ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు తీసిపడేసేలా లేవు. అలాగని వావ్ అనిపించేలానూ లేవు. లక్ష్మీ భూపాల మాటల్లో ఆయన మార్కేమీ కనిపించలేదు. రీమేక్ ను యాజిటీజ్ ఫాలో అయిపోవడంతో అక్కడి మాటల్ని తర్జుమా చేయడం తప్ప ప్రత్యేకంగా ఏమీ చేసినట్లు కనిపించలేదు. దర్శకురాలు జీవిత కూడా అంతే. ఆమె ఒరిజినల్ స్క్రిప్టులో ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. సీన్ టు సీన్ ఇక్కడ దించేశారు. దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే క్రెడిట్ కూడా తీసుకున్నారు కానీ కొత్తగా ఆమె చేసిందేమీ లేదు. స్క్రిప్టు దగ్గర్నుంచి ప్రతిదీ ఆమె మాతృకనే అనుసరించారు.

చివరగా: శేఖర్.. మరీ డల్లయిపోయాడు

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater
× RELATED మాచర్ల నియోజకవర్గం
×