సర్కారు వారి బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వస్తారా..??

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. తొలి రోజు డివైడ్ తెచ్చుకున్న ఈ మూవీ.. నాలుగు రోజుల ఫస్ట్ వీకెండ్ ని బాగానే క్యాష్ చేసుకుంది. అయితే వీక్ డేస్ లో వసూళ్ళలో భారీ డ్రాప్ కనిపించింది.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కు డోకా ఉండదు. అయితే మొదటి సోమవారం నుంచి సెకండ్ వీకెండ్ వరకూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడిన చిత్రాలే బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తుంటాయి. అయితే ఇప్పుడు SVP సినిమా కలెక్షన్స్ లో రోజురోజుకూ డ్రాప్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆదివారంతో పోలిస్తే సోమవారం వసూళ్లలో డ్రాప్ కనిపించగా.. మంగళ - బుధ వారాల్లో కలెక్షన్స్ ఇంకా పడిపోయాయి. ఆంధ్రా ప్రాంతంలో పరిస్థితి అంతో ఇంతో మెరుగ్గా ఉన్నా.. నైజాం ఏరియాలో మాత్రం థియేటర్లు వెలవెలబోయాయని తెలుస్తోంది. టికెట్ రేట్లు అధికంగా ఉండటం గట్టి ప్రభావమే చూపించింది.

అయితే గురువారం నుంచి టికెట్ రేట్లు తగ్గించడంతో సర్కారు వారి పరిస్థితి కాస్త పర్వాలేదనిపిస్తోంది. సింగిల్ స్క్రీన్స్ లో 175 - 110.. మల్టీప్లెక్స్ లో 350 - 295 గా ధరలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రధాన థియేటర్లు మరియు మల్టీప్లెక్ లలో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ కనిపిస్తోంది. వీకెండ్ బుకింగ్స్ కూడా ఓ మోస్తరుగా జరుగుతున్నాయి.

రెండో వీకెండ్ లో SVP వసూళ్లను బట్టి బయ్యర్లు సేఫ్ అయ్యారా లేదా అనేది డిసైడ్ అవుతుంది. మహేశ్ బాబు సినిమా ఫస్ట్ వీక్ లో 100 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు మేకర్స్ చెబుతున్నారు. దీని ప్రకారం చూసుకున్నా బ్రేక్ ఈవెన్ ఇంకా పాతిక కోట్ల దూరంలో ఉంది. మరి ఈ వారాంతంలో సర్కారు వారి బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని పరశురాం పెట్లా తెరకెక్కించారు. ఇందులో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. ఆర్ మది సినిమాటోగ్రఫీ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి - 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాయి.
× RELATED రాజమౌళి టాలీవుడ్ ను ముంచేశాడా..?
×