మ్యాచ్ కావడం లేదు లోకేషా : లాజిక్కి మిస్ అవుతోంది...?

మాట్లాడితే లోకేష్ కానీ ఆయన తండ్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు కానీ ఏపీలో వైసీపీ సీన్ కాలింది అంటారు. ఆ పార్టీకి విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందని అంటారు. మాటలు ఇలా ఉంటే పార్టీ వైఖరి ఇచ్చే స్టేట్మెంట్స్ వేరేలా ఉంటున్నాయి మరి. అన్ని పార్టీలు కలసి రావాలి. అపుడే వైసీపీని గద్దె దించగలమని ఒకటికి పదిసార్లు తెలుగుదేశం పెద్దలు మరో వైపు చెబుతున్నారు.

మరి ఈ రెండింటిలో ఏది నిజం. లాజిక్ ఏమైనా ఉందా. నిజంగా వైసీపీని అంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉంటే మొత్తం 175 సీట్లు మావే అని టీడీపీ చెప్పుకోవాలి. అంతే కాదు మాకు ఎవరితో పొత్తు ఉండదు అని ధీమాగా ప్రకటించాలి కదా. కానీ అన్ని పార్టీలు కలిస్తే తప్ప అరాచక ప్రభుత్వాన్ని ఓడించలేమని బేల ప్రకటలను ఇంకో వైపు ఇవ్వడం వల్లనే టీడీపీ పెద్దల మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదని జనాలు అనుకుంటున్న పరిస్థితి.

మామూలుగా చూస్తే వైసీపీకి మూడేళ్ళ పాలన తరువాత జనాల్లో ఆదరణ తగ్గుతోంది. దానికి ఏ సర్వేలు కూడా అవసరం లేదు. అదే సమయంలో ఆ తగ్గుతున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు టీడీపీ ఒక పార్టీగా ఎంతవరకూ సక్సెస్ అవుతోంది అన్నదే ఇక్కడ ప్రశ్న. నీరు  పల్లమెరుగు అన్నట్లుగా అధికార పార్టీ వ్యతిరేకత అంతా టీడీపీ వైపునకే వచ్చి చేరదు కదా. అది రూల్ కూడా కానే కాదు కదా.

పైగా టీడీపీ ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు అయితే లేవన్న విశ్లేషణలు  ఉన్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకత ఉంది దాంతో తామే మళ్లీ అధికారంలోకి వస్తాయన్న పాత రొడ్డకొట్టుడు లెక్కలతోనే టీడీపీ ఇంకా ఉంది. నిజంగా పరిస్థితి అలా ఉందా. ఏపీలో టీడీపీ పట్ల సానుకూలత ఎంత ఎక్కువ పెరిగింది అన్న దానికైతే ఆధారాలు లేవు.

పోనీ ఉన్నాయని జనాలు అనుకున్నా కాదు అని చెప్పేందుకే అధినాయకత్వం ఎపుడూ తనదైన శైలిలో  ప్రయత్నం చేస్తోంది. పొత్తుల పాట పాడుతూ తన బలహీనతలను తానేబయటపెట్టుకుంటోంది. మొత్తంగా చూస్తే ఒక్క మాట అయితే ఉంది.

వైసీపీ తగ్గుతోంది అని చెప్పడం కాదు మేము పెరుగుతున్నామని ఇక్కడ జబ్బ చరచి టీడీపీ  గట్టిగా చెప్పుకోవాలి. జనాలను ఆ దిశగా ఒప్పించగలగాలి. ఆ  దిశగా టీడీపీ మాటలు చేతలూ ఉంటేనే జనాలు తిరిగి వారి వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుంది అంటున్నారు.
× RELATED ఏపీ ప్రజలకు మరో బాదుడు తెచ్చిన జగన్ సర్కార్?
×