ఆత్మహత్యల లెక్కలివిగో .. ! మాట్లాడండి జగన్ !

రైతు ఆత్మహత్యలకు సంబంధించి కొన్ని వివరాలు అందుతున్నాయి. వీటి ప్రకారం చూస్తే ప్రభుత్వం చెప్పిన లేదా చెప్పాలనుకుంటున్న లెక్కలకు మానవ హక్కుల వేదిక రైతు స్వరాజ్య వేదిక చెబుతున్న లెక్కలకూ చాలా అంటే చాలానే వ్యత్యాసం ఉంది.

వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 2112 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లెక్కలు తేలుతుంటే ప్రభుత్వం ఇందుకు భిన్నంగా కేవలం 718 కుటుంబాలకే ప్రత్యేక ప్యాకేజీ కింద సాయం అందించిందని ప్రజా సంఘాలు గగ్గోలు మంటున్నాయి. ఇంతా చేసి మిగిలిన వారి వివరాలు అయినా గుర్తించారా అంటే అదీ లేదు అన్నది వారి వాదన.

అదేవిధంగా జీఓ నంబర్ 43 ప్రకారం పునరావాసం  కూడా అందలేదని వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. మరి! రైతు ప్రభుత్వం అంటే అర్థం ఏంటి?

వాస్తవానికి నిన్నటివేళ రైతు భరోసా అందించారు. అంటే ఖరీఫ్ కు సంబంధించి తమ పాలనలో ముందుగానే సాయం అందించి రైతుకు మేలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.

మొదటి విడతలో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు (ఇందులో కేంద్రం సాయం  కూడా మిళితం అయి ఉంది. కేంద్రం తరఫున రెండు వేల రూపాయలు అందుతోంది.) చొప్పున ఇచ్చేందుకు సర్కారు ముందుకు వచ్చింది.

కానీ ఈ సాయం కూడా అంతంత మాత్రమే ! పంటలు పోయి అప్పుల ఊబిలో ఉన్నా చాలా కుటుంబాలు పరిహారం అందక పస్తులుంటున్నాయి అని తేలింది. అప్పుడు ఖరీఫ్ కు వాళ్లెలా సిద్ధం అవుతారని? ఇది కూడా ప్రజా హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమది రైతు ప్రభుత్వం అని చెబుతున్న జగన్ సర్కారు వీటిపై ఓ సారి పునరాలోచన చేయాలని హితవు చెబుతున్నాయి.
× RELATED 'ది వారియర్' ఆల్రెడీ సగం సక్సెస్ కొట్టేసింది: బోయపాటి
×