అమిత్ షా సభ ఎఫెక్ట్.. 2009 కోసం కేసీఆర్ వెయిటింగ్..!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్న బీజేపీకి తుక్కుగూడ సభ పూర్తి ఆత్మవిశ్వాసం నింపింది. తన మొదటి రెండో విడత పాదయాత్రల ద్వారా ప్రజలకు.. ముఖ్యంగా యువతకు చేరువైన బండి సంజయ్ ఇక పరుగు అందుకోనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి.. దానికి అమిత్ షాను రప్పించి విజయవంతం చేయడంలో బండి సక్సెస్ అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే ధీమాను పార్టీ శ్రేణుల్లో కల్పించారు.

అయితే.. అమిత్ షా సభ విజయవంతం అయినందుకు బీజేపీ నేతలే కాకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారట. బీజేపీ బలపడుతుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నా అధినేత మాత్రం ధీమాగా ఉన్నారట. ఫాంహౌస్లో ఉన్న కేసీఆర్ బీజేపీ సభ జరిగిన తీరు గురించి  తన సన్నిహితుల వద్ద చర్చించారట. బీజేపీ ఎంత బలపడితే అంత మనకే మంచిదని.. కాంగ్రెసును నిలువరిస్తే వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్లీ అధికారంలోకి రావొచ్చని కేసీఆర్ భావిస్తున్నారట. 2009 ఎన్నికల ఉదాహరణను చూపిస్తూ నేతల వద్ద ప్రస్తావించారట.

2004లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించి వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 185 స్థానాలతో తిరుగులేని ఆధిక్యం సాధించింది. 2009 ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితిలో మార్పు వచ్చింది. సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చింది. 156 స్థానాలు సాధించి బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది. టీడీపీ 92 స్థానాలు గెలుచుకోగా.. పీఆర్పీ 18 సీట్ల దగ్గరే ఆగిపోయింది.

తర్వాత తేలిన లెక్కల ప్రకారం పీఆర్పీ వల్ల టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచిందని తేలింది. త్రిముఖ పోరు వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టీడీపీ పీఆర్పీ పంచుకున్నాయి. టీడీపీ గెలిచిన 92 స్థానాలకు తోడు.. దాదాపు మరో 50 సీట్లలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ వల్లే వైఎస్ మరోసారి సీఎం కాగలిగారనేది సుస్పష్టం. తెలంగాణలో కూడా 2009 రిపీట్ అవుతుందని కేసీఆర్ ఆలోచనగా ఉంది. రెండుసార్లు అధికారంలో ఉన్నందున ఎలాగూ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని.. ఆ ఓటు ఏకపక్షంగా కాంగ్రెసుకు వెళ్లకుండా బీజేపీ బలపడితే మేలని కేసీఆర్ యోచిస్తున్నారట.

టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు రేవంత్ రూపంలో కాంగ్రెసు బలంగా వస్తోందని గుర్తించిన కేసీఆర్ తన వ్యూహంలో భాగంగా ఏడాదిగా బీజేపీని దువ్వడం మొదలుపెట్టారు. ఇపుడు బీజేపీ కూడా బలంగా మారడంతో వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ బీజేపీ పంచుకుంటే తాము స్వల్ప మెజారిటీతో అయినా గట్టెక్కవచ్చని కేసీఆర్ భావనగా ఉంది. 2009 రిపీట్ అవుతుందా..? మొదటికే మోసం వస్తుందా అనేది వేచి చూడాలి.
× RELATED మరో శ్రీలంక గా పాక్.. వివాహ వేడుకలపై నిషేధం!
×