ఇంతకీ RRR 'ఫ్రీ'నా..? 'పే పర్ వ్యూ'నా..??

దర్శకధీరుడు SS రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ''RRR'' (రౌద్రం రణం రుధిరం) సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ భారీ మల్టీస్టారర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టారు.

బిగ్ స్క్రీన్ పై సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం.. ఇప్పుడు డిజిటల్ తెర మీదకు రాబోతోంది. యావత్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మే 20న జీ5 ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హిందీ మినహా మిగతా నాలుగు దక్షిణాది భాషల్లో ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్ట్రీమింగ్ కాబోతోంది.

RRR స్ట్రీమింగ్ డేట్ రావడం.. సరికొత్త హంగులతో ముస్తాబు చేసిన ఓటీటీ ట్రైలర్ ఆకట్టుకోవడంతో అందరూ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. అయితే Zee5 ఓటీటీ సంస్థ ఈ భారీ చిత్రాన్ని పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తుండటం పట్ల చాలా మంది సినీ అభిమానులు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

జీ5 ఓటీటీకి డబ్బులు చెల్లించి సబ్ స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత.. ఇప్పుడు సినిమా చూడటానికి కట్టమనడం ఏంటని ట్రోల్స్ చేస్తున్నారు. అధిక రేట్లతో థియేటర్లలో RRR సినిమాని చూశామని.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై చూడటానికి డబ్బులు పే చేయాలనడం భావ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు.

కాకపోతే జీ5 ఓటీటీ ఇంతవరకు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని పే పర్ వ్యూ విధానంలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే.. సినీ అభిమానుల కోరిక మేరకు ఓటీటీ బృందం దీన్ని సెటప్ చేసి.. ఈ పద్ధతిని ఎత్తివేస్తుందేమో చూడాలి.

కాగా విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో RRR చిత్రాన్ని రూపొందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. సరిగ్గా రెండు నెలలకు ఓటీటీలోకి రాబోతోంది. మరి డిజిటల్ రిలీజ్ లో ఈ మూవీ ఎలాంటి వ్యూయర్ షిప్ సాధిస్తుందో చూడాలి.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో భీమ్ గా తారక్.. రామరాజుగా చరణ్ లు నటించారు. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగణ్ - శ్రియ - సముద్రఖని - రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేశారు.
× RELATED సూపర్ హీరో `థోర్`కి సాయితేజ్ ప్రమోషన్
×