వీడియో: రాజమౌళి కోసం మొదలెట్టిన మహేష్!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన స‌ర్కార్ వారి పాట ఇటీవ‌ల విడుద‌లై ఆరంభ వ‌సూళ్ల‌ను ఘ‌నంగా సాధిస్తోంది. ఈ సినిమాకి థియేట‌ర్ చైన్ స‌హ‌కారం ప్లానింగ్ ఓపెనింగుల ప‌రంగా క‌లిసొచ్చింద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండ‌గానే మ‌హేష్ త‌న త‌దుప‌రి సినిమాపై దృష్టి సారించార‌ని టాక్ వినిపిస్తోంది.

మ‌హేష్ త‌దుప‌రి పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తారు. ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తున్నారు. విజ‌యేంద్రునితో క‌లిసి రాజ‌మౌళి స్క్రిప్టు డెవ‌ల‌ప్ మెంట్ ప్రాసెస్ లో బిజీగా ఉన్నార‌ని ఇటీవ‌ల‌ టాక్ వినిపించింది.

అయితే రాజ‌మౌళి సినిమాలో మ‌హేష్ గెట‌ప్ ఎలా ఉంటుంది? అంటే దానికి అభిమానులు ఎవ‌రికి వారు ఊహిస్తున్నారు త‌ప్ప ఆధారాలేవీ దొర‌క‌లేదు. చూస్తుంటే మ‌హేష్ రాకుమారుడిని త‌ల‌పించే లా ఉన్నాడ‌న్న వ్యాఖ్య‌లు తాజాగా వినిపిస్తున్నాయి.

ఇంత‌కుముందే జిమ్ లో మ‌హేష్ క‌స‌ర‌త్తులు చేస్తున్న ఒక వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో మ‌హేష్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఒక నిపుణుడైన కోచ్ స‌మ‌క్షంలో అత‌డు మ‌జిల్స్ ని బిల్డ్ చేస్తున్న తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ముఖ్యంగా రాజ‌మౌళి త‌న హీరోల‌ను యోధులుగా బ‌లాఢ్యులుగా ఆవిష్క‌రించేందుకు ఎంతో ఆస‌క్తిగా ఉంటారు. బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ - రానాల‌ను ఆయ‌న భుజ‌బ‌ల బాహుబ‌ల ప‌రాక్ర‌ములుగా త‌యారు చేసారు. ఇటీవ‌ల విడుద‌లైన ఆర్.ఆర్.ఆర్ కోసం రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ల‌ను కూడా అంతే ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ తో చూపించారు.

ఈసారి మ‌హేష్ ని ఎలాంటి క‌థ‌లో చూపిస్తారు? అత‌డి రూపం ఎలా ఉండ‌నుంది? అన్న‌ది క్యూరియాసిటీని పెంచుతోంది. దానికి త‌గ్గ‌ట్టే మ‌హేష్ త‌న శ‌రీరాకృతిని మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారా? అంటూ ఈ వీడియో సందేహాల్ని రాజేసింది. ప్ర‌స్తుతానికి ఇది ఊహ మాత్ర‌మే. రాజ‌మౌళి మూవీలో మ‌హేష్ గెట‌ప్ ఎలా ఉంటుంది? అన్న‌ది అధికారికంగా వివ‌రాలు రావాల్సి ఉంది.


 
× RELATED రాజమౌళి టాలీవుడ్ ను ముంచేశాడా..?
×