లవ్ చేయట్లేదని యాసిడ్ దాడి చేసి తప్పించుకోవటానికి సన్యాసి వేషం!

వీడి గురించి తెలిసినంతనే వీడెంత ముదురు టెంకె అన్న విషయం ఇట్టే అర్థం కావటమే కాదు.. ఇలాంటోడ్ని ఊరికే వదిలిపెట్టకూడదన్న భావన కలగటం ఖాయం. తాను చేసిన దారుణ నేరం నుంచి తప్పించుకోవటానికి పక్కా స్కెచ్ వేసినప్పటికి అతగాడి ఎత్తుగడులను భగ్నం చేశారు కర్ణాటక పోలీసులు. ఇతడు చేసిన దారుణ నేరం ఒక ఎత్తు అయితే.. ఆ నేరానికి ముందు.. తర్వాత అతడు చేసిన ప్లానింగ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎంత క్రిమినల్ మైండ్ తో ఆలోచించాడన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

బెంగళూరుకు చెందిన నగేశ్ అనే ప్రేమోన్మాది ఒక యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. ఆ యువతి బంధువుల ఇంట్లోనే ఏడేళ్లుగా అద్దెకు ఉంటున్న అతను.. తాను కోరుకున్నది దక్కకపోవటంతో రగిలిపోయాడు. తన ప్రేమకు ఆమె నో చెప్పటంతో తన వేధింపుల్ని మరింత  పెంచాడు. అయినప్పటికీ నో అన్న మాట మీదనే ఉండటంతో రగిలిపోయిన అతడు..  ఏప్రిల్ 28న ఆఫీసు బయట నిలుచున్న ఆమె మీద యాసిడ్ పోశాడు. దాడి అనంతరం నగేశ్ పారిపోయాడు. ఈ ఉదంతం గురించి బాధితురాలు.. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు రంగంలోకి దిగారు.

ప్రాథమిక ఆధారాల్ని సేకరించిన పోలీసులకు నగేశ్ క్రిమినల్ మైండ్ చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. నేరం చేయాలన్న ఆలోచనతో పక్కా ప్లానింగ్ చేసుకున్న వైనం అడుగడుగునా కనిపించింది. కోపంతో కాకుండా పక్కా ప్లాన్ తో ఆమెపై యాసిడ్ దాడి చేసిన వైనాన్ని గుర్తించారు. యాసిడ్ దాడికి కాస్త ముందుగానే తన బట్టల షాపును వేరే వారికి అమ్మేయటం.. అందులోని సామాన్లను సైతం ఇచ్చేశాడు. అంతేకాదు.. దాడికి ముందు రోజు కొందరు బంధువులు.. స్నేహితులతో తాను టీవీలో కనిపిస్తానని చెప్పాడు.

అంతేకాదు.. యాసిడ్ దాడి చేసిన తర్వాత పారిపోయే టైంలో తాను వాడే సెల్ ఫోన్ ఉపయోగించటం మానేశాడు. ఇలా తనను పోలీసులు పట్టుకోకుండా ఉండటానికి వీలుగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. తన రెండు ఫోన్లను పూర్తిగా ఫార్మాట్ చేసేసి పడేశాడు. సిమ్ కార్డుల్ని మరో చోట పడేశాడు.

ఇలా తనకు సంబంధించిన ఏ ఆధారం దొరక్కుండా ఉంటానికి వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. దీంతో పోలీసులకు అతని ఆచూకీ పట్టుకోవటం మరింత కష్టమైంది. ఈ నేపథ్యంలో నగేష్ ఫోటోల్ని విడుదలచేసిన పోలీసులు.. అతడ్ని పట్టుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేశారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాలకు పంపారు. అతడి ఫోటోల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

ఇలాంటి వేళ.. తిరువణ్ణమలైలోని ఒక ఆశ్రమంలో నగేశ్ పోలినట్లుగా ఒక వ్యక్తిని చూసినట్లుగా చెప్పటంతో ఆశ్రమానికి వెళ్లారు. తాను ఇప్పుడు భౌతిక అంశాల్ని పట్టించుకోవటం లేదంటూ చావు తెలివిని ప్రదర్శించాడు. సన్యాసిగా మారానని బిల్డప్ ఇచ్చాడు. నేరం చేసి సన్యాసిగా మారానన్న నగేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. ఇదంతా చూసినప్పుడు వాడెంత ముదురుకేసు అన్నది ఇట్టే అర్థం కాక మానదు.
× RELATED సంక్షోభంలో బ్రిటన్ ప్రభుత్వం.. రాజీనామాల క్యూ.. ఇన్ఫోసిన్ నారాయణమూర్తి అల్లుడి ‘కీ’రోల్
×