నత్త నడకన సాగుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్.. కారణం అదేనా..?

ఇప్పుడు తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా అనే విధంగా మారిపోయింది. ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. అయితే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేయడానికి ఓ బిగ్ స్టార్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ కలిసి కంకణం కట్టుకున్నారు.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.

భారతదేశంలోని అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా పేరు గాంచిన ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ - టాప్ నాచ్ టెక్నిషియన్స్ భాగం అయ్యారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరో లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలోకి ఇద్దరు పాపులర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను ఫీమేల్ లీడ్స్ గా తీసుకున్నారు.

అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో ఒక లెజెండరీ యాక్టర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాలే డైరెక్ట్ చేసినా.. తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగలిగాడు. తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని బ్యాంక్ రోల్ చేస్తోంది.

సైన్స్ ఫిక్షన్ సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ కోసం 550 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారని ప్రచారంలో ఉంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.. అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. అయితే అప్పుడెప్పుడో ప్రారంభమైన ఈ భారీ చిత్రం నత్త నడకన ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి సినిమా ఇండియాలో మొదటి కావడంతో ప్రతీది మేకర్స్ కు కొత్తగానే ఉంటోంది. అందుకే చాలా కాలం క్రితమే స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్.. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఇంకొన్నాళ్ళు డిలే అయింది. ఆ మధ్య ప్రధాన నటీనటులతో షూటింగ్ మొదలు పెట్టి ఓ షెడ్యూల్ పూర్తి చేశారు.

అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటుండగా.. డైరెక్టర్ మరియు హీరో మధ్య సింక్ కుదరకపోవడంతో షూటింగ్ మాత్రం ముందుకు సాగడం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. యంగ్ డైరెక్టర్ మామూలుగానే సినిమా కోసం చాలా ఎక్కువ సమయం తీసుకుంటాడు. అయితే హీరో మరో సినిమా షూటింగ్ ని వాయిదా వేసుకోవడం వల్ల.. అనుకున్న ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని దర్శకుడు భావించాడు.

దీనికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నా హీరో - దర్శకుల మధ్య నాన్ సింక్ వల్ల ఏ పని కూడా అనుకున్న సమయానికి జరగడం లేదని అంటున్నారు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. దర్శకుడి హోమ్ ప్రొడక్షన్ అయినప్పటికీ.. నిర్మాణం ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం తీసుకోవడం.. దీంతో వడ్డీలు పెరిగి చివరికి సినిమా బడ్జెట్ లో పెరుగుదలకు దారి తీస్తుండటం సీనియర్ నిర్మాతకు బీపీ తెప్పిస్తోందని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం పాన్-ఇండియన్ హీరో మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. వాటిల్లో వచ్చే ఏడాది రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక దర్శకుడి చివరి చిత్రం వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసమే పని చేస్తున్నాడు. మరి ఈ సినిమా పూర్తై బిగ్ స్క్రీన్ మీదకు రావాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుందో చూడాలి.
× RELATED రాపోని ఆశీర్వదించిన శంకర్-మణిరత్నం
×