వర్కు ఫ్రం ఆఫీస్ అన్నారు.. ఆ సంస్థలో 800 మంది రిజైన్

కరోనా కొత్త జీవనశైలి విధానాల్ని నేర్పించదన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. కరోనా పుణ్యమా అని యావత్ ప్రపంచం మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ గమనాన్ని కరోనాకు ముందు.. కరోనా తర్వాత అని చెప్పే పరిస్థితి. అంతలా మారిపోయిన ప్రపంచానికి తగ్గట్లుగా కంపెనీలు తమ పాలసీని మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఎదురుదెబ్బలు తింటున్న వైనం ఈ మధ్యన ఎక్కువైంది. కరోనా వేళ.. ఆ కంపెనీ.. ఈ కంపెనీ అన్న తేడా లేకుండా అన్ని రకాల సంస్థలు తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయమని చెప్పటం తెలిసిందే.

గడిచిన కొన్ని నెలలుగా పరిస్థితుల్లో మార్పు రావటం.. కరోనా పీడ దాదాపు తొలిగిపోయిందన్న భావన ఎక్కువ అవుతోంది. కరోనా ముందున్న పరిస్థితుల్లోకి దేశం వెళుతోంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల్ని ఇంటి నుంచి కాకుండా ఆఫీసుల నుంచి పని చేయాలంటూ ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. అలా కోరే క్రమంలో.. తప్పనిసరిగా ఆఫీసుకే వచ్చి పని చేయాలి.. ఇంటి నుంచి పని చేసే విధానాన్ని బంద్ చేయండని గట్టిగా చెబుతున్న కంపెనీలకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది ‘‘వైట్ హ్యాట్ జూనియర్’’ అనే కంపెనీకి. కోడింగ్ నైపుణ్యాలను నేర్పించే ఈ సంస్థకు చెందిన ఉద్యోగుల్ని నెల రోజుల వ్యవధిలో అందరూ ఆఫీసులకు రావాలంటూ మార్చి 18న సర్క్యులర్ జారీ చేశారు. కట్ చేస్తే.. ఆ ప్రకటన వెల్లడైన రెండు నెలల వ్యవధిలో ఇప్పటివరకు 800 మంది పర్మినెంట్ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేసి వెళ్లిపోవటం గమనార్హం. రానున్న రోజుల్లో మరిన్ని రాజీనామాలు ఉద్యోగుల నుంచి రానున్నట్లు చెబుతున్నారు.

వైట్ హ్యాట్ జూనియర్ సంస్థను కరణ్ బజాజ్ నిర్వహించేవారు. ఈ కంపెనీని 2020లో ఎడ్యూటెక్ సంస్థ బైజూస్ కొనుగోలు చేయటం.. 2021లో కరణ్ బజాజ్ సంస్థ నుంచి బయటకు వెళ్లిపోవటం జరిగింది. అప్పటి నుంచి కంపెనీ తీరు మారిపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు.  ఇంటి నుంచి పని చేయొద్దన్న కంపెనీ నుంచి 800 మంది ఉద్యోగులు రిజైన్ చేసిన వైనంపై వార్తలు జోరందుకున్న వేళ.. ఆ అంశంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

సేల్స్.. సపోర్టు విభాగాలకు చెందిన ఉద్యోగులను ఏప్రిల్ 18 నుంచి ఆఫీసులకు రావాలని చెప్పామని.. మరికొందరు ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. ఇంటి నుంచి పని చేసే అలవాటు బాగా వంట పట్టించుకున్న ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే విషయంలో ఇంకా సిద్ధంగా లేరన్న మాట వినిపిస్తోంది.

ఇటీవల ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల విషయంలోహైబ్రిడ్ విధానాన్ని అమలు చేబుతున్నాయి. వారానికి మూడు రోజులు ఆఫీసులకు రమ్మని చెబుతున్నా.. చాలా మంది ఉద్యోగులు అందుకు సుముఖంగా లేరంటున్నారు. మరీ తప్పదంటే.. కంపెనీకి గుడ్ బై చెప్పేసి.. మరోకంపెనీని వెతుక్కుంటున్నారే తప్పించి కంపెనీ చెప్పినట్లుగా  ఆఫీసుకు వెళ్లాలని మాత్రం అనుకోవట్లేదు. ఇదే పరిస్థితి దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ ఉద్యోగులు సైతం ఆఫీసుకు రావటానికి నో చెప్పేస్తున్నారు.
× RELATED కోటం రెడ్డి బిగ్ వాయిస్ : అభివృద్ధి లేదు... ఎవరూ పట్టించుకోరు...
×