దేశ రాజధానిలో దారుణ అగ్నిప్రమాదం.. 27 మంది దుర్మరణం

దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో దారుణ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రద్దీగా ఉండే ముండ్కా మెట్రోస్టేషన్ కు సమీపంలోని మూడు అంతస్తుల భవనంలో శుక్రవారం సాయంత్రం 4.40 గంటల వేళలో మంటలు చెలరేగాయి.

ఈ ఉదంతంలో 27 మంది దుర్మరణం పాలైనట్లుగా వెల్లడైంది. దాదాపు నలబై మందికి పైనే గాయపడ్డారని.. పలువురు భవనం మీద నుంచి కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నట్లుగా చెబుతున్నారు. సరైన సమయంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి.. మంటల్నిఆర్పే ప్రయత్నం చేసే క్రమంలో దాదాపు 60 నుంచి 70 మందిని రోప్ సాయంతో రక్షించినట్లుగా చెబుతున్నారు.

ఈ దారుణ అగ్నిప్రమాదం గురించి తెలిసినంతనే 24 మంది అగ్నిమాపక సిబ్బందిని పంపినట్లుగా చెబుతున్నారు. అధికారిక వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు గుర్తించిన డెడ్ బాడీస్ లో 20  మందిని వెలికి తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న భవనంలోని మరో ఫ్లోర్ ను గాలించాల్సి ఉంది. దాన్ని కూడా పూర్తి చేస్తే.. మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ మూడు అంతస్తుల భవనంలో పలు రకాల కంపెనీలు ఉండటంతోజనంతో రద్దీగా ఉంది. తొలి అంతస్తులో సీసీ కెమేరాల ఉత్పత్తి సంస్థ ఉంది. అక్కడే అగ్నిప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. దాని తర్వాత నుంచే భవనం మొత్తానికి మంటలు వ్యాపించినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే.. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంస్థకు చెందిన యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ దారుణ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. అగ్నిప్రమాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈ ఘోర అగ్నిప్రమాదం తనకు చాలా బాధను కలిగిందని.. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు చెప్పారు.

మంటల్ని ఆర్పే విషయంలోఅగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా వ్యవహరించారని.. మరణించిన వారి కుటుంబాలకు వీలైనంతగాసాయం చేస్తామన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు.. గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

 
 

× RELATED వారాహి ఫైనాన్స్ ఎన్నారై టీడీపీ నా...?
×