సర్కారు వారి పాట

మూవీ రివ్యూ : సర్కారు వారి పాట

నటీనటులు: మహేష్ బాబు-కీర్తి సురేష్-సముద్రఖని-నదియా-వెన్నెల కిషోర్-సుబ్బరాజు-తనికెళ్ల భరణి-నాగబాబు తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: మది
నిర్మాతలు: నవీన్ ఎర్నేని-రవిశంకర్-రామ్ ఆచంట-గోపీచంద్ ఆచంట
రచన-దర్శకత్వం: పరశురామ్

భరత్ అనే నేను.. మహర్షి.. సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపుమీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’తో కెరీర్లో అతి పెద్ద విజయాన్నందుకున్న యువ దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్-14 రీల్స్ ప్లస్ లాంటి రెండు పెద్ద బేనర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సూపర్ ఫాంలో ఉన్న తమన్ సంగీతాన్నందించాడు. టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చిత్రం.. ట్రైలర్ తో అంచనాలను మరింత పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సర్కారు వారి పాట’ ఆ అంచనాలను ఏమేర అందుకుంది.. మహేష్ డబుల్ హ్యాట్రిక్‌ కు శ్రీకారం చుట్టాడా.. పరశురామ్ తనకు దక్కిన పెద్ద అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడా.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం పదండి.

కథ:

మహేష్ (మహేష్ బాబు) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన కుర్రాడు. బ్యాంక్ లోన్ కట్టలేక ఆత్మహత్య చేసుకున్న తన తల్లిదండ్రులను చూసి.. తాను అప్పు అడిగే స్థితిలో కాకుండా అప్పు ఇచ్చే స్థితిలో ఉండాలని లక్ష్యం పెట్టుకుని.. అందుకు తగ్గట్లే చదువుకుని యుఎస్ వెళ్లిన అతను అక్కడ ఫైనాన్స్ కంపెనీ పెట్టి మంచి స్థాయికి ఎదుగుతాడు. ఐతే అప్పులివ్వడంలో.. అలాగే వాయిదాలు రాబట్టుకోవడంలో చాలా కఠినంగా వ్యవహరించే మహేష్.. చదువు పేరు చెప్పి జల్సాల కోసం తన దగ్గర అప్పు చేసిన కళావతి (కీర్తి సురేష్) విషయంలో బోల్తా కొడతాడు. ఆమెతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. కానీ తర్వాత తన నిజ స్వరూపం తెలుసుకుని తగువు పెట్టుకున్న అతను.. ఆమె చేసిన అప్పును తన తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) దగ్గర వసూలు చేసుకోవడానికి ఇండియాకు బయల్దేరతాడు. అక్కడికి వచ్చాక మహేష్ కు ఇంకా పెద్ద లక్ష్యం ఉందని వెల్లడవుతుంది. ఆ లక్ష్యం ఏంటి.. దాని కోసం అతను ఎక్కడి దాకా వెళ్లాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

మన దగ్గర స్టార్ హీరోలందరూ ఎక్కువగా లార్జర్ దన్ లైఫ్ కథలు-పాత్రలకే ఓటు వేస్తారు. వాళ్ల నుంచి మెజారిటీ ప్రేక్షకులు ఆశించేవి కూడా అవే. చిన్న సంఘటన చుట్టూ వాస్తవిక కోణంలో కథలు నడిస్తే అవి ప్రేక్షకులకు అంతగా ఆనవు. స్టార్ హీరో అన్నాక వ్యవహారమంతా కూడా భారీగా కనిపించాలి. విలన్-హీరో మధ్య సంఘర్షణకు దారి తీసే విషయం కూడా చాలా పెద్దదై ఉండాలి. కానీ ‘సర్కారు వారి పాట’లో ఆ విషయమే చాలా ‘చిన్నది’గా కనిపిస్తుంది. హీరోయిన్ తన దగ్గర చేసిన పది వేల డాలర్లు (మన రూపాయల్లో చెప్పాలంటే రూ.7.7 లక్షలు) అప్పుడు వసూలు చేసుకోవడానికి ఏకంగా ఉన్న పనులన్నీ వదులుకుని ఇండియా వచ్చేస్తాడు. ఇక్కడికొచ్చాక తన ప్రయాణ ఖర్చులు.. హీరోయిన్ తొలి అప్పు తర్వాత అంతకుమించి తీసుకున్న వేలకు వేల డాలర్లు.. ఇవన్నీ వదిలేసి ఆ పది వేల డాలర్లే కావాలని కూర్చుంటాడు. హీరో హీరోయిన్ల మధ్య కామెడీ.. రొమాన్స్ కోసం ఈ అప్పు వ్యవహారం వాడుకున్నంత వరకు ‘సర్కారు వారి పాట’ సరదాగానే అనిపించి ఎంగేజ్ చేస్తుంది కానీ.. ఇదే పది వేల డాలర్ల వ్యవహారాన్ని విలన్ తో హీరో కాన్ఫ్లిక్ట్ కోసం వాడుకోవడం.. దాని మీదే కథను ముందుకు నడిపించడం సిల్లీగా అనిపిస్తుంది. తర్వాత పది వేల కోట్ల అప్పు అంటూ కథను కొత్త మలుపు తిప్పినా.. ఆ వ్యవహారంతో నేరుగా హీరోకు అసలే సంబంధం ఉండదు. తనది కాని ఓ లక్ష్యాన్ని హీరో నెత్తికెత్తుకుని.. విలన్ని ఢీకొడుతుంటే అందులో పెద్దగా ఎమోషన్ కనిపించదు. కామెడీ వరకు కొంత వర్కవుట్ అయినా.. మహేష్ వరకు అభిమానులను అలరించినా.. కమర్షియల్ హంగులు బాగానే అద్దినా.. మనసును తాకని కథ.. ఎంగేజ్ చేయని కథనం.. ‘సర్కారు వారి పాట’ను సాధారణ చిత్రంగా మార్చాయి.

ఓవైపు బడా వ్యాపారవేత్తలు వేల కోట్లు ఎగ్గొట్టి దర్జాగా విదేశాలకు పారిపోతుంటారు. ఇంకోవైపేమో లక్ష రూపాయల అప్పు తీసుకుని రెండు నెలలు ఈఎంఐ కట్టకపోతే బ్యాంకు వాళ్లొచ్చి మీద పడిపోతారు. ఈ రెండు వైరుధ్యాల నేపథ్యంలోనే దర్శకుడు పరశురామ్ ‘సర్కారు వారి పాట’ కథను అల్లుకున్నాడు. నిజానికిది కంటెంపరరీగా అనిపించే.. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునే పాయింట్. ఈ నేపథ్యంలో కథ రాయాలనుకోవడం మంచి ఆలోచనే కానీ.. ఆ కథను అనుకున్నంత ఆసక్తికరంగా.. ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా అతను తీర్చిదిద్దలేకపోయాడు. ముఖ్యంగా హీరో పాత్రకు.. ఈ ప్లాట్ పాయింట్ కు సరిగా ముడి పెట్టలేకపోయాడు. తనది కాని ప్రతీకారాన్ని హీరో నెత్తికెత్తుకున్న సినిమాలేవీ సరిగా ఆడిన దాఖలాలు కనిపించవు. ‘సర్కారు వారి పాట’లోనూ అదే సమస్య. ఇందులో పైన చెప్పుకున్న పదివేల డాలర్ల సిల్లీ వ్యవహారం మినహాయిస్తే.. విలన్ తో హీరోకు పెద్దగా వైరం ఏమీ ఉండదు. విలన్ వల్ల అతను నేరుగా ఇబ్బంది పడడు. అప్పు తీసుకున్న ఎక్కడున్నా వెళ్లి వసూలు చేసుకుని రావాలన్నది హీరో పాలసీ. ఐతే హీరో దగ్గర అప్పు తీసుకున్న హీరోయిన్ అక్కడే ఉంటుంది. అలాంటపుడు ఆమెతో తేల్చుకోకుండా ఫోన్లో ఆమె తండ్రి ఏదో అన్నాడని ఇండియాకు వచ్చేస్తాడు. తన పది వేల డాలర్ల కోసం ఆయన వెంట పడడం.. అతను హీరో మీదికి రౌడీల్ని పంపడం.. ఇతను వాళ్లకు బుద్ధి చెప్పడం.. ఇలా ప్రేక్షకులకు ఏం చూస్తున్నామో అర్థం కాని అయోమయంతో సాగే ‘సర్కారు వారి పాట’.. విలన్ కట్టాల్సిన పది వేల కోట్ల బ్యాంకు అప్పు దగ్గరికి వచ్చి ఆగుతుంది.

ఈ ట్విస్ట్ చూసి హీరో ఏదో పెద్ద లక్ష్యంతోనే అమెరికా నుంచి ఇండియాకు బయల్దేరాడని.. దీని వెనుక వేరే కథ ఉందని అనిపిస్తుంది. కానీ మధ్యలో తనకు సంబంధం లేని వ్యక్తికి జరిగిన నష్టం గురించి తెలుసుకుని విలన్ని టార్గెట్ చేయడానికి వచ్చాడని తర్వాత వెల్లడవుతుంది. ఇలా ఎవరో పరిచయం కూడా లేని వ్యక్తి తాలూకు నష్టాన్ని భర్తీ చేయడానికి హీరో రంగంలోకి దిగాక ఇక ప్రేక్షకుడిలో ఎక్కడ ఎమోషన్ ఎక్కడ ఉంటుంది? సినిమాను సరదాగా మొదలుపెట్టి.. హీరో హీరోయిన్ ట్రాక్ ను కూడా వినోదాత్మకంగా నడిపించి.. ఒక దశ వరకు బాగానే ఎంగేజ్ చేసిన దర్శకుడు పరశురామ్.. కథ సీరియస్ టర్న్ తీసుకున్న దగ్గర్నుంచి ట్రాక్ తప్పేశాడు. అసలా కథ టర్న్ తీసుకున్న విధానమే ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్ కాలేని విధంగా తయారైంది. ఇక్కడి నుంచి సన్నివేశాలు వస్తుంటాయి. పోతుంటాయి.

హీరో-విలన్ మధ్య సవాళ్లు.. ఎత్తులు పై ఎత్తులు.. నడుస్తుంటాయి. కానీ ఎక్కడా కూడా ఎమోషనల్ గా కనెక్టయ్యేలా కథాకథనాలు నడవవు. ద్వితీయార్ధంలో మళ్లీ హీరోయిన్ని రంగంలోకి దించి కొంత కామెడీ పండించే ప్రయత్నం చేశారు. విడిగా చూస్తే ఆ సన్నివేశాలు సరదాగానే అనిపిస్తాయి కానీ.. సీరియస్ గా సాగుతున్న కథలో మాత్రం అవి పంటి కింద రాళ్ల లాగే అనిపిస్తాయి. అలాగని ఆ సీరియస్ కథ అయినా ఎంగేజింగ్ గా సాగిందా అంటే అదీ లేదు. విలన్ పాత్ర ఆరంభం నుంచే తుస్సుమనిపించేయడంతో.. ఏ దశలోనూ హీరోతో అతడి ఫైట్ రక్తి కట్టలేదు. హీరోయిజం ఎలివేట్ చేసే కొన్ని సీన్ల వరకు ఎంగేజ్ చేసినా.. కథాకథనాలు మాత్రం అంతకంతకూ నీరుగారిపోయాయి. ద్వితీయార్ధంలో హీరో ‘క్లాసులు’ మరీ ఎక్కువైపోయి విసుగు పుడుతుంది. క్లైమాక్స్ అయితే మరీ సాధారణంగా తయారై సినిమా గ్రాఫ్ ను మరింత తగ్గించేసింది. ఓవరాల్ గా ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు.. మహేష్ పెర్ఫామెన్స్.. ఫ్యాన్ మూమెంట్స్ తప్పితే ‘సర్కారు వారి పాట’లో పెద్ద విశేషాలేమీ లేవు. ఏదో అలా అలా టైంపాస్ చేయడానికైతే ఓకే కానీ.. అంతకుమించి ఆశిస్తే కష్టం.

నటీనటులు:

వరుసగా సీరియస్ క్యారెక్టర్లు చేసిన మహేష్.. పోకిరి.. ఖలేజా.. దూకుడు రోజులను గుర్తు చేస్తూ తనలోని కామెడీ టైమింగ్ ను బయటికి తీస్తూ అల్లరి పాత్రను చేయడం అభిమానులను అలరిస్తుంది. కొంత మేర సీరియస్ షేడ్స్ కూడా ఉన్నప్పటికీ.. చాలా వరకు జోవియల్ గానే సాగుతుంది మహి క్యారెక్టర్. ప్రథమార్ధంలో కీర్తితో ఎపిసోడ్లో మహేష్ చేసిన కామెడీ సినిమాకు హైలైట్. అదే మేజర్ రిలీఫ్ కూడా. ఎమోషనల్ సీన్లలో మహేష్ ఓకే అనిపించాడు. లుక్స్ పరంగా అతను ఎప్పట్లాగే ఆకట్టుకున్నాడు. కీర్తి సురేష్ గత సినిమాలతో పోలిస్తే కొంచెం ఒళ్లు చేసి ఆకర్షణీయంగా కనిపించింది. తన నటన బాగానే సాగింది. విలన్ పాత్రలో సముద్రఖని ప్రత్యేకంగా ఏమీ చేసింది లేదు. తన పాత్ర ఆరంభం నుంచి తేలిపోవడంతో ఆయన చాలా సాధారణంగా కనిపించాడు. వెన్నెల కిషోర్ ఇలాంటి పాత్రలు లెక్కలేనన్ని చేశాడు. తన కామెడీ పర్వాలేదు. నదియా. నాగబాబు చిన్న పాత్రల్లో ఓకే అనిపించారు. సుబ్బరాజు.. తనికెళ్ల భరణి బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

తమన్ ఇప్పుడున్న ఫాంలో తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వలేదనిపిస్తుంది. కళావతి పాట ప్రత్యేకంగా అనిపించినా.. మిగతా ఆ స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం విషయంలో తన నుంచి ప్రేక్షకులు ఇంకా ఎక్కువే ఆశిస్తారు. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు అతను కూడా సన్నివేశాల్లో బలాన్ని బట్టే ఆర్ఆర్ ఇచ్చినట్లున్నాడు. మది ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్లలో ఒకటి. సినిమా చాలా కలర్ ఫుల్ గా కనిపించడానికి ఆయన విజువల్సే కారణం. మైత్రీ-14 రీల్స్ ప్లస్ లాంటి రెండు పెద్ద సంస్థలు కలిసి నిర్మించిన సినిమా కాబట్టి నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ కనిపించలేదు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ పరశురామ్.. తనకు దక్కిన పెద్ద అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. మహేష్ ను మళ్లీ సరదా పాత్రలో ప్రెజెంట్ చేయడం.. ప్రథమార్ధంలో ఫన్ జనరేట్ చేయడం వరకు అతను మెప్పించాడు. అతను ఎంచుకున్న ప్లాట్ పాయింట్ బాగున్నా.. దాని చుట్టూ కథాకథనాలను సరిగా అల్లలేకపోయాడు. లాజిక్ గురించే పట్టించుకోకుండా.. ఎమోషనల్ కనెక్షన్ లేకుండా సాధారణంగా సినిమాను లాగించేశాడు.

చివరగా: సర్కారు వారి పాట.. పవర్ తగ్గిన ఆట

రేటింగ్- 2.25/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater

× RELATED హిట్-2
×