అశోక వనంలో అర్జున కళ్యాణం

చిత్రం : ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’

నటీనటులు: విశ్వక్సేన్-రుక్సర్ ధిల్లాన్-రితిక నాయక్-కేదార్ శంకర్-గోపరాజు రమణ-కోటేశ్వరరావు-వెన్నెల కిషోర్-కాదంబరి కిరణ్ తదితరులు
సంగీతం: జయ్ క్రిష్
ఛాయాగ్రహణం: పవి కె.పవన్
నిర్మాతలు: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్-సుధీర్ ఈదర
కథ-స్క్రీన్ ప్లే-మాటలు: రవికిరణ్ కోలా
దర్శకత్వం: విద్యాసాగర్ చింతా

యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్సేన్ నటించిన కొత్త సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్ గత చిత్రాలకు భిన్నంగా.. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అల్లం అర్జున్ కుమార్ (విశ్వక్సేన్) తెలంగాణలోని సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ బతికే మామూలు కుర్రాడు. ఐతే అతడికి 30 ఏళ్లకు పైగా వయసు వచ్చినా పెళ్లి అవదు. అనేక ప్రయత్నాల తర్వాత గోదావరి ప్రాంతానికి చెందిన మాధవి (రుక్సర్ ధిల్లాన్)తో అతడికి పెళ్లి కుదురుతుంది. ఒక బస్సు వేసుకుని బంధుగణంతో నిశ్చితార్థం కోసం అమ్మాయి ఇంటికి వెళ్తుంది అర్జున్ కుటుంబం. అక్కడ నిశ్చితార్థ వేడుక అయ్యాక బస్సు పాడవడం.. ఆపై కరోనా కారణంగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అర్జున్ పరివారమంతా అమ్మాయి వాళ్లింట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్ పెళ్లికి రకరకాల సమస్యలు మొదలవుతాయి. వాటిని దాటి అర్జున్ పెళ్లి వైపు అడుగులు వేస్తున్న సమయంలోనే అతడికి పెద్ద షాక్ తగులుతుంది. ఆ షాక్ ఏంటి.. అతడి పెళ్లి కథ ఎన్ని మలుపులు తిరిగింది.. చివరికి అతనో ఇంటివాడయ్యాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

అశోకవనంలో అర్జున కళ్యాణం.. ఈ అచ్చ తెలుగు టైటిల్ చూస్తే చాలా ఆహ్లాదంగా కనిపించింది. దీని ప్రోమోలు సైతం ఆహ్లాదకరంగానే అనిపించాయి. సినిమా కూడా అంతే ఆహ్లాదంగా అనిపిస్తుంది. తెలంగాణ అబ్బాయి.. ఆంధ్రా అమ్మాయి.. వీరి పెళ్లి హడావుడి నేపథ్యంలో నడిచే ఈ కథ కొత్తగా అనిపించకపోయినా.. కథనంలో ఉన్న మ్యాజిక్ ఈ సినిమాకు ప్రత్యేకత చేకూర్చింది. ‘మల్లీశ్వరి’లో పెళ్లి కాని ప్రసాదు టైపు పాత్రలో విశ్వక్సేన్ ను ఇంతకుముందెన్నడూ చూడని భయస్థుడు.. మొహమాటస్థుడైన పాత్రలో చూడటం ఈ సినిమాలో అతి పెద్ద విశేషం. ఆ పాత్రను అతను ఓన్ చేసుకుని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా నటించి మెప్పించాడు. తన పాత్రకు మొదట్లోనే కనెక్ట్ అయిపోయి.. దాంతో ట్రావెల్ చేసేలా రచయిత-దర్శకుడు తమ పనితనాన్ని చూపించడంతో బండి సాఫీగా సాగిపోయింది. హీరో అనే కాకుండా తమ ప్రత్యేకతను చాటుకుంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మరిన్ని మంచి పాత్రలుండటం.. సన్నివేశాలు చాలా వరకు సరదాగా సాగిపోవడం.. బోలెడంత మంది ఆర్టిస్టులతో తెరంతా కళకళలాడిపోవడం.. గోదావరి ప్రాంత నేపథ్యం.. ఇవన్నీ ఆకర్షణలుగా మారి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ను సందడిగా మార్చాయి. కాకపోతే సన్నివేశాలు వేటికవి ఆకట్టుకున్నా నరేషన్ ఒక దశ దాటాక మరీ నెమ్మదించడం సినిమాలో ఉన్న పెద్ద మైనస్. ఈ విషయంలో కాస్త ఓపిక చేసుకోలిగితే సినిమా బాగానే ఎంగేజ్ చేస్తుంది.

ముందే అన్నట్లు సినిమాకు మేజర్ హైలైట్ హీరో పాత్రే. అగ్రెసివ్ క్యారెక్టర్లకు మారు పేరైన అతను ఇంత నెమ్మదస్థుడిలా.. భయస్థుడిలా.. మొహమాటస్థుడిలా కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభవమే. తొలి సినిమా ‘వెళ్ళిపోమాకే’లో అతను నెమ్మదస్థుడిలాగే కనిపించినా.. అది ప్రేక్షకుల దృష్టిలో పడలేదు. ‘ఈ నగరానికి ఏమైంది’ నుంచి అతడిని అగ్రెసివ్ క్యారెక్టర్లలోనే చూస్తున్నాం. వాటన్నింటికీ భిన్నంగా అతను కనిపించేసరికి మొదట్లో ఇంకెవరి పాత్రనో అతను చేస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ కాస్త అలవాటు పడ్డాక ఈ పాత్రతో.. విశ్వక్ తో ప్రేమలో పడిపోతాం. అంత బాగా ఆ పాత్రను తీర్చిదిద్దారు. చిన్న టౌన్లో వడ్డీ వ్యాపారం చేసుకునే మామూలు కుర్రాడికి 30 ఏళ్లు పైబడ్డా పెళ్లి కుదరక సతమతం అయ్యే పాత్రలో విశ్వక్ జీవించేశాడు. పెళ్లి కోసం అతను తపించే తీరు.. ఏ చిన్న డిస్టబెన్స్ వచ్చినా ఎక్కడ పెళ్లి ఆగిపోతుందో అని అతను కంగారు పడే వైనం.. అమ్మాయి నుంచి తనకు పెద్ద షాక్ తగిలాక తన ప్రపంచం తల్లకిందులై మనో వేదన అనుభవించే క్రమం.. ఇవన్నీ కూడా పాత్ర గ్రాఫ్ ను పెంచాయి. ఆయా సన్నివేశాల్లో విశ్వక్ నటన కూడా చక్కగా సాగి ఆ పాత్ర మీద ప్రేక్షకులకు ఒక ఆపేక్ష ఏర్పడేలా చేస్తుంది.

ఐతే ఇంటర్వెల్ ట్విస్టు ముందు వరకు కూడా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చాలా సరదాగా సాగిపోతుంది. తెలంగాణ అబ్బాయి నిశ్చితార్థం కోసం తన పరివారాన్ని తీసుకొచ్చి గోదావరి ప్రాంతానికి చెందిన అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టడం.. ఈ రెండు కుటుంబాల మధ్య సంస్కృతీ సంప్రదాయాల వైరుధ్యం.. ఈ క్రమంలో వచ్చే పొరపొచ్చాలు.. లాక్ డౌన్ కారణంగా అమ్మాయి ఇంట్లో అబ్బాయి బృందమంతా తిష్టవేయడంతో తలెత్తే ఇబ్బందులు.. అమ్మాయితో అబ్బాయి చిన్ని చిన్ని సరసాలు.. ఈ నేపథ్యంలో సరదాగా సాగిపోతాయి సన్నివేశాలు. పాటలు.. నేపథ్య సంగీతం కూడా బాగా కుదరడంతో ప్రథమార్ధం మంచి ఫీల్ ఇస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథనంలో వేగం పడిపోయింది. కథను మలుపు తిప్పాక ముందుకు కదలక మొరాయించింది.

సన్నివేశాలు వస్తుంటాయి. పోతుంటాయి. అవి బాగానే అనిపిస్తాయి కానీ.. కథ ఎటు పోతోందో తెలియని అయోమయం.. గందరగోళం సినిమా గ్రాఫ్ ను తగ్గిస్తాయి. ఇక చివరికి వచ్చేసరికి కథనం డెడ్ స్లో అయిపోయి ముగింపు కోసం ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ద్వితీయార్ధంలో కూడా కొన్నిమంచి సన్నివేశాలున్నా.. రెండో హీరోయిన్ తో హీరో కొత్త ప్రేమకథలో మంచి ఫీల్ కనిపించినా.. అక్కడక్కడా కామెడీ కూడా పండినా.. స్లో నరేషన్ సమస్యగా మారింది. కాస్త వేగం చూపించి చకచకా సినిమాను లాగించి ఉంటే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ రేంజ్ వేరుగా ఉండేది. అయినప్పటికీ ఓవరాల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది. ఒకసారి చూడ్డానికి ఢోకా లేని మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరే ఇది.

నటీనటులు:

విశ్వక్సేన్ చాలా కొత్తగా కనిపిస్తాడీ సినిమాలో. ఇప్పటిదాకా కెరీర్లో చాలా వరకు అగ్రెసివ్ క్యారెక్టర్లు చేసిన అతను.. పూర్తిగా రూటు మార్చి భయస్థుడు మొహమాటస్థుడు అయిన సగటు కుర్రాడిలా కనిపించాడు. అతడికిది ఒక ఇమేజ్ మేకోవర్ అని చెప్పొచ్చు. ఇలాంటి పాత్రలో విశ్వక్ ను చూడటం కొత్తగా అనిపించి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. తర్వాత ఈ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా విశ్వక్ దాన్ని పండించాడు. విశ్వక్ బాగా నటించిన.. భావోద్వేగాలు పండించిన పాత్రగా దీన్ని జనాలు గుర్తుంచుకుంటారు. పెళ్లి విషయంలో విపరీతమైన సంఘర్షణకు లోనయ్యే పాత్రలో అతను జీవించేశాడు కొన్ని సీన్లలో. రుక్సర్ ధిల్లాన్ పాత్రకు తగ్గట్లుగా నటించింది. ఐతే ముందు ఆమెదే ప్రధాన పాత్రలా కనిపించినా.. తర్వాత ఆమెను పక్కకు నెట్టేసి రితిక నాయక్ హైలైట్ అయింది. ముందు మామూలుగానే అనిపించే తన పాత్ర నెమ్మదిగా ప్రేక్షకులకు నచ్చేస్తుంది. తన లుక్స్.. నటన కూడా బాగున్నాయి. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత గోపరాజు రమణ మళ్లీ ఈ చిత్రంలో బాగా హైలైట్ అయ్యాడు. హీరో తండ్రిగా కేదార్ శంకర్.. హీరోయిన్ తండ్రిగా కోటేశ్వరరావు బాగా చేశారు. ఫొటోగ్రాఫర్ పాత్రలో నటించిన కుర్రాడు నవ్వించాడు. వెన్నెల కిషోర్ క్యామియో తరహా పాత్రలో మెరిశాడు.

సాంకేతిక వర్గం:

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’కు సాంకేతిక హంగులు బాగా కుదిరాయి. జయ్ క్రిష్ సంగీతంలో మంచి ఫీల్ ఉంది. పాటలు బాగున్నాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తగ్గట్లు మంచి ఫీల్ తోనే సాగింది. పవి.కె పవన్ ఛాయాగ్రహణం గోదారి వాతావరణాన్ని చక్కగా చూపించింది. విజువల్స్ ఆద్యంతం ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు చక్కగా కుదిరాయి. రైటర్ కమ్ షో రన్నర్ గా క్రెడిట్ తీసుకున్న ‘రాజావారు రాణి వారు’ ఫేమ్ రవికిరణ్ కోలా.. మరోసారి రచనతో మెప్పించాడు. కథాకథనాలు సింపుల్ గా అనిపిస్తూనే ఆకట్టుకుంటాయి. డైలాగులు బాగా పేలాయి. దర్శకుడు విద్యాసాగర్ చింతా సినిమాను నీట్ గా ప్రెజెంట్ చేశాడు. ఎక్కడా తడబాటు కనిపించలేదు. కాకపోతే నరేషన్లో కొంచెం వేగం ఉండాల్సింది.

చివరగా: అశోకవనంలో అర్జున కళ్యాణం.. మంచి ఫీల్-కొంచెం డల్

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED హిట్-2
×