భళా తందనాన

మూవీ రివ్యూ : భళా తందనాన

నటీనటులు: శ్రీ విష్ణు-కేథరిన్ ట్రెసా-గరుడ రామ్-పోసాని కృష్ణమురళి-సత్య-అయ్యప్ప.పి.శర్మ-ఆదర్శ్ బాలకృష్ణ-చైతన్యకృష్ణ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
కథ-మాటలు: శ్రీకాంత్ విస్సా
నిర్మాత: రజిని కొర్రపాటి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చైతన్య దంతులూరి

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు యువ నటుడు శ్రీ విష్ణు. ఐతే ఈ మధ్య అతను ఎంచుకుంటున్న కథల్లో తన అభిరుచి కనిపించడం లేదు. సినిమాలు తేడా కొడుతున్నాయి. అతను ‘బాణం’తో మంచి పేరు సంపాదించి, ఆ తర్వాత అంచనాలు అందుకోలేకపోయిన చైతన్య దంతులూరితో జట్టు కట్టాడు. వీరి కలయికలో తెరకెక్కిన చిత్రమే ‘భళా తందనాన’. సాయి కొర్రపాటి లాంటి టేస్టున్న ప్రొడ్యూసర్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులతో ‘భళా’ అనిపించిందో లేదో చూద్దాం పదండి.

కథ:

చందు (శ్రీ విష్ణు) ఒక అనాథాశ్రమంలో అకౌంటెంట్. అతను పని చేసే చోట రైడ్ జరుగుతోందని తెలిసి ఆ న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ అయిన శశిరేఖ (కేథరిన్ ట్రెసా)తో అతడికి పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మరోవైపు రాజకీయ నాయకులు.. వ్యాపారుల అండతో హవాలా బిజినెస్ చేస్తున్న ఆనంద్ బాలి (గరుడ రామ్)కి చెందిన 2 వేల కోట్ల రూపాయలు ఎవరో కొట్టేశారని తెలిసి దాని గురించి శశిరేఖ వార్త రాస్తుంది. అదే సమయంలో కొందరు రౌడీలు వచ్చి శశిరేఖతో ఉన్న చందును తీసుకెళ్లిపోతారు. అప్పుడే ఆ రెండు వేల కోట్ల డబ్బు దోపిడీతో చందుకు సంబంధం ఉందని బయటపడుతుంది. అప్పటిదాకా అమాయకుడిలా కనిపించిన చందులో ఈ కొత్త కోణం ఏంటి.. నిజంగా అతనంత డబ్బును దొంగిలించాడా.. అందుకు కారణమేంటి.. ఈ డబ్బులన్నీ ఏం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

కథలో ఒక దశ వరకు హీరోను ఒక మామూలు వ్యక్తిలానో లేదా అమాయకుడిలానో చూపించి.. కథను ఒక కోణంలో నడిపించి.. మధ్యలో ఒక ట్విస్ట్ ఇచ్చి అక్కడి నుంచి హీరో పాత్రను.. కథను కొత్త మలుపు తిప్పి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే కథలు తెలుగులో కొత్తేమీ కాదు. మొదటి కోణంలో హీరో పాత్రను.. కథను చూస్తున్నపుడు చాలా సాధారణంగా అనిపించి లైట్ తీసుకునే ప్రేక్షకులు.. ట్విస్ట్ తర్వాత ఒక్కసారిగా అలెర్ట్ అవుతారు. అక్కడి నుంచి కథలో లీనం అవుతారు. ఐతే ‘పోకిరి’ టైంలో మొదటిసారి ఇలాంటి కథను చూసినపుడు ప్రేక్షకులు షాకైపోయి ఆ థ్రిల్ ను భలేగా ఎంజాయ్ చేశారు కానీ.. ఆ తర్వాత ఇలాంటి కథలు లెక్కలేనన్ని వచ్చి ఇలాంటి ట్విస్టులు చూసి మామూలేగా అనుకునే పరిస్థితులు వచ్చేశాయి. అయినా మళ్లీ అలాంటి ఫార్ములాను అనుసరిస్తున్నపుడు.. కథ నేపథ్యం కొత్తగా ఉండేలా చూసుకోవాలి. స్క్రీన్ ప్లేలో ఇంకేమైనా వైవిధ్యం చూపించాలి. సన్నివేశాల్లో బిగి కనిపించాలి. అన్నింటికీ మించి ఎమోషన్ అన్నది ముఖ్యమైన విషయం. ఐతే ‘భళా తందనాన’ ఈ విషయాలన్నింట్లో సోసోగానే అనిపిస్తుంది తప్ప ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి.. వారిలో ఉత్కంఠ రేకెత్తించే స్థాయిలో లేకపోయింది. ఏదో అలా టైంపాస్ చేయడానికి ఓకే కానీ.. శ్రీ విష్ణు-చైతన్య-సాయి కొర్రపాటి లాంటి మంచి అభిరుచి ఉన్న ముగ్గురి కలయికలో ప్రేక్షకులు ఆశించే సినిమా అయితే కాదిది.

ఈ మధ్యే ‘ఖిలాడి’ అనే సినిమాలో 10 వేల కోట్ల వ్యవహారాన్ని పది వేల రూపాయల స్థాయిలో ఎంత సిల్లీగా డీల్ చేశారో చూశాం. కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతున్నపుడు ఆ ‘డబ్బు’కు ఒక విలువ చేకూర్చడం.. ప్రేక్షకులు దాన్ని సీరియస్ గా తీసుకునేలా చేయడం ముఖ్యమైన విషయం. అంత పెద్ద మొత్తాన్ని దోచేస్తున్నపుడు దాన్నో ఆషామాషీ వ్యవహారంలా చూపిస్తే ప్రేక్షకులు ఏ దశలోనూ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండదు. మణిరత్నం తీసిన ‘దొంగా దొంగా’ సినిమాలో వెయ్యి కోట్ల వ్యవహారం ఎంత ఉత్కంఠభరితంగా ఉందో ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ విషయం బోధ పడుతుంది. ఐతే ‘ఖిలాడి’ రైటర్ శ్రీకాంత్ విస్సానే రాసిన ‘భళా తందనాన’లోనూ కథంతా రూ.2 వేల కోట్ల రూపాయల డబ్బు చుట్టూనే తిరుగుతుంది. కానీ ‘ఖిలాడి’ స్థాయిలో మరీ ఎటకారంగా లేకపోయినా.. ‘భళా తందనాన’లో కూడా ఈ డబ్బు దోపిడీ వ్యవహారమంతా ఒక తమషాలా.. చిన్న పిల్లల ఆటలా అనిపిస్తుందే తప్ప ఎక్కడా సీరియస్ గా తీసుకునేలా లేకపోవడమే ఈ సినిమాకు మైనస్. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును హీరో అప్పటికప్పుడు ఓ గ్యాంగ్ సెట్ చేసుకుని.. ఠకీఠకీమని ప్లానేసేయడం.. ఇలా అందరినీ ఏమార్చేయడం.. అలా డబ్బులు కొట్టేయడం.. ఆ తర్వాత చాలా మామూలుగా తిరిగేయడం.. ఆపై విలన్ డెన్ కే వచ్చి నీ డబ్బులు కొట్టేశా అంటూ ఎకసెక్కాలాడటం చూస్తే ఎక్కడా ఇంటెన్సిటీ అన్నదే కనిపించదు. పోనీ ఇదేమైనా ‘బ్లేడు బాబ్జీ’ టైపు కామెడీ సినిమానా అంటే అదీ కాదు. సీరియస్ యాక్షన్ మూవీనే.

ఐతే లాజిక్కులు.. ఇంటెన్సిటీ సంగతి పక్కన పెట్టేసి.. ఇందులోని ట్విస్టులకు కనెక్ట్ అయి టైంపాస్ చేయదలుచుకుంటే ‘భళా తందనాన’ ఓ మోస్తరుగా ఎంగేజ్ చేస్తుంది. అయినప్పటికీ తొలి గంట మాత్రం కొంచెం ఓపిక చేసుకోవాలి. అమాయకుడు.. అతి సామాన్యుడు అయిన అబ్బాయిగా శ్రీ విష్ణు పాత్ర ఏమంత ఆసక్తి రేకెత్తించదు. జర్నలిస్టుగా కేథరిన్ ట్రెసా క్యారెక్టర్లోనూ కొత్తదనం ఏమీ కనిపించదు. ఇక వీరి పరిచయం.. ప్రేమాయణానికి సంబంధించిన సన్నివేశాలు కూడా సాధారణంగానే అనిపిస్తాయి. విలన్ కు సంబంధించిన ఎపిసోడ్లోనూ ఏ విశేషం లేదు. ఇలా వేటికవే సాధారణంగా అనిపిస్తూ ఆసక్తి అంతకంతకూ తగ్గిపోతున్న దశలో ఇంటర్వెల్ ట్విస్టు ప్రేక్షకులు అలెర్టయ్యేలా చేస్తుంది. హీరో పాత్రలోని రెండో కోణం వారి దృష్టిని ఆకర్షిస్తుంది. కథ ప్రారంభంలో చూపించిన కిడ్నాప్ వ్యవహారానికి.. అసలు కథకు ముడిపెట్టి కాస్త ఆసక్తికరంగానే స్క్రీన్ ప్లేను నడిపిస్తూ ద్వితీయార్ధాన్ని కొంచెం వేగంగానే నడిపించాడు. కాకపోతే ఎక్కడా కూడా ఇంటెన్సిటీ మాత్రం కనిపించదు. సన్నివేశాల్లో బిగి లేదు. అదే సమయంలో టైంపాస్ కు ఢోకా లేకుండా ద్వితీయార్ధాన్ని నడిపించేశాడు దర్శకుడు. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ ఓకే అనిపిస్తాయి. అసలు హీరో ఎందుకిదంతా చేస్తున్నాడనే విషయాన్ని చివరి వరకు సస్పెన్సుగా దాచి పెట్టి.. ముగింపులో కూడా ఆ విషయాన్ని వెల్లడించకుండా ప్రేక్షకులను గెస్సింగ్ లోనే ఉంచేశాడు దర్శకుడు. ఇది హిందీ మూవీ ‘వెడ్నస్ డే’ (తెలుగులో ‘ఈనాడు’)ను గుర్తుకు తెస్తుంది. ఇదొక భిన్నమైన ముగింపేమో అనుకుంటే.. అసలు విషయం తరువాయి భాగంలో చూడండి అంటూ ‘భళా తందనాన-2’ దిశగా హింట్ ఇచ్చారు. కానీ ‘భళా తందనాన’ చూశాక రెండో భాగం చూడాలన్న ఆసక్తి కలుగుతుందా అన్నదే డౌట్.

నటీనటులు:

పక్కింటి అబ్బాయి.. మామూలు కుర్రాడి పాత్రలు చేసి శ్రీ విష్ణుకు బోర్ కొట్టేసిందేమో.. ఈ మధ్య లార్జర్ దన్ లైఫ్.. మాస్ పాత్రలు ట్రై చేస్తున్నాడు. ‘భళా తందనాన’ కోసం అతను పూర్తి స్థాయిలో మాస్ చొక్కా తొడుక్కున్నాడు. మామూలుగా మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు చేయాల్సిన పాత్రలా అనిపిస్తుందిది. శ్రీవిష్ణుకు అంతగా నప్పనట్లు అనిపించినా.. అతను బాగానే చేశాడు. అమాయకుడిగా విష్ణు నటన బాగున్నా.. ఆ పాత్ర చికాకు పెట్టేదే. ఆ పాత్రలో ఇంకో కోణం బయటికి వచ్చాక ఆ తేడాను విష్ణు బాగా చూపించాడు. ఇక్కడి నుంచి ఆ క్యారెక్టర్ ఆసక్తికరంగానే అనిపించినా.. విష్ణుకు మాస్ ఇమేజ్ ఉంటే దాని ఎలివేషన్ ఇంకోలా ఉండేదనిపిస్తుంది. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై మళ్లీ మెరిసిన కేథరిన్ ఓకే అనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఆమె బొద్దుగా తయారైంది. అయినా క్యూట్ గానే అనిపిస్తుంది. నటన పర్వాలేదు. విలన్ పాత్రలో గరుడ రామ్ ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు. పోసాని కృష్ణమురళి శైలికి తగ్గ పాత్రే పడింది. ఆయన కొన్ని చోట్ల నవ్వించాడు. సత్య కూడా కొంత రిలీఫ్ ఇచ్చాడు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

ఇటీవలే ‘ఆచార్య’లో అంచనాలను అందుకోలేకపోయిన మణిశర్మ.. ఈ చిత్రంలో మరింత నిరాశ పరిచాడు. అసలు సంగీత దర్శకుడు ఎవరో తెలియకుండా ఈ సినిమాకు వెళ్లి తర్వాత మణిశర్మే దీనికి పని చేశాడని తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. పాటల్లో ఎక్కడా ఆయన ముద్ర లేదు. ఒక్క సాంగ్ కూడా గుర్తుంచుకునేలా లేదు. నేపథ్య సంగీతం కూడా మామూలుగానే అనిపిస్తుంది. సురేష్ రగుతు ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. శ్రీకాంత్ విస్సా కథలో ఏమంత కొత్తదనం కనిపించదు. అతడి డైలాగులు కొన్ని మెరుపులున్నాయి. దర్శకుడు చైతన్య దంతులూరి స్క్రీన్ ప్లేతో కొంత వైవిధ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసినా.. సినిమాలో ఎక్కడా బిగి కనిపించలేదు. ప్రేక్షకులను సీరియస్ గా ఇన్వాల్వ్ చేసేలా సన్నివేశాలు నడవకపోవడం ప్రతికూలతగా మారింది. దర్శకుడిగా చైతన్యకు యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: భళా తందనాన.. భళా అనిపించలేదు!

రేటింగ్ - 2.5 /5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED హిట్-2
×