గని

మూవీ రివ్యూ : గని

నటీనటులు: వరుణ్ తేజ్-సయీ మంజ్రేకర్-ఉపేంద్ర-నదియా-సునీల్ శెట్టి-నరేష్-జగపతిబాబు-సుదర్శన్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాతలు: అల్లు బాబీ-సిద్ధు ముద్ద
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి

యువ కథానాయకుడు వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రం.. గని. కరోనాతో పాటు ఇతర కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గని (వరుణ్ తేజ్) బాక్సర్ అయిన తన తండ్రి విక్రమాదిత్య డోపింగ్ కు పాల్పడి తమ కుటుంబం పరువు తీశాడన్న కారణంతో ఆయన మీద ద్వేషం పెంచుకున్న కుర్రాడు. జీవితంలో ఎప్పుడూ బాక్సింగ్ జోలికి వెళ్లనని చిన్నతనంలోనే తల్లికి మాట ఇచ్చినప్పటికీ.. పోయిన తమ కుటుంబ గౌరవాన్ని తిరిగి తేవడానికి బాక్సింగ్ నే మార్గంగా ఎంచుకుని తల్లికి తెలియకుండా ఆ ఆటలో నేషనల్ ఛాంపియన్ అవ్వాలని కష్టపడుతుంటాడు. ఐతే తన లక్ష్యానికి దగ్గరగా వచ్చిన సమయంలో కీలక బౌట్లో ప్రత్యర్థి తన తండ్రి ప్రస్తావన తెచ్చేసరికి అతను అదుపు తప్పి ప్రవర్తిస్తాడు. అనర్హతకు గురవుతాడు. విక్రమాదిత్య మీద ఇంకా ద్వేషం పెంచుకున్న అతడికి.. తన తండ్రి గురించి అసలు విషయం తెలుస్తుంది. ఆ విషయమేంటి.. ఆ తర్వాత అతను లక్ష్యం దిశగా ఎలా కదిలాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

స్పోర్ట్స్ డ్రామాలకు అత్యంత ముఖ్యమైన విషయం.. ఎమోషన్. బాలీవుడ్లో వచ్చిన చక్ దే ఇండియా.. దంగల్.. బాగ్ మిల్కా బాగ్.. లాంటి సినిమాల్లో అయినా.. తెలుగులో చూసిన తమ్ముడు.. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి చిత్రాల్లో అయినా.. ఒక బలమైన ఎమోషన్ ఉంటుంది. అది ప్రేక్షకులను కదిలించి ప్రధాన పాత్రధారులు లక్ష్యం కోసం సన్నద్ధమవుతుంటే.. పోరాడుతుంటే.. తామే అలా సన్నద్ధమవుతున్నట్లు.. ఆ పోరాటం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ ఎమోషన్ ప్రేక్షకుల్లో తీసుకు రాగలిగితే స్పోర్ట్స్ డ్రామా క్లిక్ అయినట్లే. ఐతే యువ కథానాయకుడు వరుణ్ తేజ్.. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తమ తమ స్థాయిలో ఎంతగా కష్టపడ్డప్పటికీ.. వారికి నిర్మాతలు ఏమాత్రం రాజీ పడకుండా పూర్తి సహకారం అందించినప్పటికీ.. అందరూ కలిసి ప్రేక్షకుల్లో పైన చెప్పుకున్న ‘ఎమోషన్’ మాత్రం తీసుకురాలేకపోయారు. హీరోకు ఒక లక్ష్యం ఏర్పడటానికి దారి తీసిన ‘కారణం’ చాలా సాధారణంగా ఉండడం వల్ల.. ఫ్లాష్ బ్యాక్ మరీ రొటీన్ అయిపోవడం వల్ల ‘గని’ భావోద్వేగాలు అనుకున్న స్థాయిలో పండలేదు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలను మినహాయిస్తే ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవు.

తెలుగులో ఇప్పటికే బాక్సింగ్ చుట్టూ నడిచే కథలు చూశాం. తమ్ముడు.. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి చిత్రాలు ఈ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ప్రేక్షకులకు కావాల్సినంత కిక్కు ఇచ్చాయి. ఐతే వాటికి ఆటను మించి వేరే అంశాలు హైలైట్ అయ్యాయి. ఆట మిగతా అంశాల లాగే ఒక పార్ట్ లాగా ఉంటుంది. కానీ ‘గని’ అలా కాదు. ఇది పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామా. అలాంటపుడు వాటిని మించి ఆట తాలూకు ఎమోషన్ ఉంటుందని ఆశిస్తాం. అదే సమయంలో వాటికి భిన్నంగా ఆటకు సంబంధించి కొత్త అంశాలు చూపిస్తారని ఆశిస్తాం. అందులోనూ ఒక కొత్త దర్శకుడు ఈ నేపథ్యంలో తన తొలి సినిమాను తీయాలనుకున్నపుడు కచ్చితంగా కొత్తదనం చూపిస్తాడని.. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడని అనుకుంటాం. కానీ కిరణ్ కొర్రపాటి అలాంటి ప్రయత్నం పెద్దగా చేసినట్లు కనిపించదు. ద్వితీయార్ధంలో బెట్టింగ్ మాఫియా యాంగిల్ జోడించడం మినహాయిస్తే ‘గని’లో కొత్తగా అనిపించే పాయింట్ ఏదీ లేదు. ఉపేంద్ర లాంటి నటుడిని ఏరి కోరి హీరో తండ్రి పాత్రకు ఎంచుకుని అతడి చుట్టూ నడిపిన ఫ్లాష్ బ్యాక్ చూస్తే.. ఈ మాత్రానికి ఉపేంద్ర అవసరమా.. ఇంకా ఎన్నాళ్లు ఇవే టెంప్లేట్లు ఫాలో అవుతారు అనిపిస్తుంది.

స్పోర్ట్స్ డ్రామాల్లో ప్రేక్షకులను ఒక ‘మూడ్’లోకి తీసుకురావడం కీలకమైన విషయం. కానీ పతాక సన్నివేశాల్లో మినహాయిస్తే.. ఆ మూడ్ ఎక్కడా రాదు. బాక్సింగ్ వల్ల తన భర్త జీవితం అవమానకరంగా.. అర్ధంతరంగా ముగిసిందని హీరో తల్లి.. జీవితంలో బాక్సింగ్ జోలికి వెళ్లొద్దంటూ కొడుకు దగ్గర మాట తీసుకుంటే.. హీరో ఆ మాటను పక్కన పెట్టి తల్లికి తెలియకుండా బాక్సింగ్ ఆడటం అనే కాన్ఫ్లిక్ట్ వినడానికి బాగున్నా.. తెర మీద దీన్ని చూపించిన విధానం సరిగా లేదు. తల్లికి తెలియకుండా ఎలా బాక్సింగ్ నేర్చుకుంటాడు.. ఆమెకు తెలియకుండా ఎలా పోటీ పడతాడు.. ఎలా ముందంజ వేస్తాడు అనే విషయంలో కొంచెం ఉత్కంఠభరితంగా డ్రామా నడిపించడానికి అవకాశం ఉన్నా దర్శకుడు ఆ ప్రయత్నమేదీ చేయలేదు. బాక్సింగ్ చుట్టూ సన్నివేశాలన్నీ పైపైన నడిపించేయడం.. ఎక్కడా ఎమోషన్ లేకపోవడంతో హీరో పాత్రను ప్రేక్షకులు ఓన్ చేసుకునే పరిస్థితి ఉండదు. బరువైన గతాన్ని మోస్తూ.. ఒక లక్ష్యం పెట్టుకుని దాని కోసం కష్టపడుతున్న హీరోలో ఆ ఇంటెన్సిటీనే కనిపించదు ఎక్కడా. బాక్సింగ్ చుట్టూ సన్నివేశాలు అంతంతమాత్రం అంటే.. ఒక అవసరం లేని ప్రేమకథను జోడించారు. అది నిస్సారంగా సాగి ప్రేక్షకుల్లో విసుగు పుట్టిస్తుంది. హీరో-తల్లి మధ్య వచ్చే సన్నివేశాల్లోనూ ఏ విశేషం కనిపించదు.

ఇంటర్వెల్ వరకు ‘గని’లో చెప్పుకోదగ్గ ఒక్క సన్నివేశం కూడా లేదు. హీరో తండ్రి గతం గురించి చెప్పడం మొదలయ్యాక కాస్త ఆసక్తి మొదలవుతుంది. ఆ పాత్ర చేసింది ఉపేంద్ర కావడంతో ఫ్లాష్ బ్యాక్ మీద చాలా అంచనాలు పెట్టుకుంది. కానీ దాన్ని చాలా పాత స్టయిల్లో తీర్చిదిద్ది మరింత నిరుత్సాహపరిచాడు దర్శకుడు. వర్తమానంలోకి వచ్చాక కూడా కథ పెద్దగా ముందుకు కదలదు. తండ్రి మీద అపార్థాలు తొలగిపోయి హీరో కొత్త లక్ష్యంతో రంగంలోకి దిగడం.. ఇక అందుకోసం శ్రమించడం.. చివరగా తన లక్ష్యాన్ని చేరుకోవడం.. ఇలా ప్రేక్షకుల అంచనాల తగ్గట్లే కథాకథనాలు నడుస్తాయి. కాకపోతే బాక్సింగ్ లీగ్ జరుగుతుండగా.. దానికి బెట్టింగ్ మాఫియాకు లింక్ పెట్టి నడిపించిన సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. అలాగే వరుణ్ కష్టాన్ని తెరపై చూపించే టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు కూడా బాగానే తీర్చిదిద్దారు. కానీ ఆఖర్లో ఎంత కష్టపడ్డా అప్పటిదాకా జరిగిన నష్టాన్ని పూడ్చడం కష్టమే అయింది. మొత్తంగా చూస్తే ఇటు కమర్షియల్ హంగులూ లేక.. అటు సిన్సియర్ స్పోర్ట్స్ డ్రామా చూసిన అనుభూతీ కలగక నిరాశ చెందేలా ‘గని’ తయారైంది.

నటీనటులు:

వరుణ్ తేజ్ బాక్సర్ గా మారడానికి పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఈ విషయంలో అతణ్ని ఎంత అభినందించినా తక్కువే. వరుణ్ ఆహార్యానికి ఇలాంటి అవతారంలోకి మారడం అంత తేలిక కాదు. ఫిజిక్ పరంగా వరుణ్ గని పాత్రకు పర్ఫెక్ట్ అనిపించాడు. కానీ వరుణ్ నటన మాత్రం మామూలుగానే అనిపిస్తుంది. పాత్రను తీర్చిదిద్దిన విధానంలోనే లోపాలుండగా.. వరుణ్ కూడా పెద్దగా కవర్ చేయలేకపోయాడు. ఇలాంటి పాత్రల నుంచి ప్రేక్షకులు కోరుకునే ఇంటెన్సిటీని చూపించలేకపోయాడు. హీరోయిన్ సయీ మంజ్రేకర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆమె కనిపించినపుడల్లా ఈ సన్నివేశం త్వరగా అయిపోతే బాగుండనిపిస్తుంది. లుక్స్.. నటన.. రెండు విధాలుగానూ ఆమె నిరాశ పరుస్తుంది. ద్వితీయార్ధంలో ఆ పాత్రను పక్కన పెట్టి మంచి పని చేశారని చెప్పాలి. హీరో ఉపేంద్ర బాగానే చేశాడు కానీ.. ఆ పాత్రలో పాత వాసనలు కొడతాయి. సునీల్ శెట్టి కోచ్ పాత్రలో ఓకే అనిపించాడు. జగపతిబాబు పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నప్పటికీ.. ఆయన్ని చూడగానే మొనాటనీగా అనిపిస్తుంది. ఇలాంటి పాత్రలు లెక్కలేనన్నిచేయడం.. లుక్స్ పరంగా కూడా రొటీన్ అనిపించడం అందుకు కారణం కావచ్చు. హీరో తల్లి పాత్రలో నదియా బాగానే చేసింది.నవీన్ చంద్ర సహాయ పాత్రలో ఓకే అనిపించాడు.

సాంకేతిక వర్గం:

తమన్ ఉన్న ఫాంకి.. అతడి మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లు సంగీతం లేదు. టైటిల్ సాంగ్ ఒక్కటి ఓకే అనిపిస్తుంది. మిగతా పాటలు అంతంతమాత్రమే. నేపథ్య సంగీతం పర్వాలేదు. పతాక సన్నివేశాల్లో మినహా తమన్ కూడా పెద్దగా ఎలివేట్ చేయడానికి స్కోప్ లేకపోయింది. జార్జ్ సి.విలియమ్స్ ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. అవసరానికి మించే ఖర్చు పెట్టారు. అబ్బూరి రవి సంభాషణలు అక్కడక్కడా బాగున్నాయి. కొన్ని లోతైన సంభాషణలు రాసినా.. సన్నివేశ బలం లేకపోవడం వల్ల అవి హైలైట్ కాలేదు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పర్వాలేదనిపించినా.. రచయితగా విఫలమయ్యాడు. స్క్రిప్టే సినిమాకు మైనస్ అయింది. కమర్షియల్ హంగుల గురించి ఆలోచించకుండా కిరణ్ పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామా తీయడానికి ప్రయత్నించడం అభినందనీయమే అయినా.. అందుకు తగ్గ బలమైన కథాకథనాలు తీర్చిదిద్దుకోలేకపోయాడు. ఒక కొత్త దర్శకుడిగా తన నుంచి ప్రేక్షకులు ఇంకా కొత్తదనం ఆశిస్తారని అతను ఆలోచించి ఉండాల్సింది.

చివరగా: గని.. యాక్షన్ తప్ప ఎమోషన్ లేదు

రేటింగ్-2/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED పక్కా కమర్షియల్
×