ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)

చిత్రం : ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)

నటీనటులు: రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్-అజయ్ దేవగణ్-ఆలియా భట్- ఒలీవియా మోరిస్-సముద్రఖని-శ్రియ-రాహుల్ రామకృష్ణ-రే స్టీవెన్సన్-అలిసన్ డూడీ తదితరులు
సంగీతం: కీరవాణి
ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్
కథ: విజయేంద్ర ప్రసాద్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాత: డీవీవీ దానయ్య
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి

భారతీయ సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ‘బాహుబలి’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈ రోజే థియేటర్లలోకి అడుగు పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు టాప్ హీరోల కలయికలో జక్కన్న తీసిన ఈ సినిమాపై అంచనాలు అలా ఇలా లేవు. మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుంది.. జక్కన్న మరోసారి వెండితెరపై మాయాజాలం చేశాడా.. చూద్దాం పదండి.

కథ:

భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి పూర్వం.. 1920 ప్రాంతంలో ఢిల్లీలో ఉన్నత స్థాయిలో ఉన్న బ్రిటిష్ అధికారి స్కాట్.. ఆయన భార్య కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ అడవిని సందర్శించిన సందర్భంలో గోండు బిడ్డ అయిన మల్లి అనే చిన్నారిని తమ వెంట తీసుకెళ్లిపోతారు. ఆ అమ్మాయిని ఎలాగైనా తమ తండాకు తిరిగి తీసుకురావాలని సంకల్పంతో భీమ్ (ఎన్టీఆర్) తన బృందంతో ఢిల్లీకి బయల్దేరతాడు. అక్కడ మారు వేషంలో ఉంటూ మల్లి జాడ కనిపెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. మరోవైపు ఒక ఉన్నత లక్ష్యంతో బ్రిటిష్ దళంలో పోలీసుగా చేరిన రామ్.. భీమ్ ను కనిపెట్టడానికి ప్రత్యేక అధికారిగా నియమితుడవుతాడు. ఐతే మారు వేషంలో తిరుగుతున్న భీమ్ తో అతడికి అనుకోకుండా స్నేహం కుదురుతుంది. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి వాస్తవం తెలియకుండానే.. కొంత కాలంలోనే ప్రాణ మిత్రులుగా మారతారు. ఇంతలో మల్లిని బయటికి తేవడానికి పథకం రచించి దాన్ని అమల్లో పెడతాడు భీమ్. అప్పుడే భీమ్ గురించి నిజం తెలుసుకుని రామ్ అతడికి అడ్డు పడతాడు. దీంతో ఇద్దరి మధ్య వైరం మొదలవుతుంది. మరి వీరి పోరు ఎక్కడిదాకా వెళ్లింది.. మల్లిని భీమ్ కాపాడాడా.. రామ్ పెట్టుకున్న ఉన్నత లక్ష్యం ఏమిటి.. దాన్ని అతను సాధించాడా.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

అల్లూరి సీతారామరాజు.. కొమరం భీమ్.. మన చరిత్రలో చాలా గొప్పగా చెప్పుకునే పాత్రలు. ఇద్దరికీ ఒకరితో ఒకరికి సంబంధం లేదు. వేర్వేరు కాలాల్లో జీవించిన ఈ ఇద్దరూ పరస్పరం కలుసుకున్నది లేదు. కలిసి పోరాటాలూ చేసింది లేదు. మరి ఈ ఇద్దరినీ కలిపి ఒక కథలో ఇమడ్చడం అన్నదే ఒక అసహజమైన ఆలోచన. ‘బాహుబలి’ లాగా కథ.. పాత్రలు పూర్తిగా కల్పితం అయితే.. ప్రేక్షకుల దృష్టికోణం వేరుగా ఉంటుంది. అందులో ఎన్ని అద్భుతాలు చూపించినా చెల్లిపోతుంది. కానీ మనకు పరిచయమున్న వాస్తవ పాత్రలను తీసుకుని ఓ కల్పిత కథను అల్లితే.. తెరపై ఎన్ని అద్భుతాలు చూపించినా.. అవి అసహజంగా అనిపించి భావోద్వేగాలు సరిగా పండకపోవచ్చు. కానీ ఇలాంటి ‘అసహజమైన’ కథతో కూడా ప్రేక్షకులను ఒప్పించి మెప్పించి.. వారిని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి మైమరిచిపోయేలా చేయగలిగిన ఘనత రాజమౌళికే చెల్లు. మనం తెరపై చూస్తున్నదంతా అబద్ధం అన్న భావన కాస్త వెనక్కి లాగడం.. కథలో ఆత్మ లోపించిందనే భావన కలగడం వాస్తవమే అయినా.. రాజమౌళికి మాత్రమే సాధ్యమైన విజువల్ మాయాజాలం.. కళ్లు చెదిరే భారీతనం.. రోమాంచితుల్ని చేసే హీరో ఎలివేషన్లు.. ఔరా అనిపించే యాక్షన్ ఘట్టాలు.. ఒకరితో ఒకరు పోటీ పడుతూ సాగే ఇద్దరు సూపర్ స్టార్ల మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ను మరో స్థాయిలో నిలబెట్టాయి. కథ.. భారీతనం.. భావోద్వేగాల పరంగా ‘బాహుబలి’ స్థాయిలో నిలిచే సినిమా కాదు కానీ.. ప్రేక్షకులను అలరించే విషయంలో మాత్రం ‘ఆర్ఆర్ఆర్’లో లోటు లేదు.

ప్రేక్షకుల్లో రకరకాలుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సినిమా నచ్చుతుంది. ఐతే మెజారిటీ ప్రేక్షకులను మెప్పించే సినిమా తీయడం కొంతమందికే సాధ్యం. ఈ మెజారిటీ ప్రేక్షకుల నాడి బాగా తెలిసిన దర్శకుడిగా ఇప్పుడు అగ్రతాంబూలం ఇవ్వాల్సింది కచ్చితంగా రాజమౌళికే. ఎందుకంటే వినడానికి చాలా అసహజంగా అనిపించే ‘ఆర్ఆర్ఆర్’ మూల కథను షూటింగ్ మొదలైన తొలి దశలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రేక్షకులకు చెప్పేయడం ద్వారా వారిని అప్పట్నుంచే తాము తెరపై చూడబోయే అబద్ధానికి సిద్ధం చేసేశాడు జక్కన్న. ఈ విషయంలో మానసికంగా సిద్ధమై థియేటర్లో అడుగు పెడితే.. ఇక ఎక్కడా రాజమౌళి ఊపిరి తీసుకోనివ్వడు. జక్కన్న చేతిలో ఒక్క మాస్ హీరో ఉంటేనే అతడితో తెరపై చేయించే విధ్వంసం మామూలుగా ఉండదు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ లాంటి ఇద్దరు మైటీ స్టార్లు ఆయనకు దొరకడంతో వారితో తెరపై ఆయన చేయించిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన హీరోల ఇంట్రో సీన్లయినా.. ఔరా అనిపించే వారి తొలి కలయిక ఎపిసోడ్ అయినా.. కొదమసింహల్లా ఇద్దరూ తలపడే ఇంటర్వెల్ బ్లాక్ అయినా.. ఇద్దరూ కలిసి దుమ్ములేపిన నాటు నాటు పాట అయినా.. ఆ తర్వాత భావోద్వేగాల్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన కొమురం భీముడో పాట అయినా.. అన్నింటికీ మించి మరీ ఈ స్థాయి విధ్వంసమా అనిపించే పతాక సన్నివేశాలైనా.. ఇలా ప్రతి దాంట్లోనూ రాజమౌళి మార్కు విజువల్ మాయాజాలం.. భారీతనం కనిపిస్తుంది.

ప్రేక్షకులు ఎన్ని అంచనాలు పెట్టుకుని వచ్చినా వాటిని మించిన దృశ్యానుభూతిని ఇవ్వడంలో రాజమౌళికి రాజమౌళే సాటి. ఆయన ఆలోచనలు ఎంత భారీగా ఉంటాయో చెప్పడానికి సినిమాలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ముఖ్యంగా వందల మంది బ్రిటిష్ సైన్యం అధీనంలో ఉన్న కోటలోకి చొరబడి తమ అడవి బిడ్డను తీసుకెళ్లడానికి భీమ్ వేసే ఎత్తుగడ చూసి మైండ్ బ్లాంక్ అవ్వని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. మెంటల్ మాస్ అనిపించే ఈ ఎపిసోడ్ ఒక్కటి చాలు.. ప్రేక్షకుల టికెట్ల డబ్బులు గిట్టుబాటైపోవడానికి. ఒక చిన్న పాప కోసం ఇంత విధ్వంసమా అనిపించినా.. తెరపై జరిగేదంతా చూస్తూ నోరెళ్లబెట్టకుండా ఉండలేం. నిజంగా రెండు కొదమ సింహాలు తలపడుతున్నట్లుగా తారక్-చరణ్ కలబడ్డ తీరుకు ఫిదా అయిపోవాల్సిందే. ఇద్దరూ ఒకరితో ఒకరు తలపడే ఎపిసోడ్ ఒకెత్తయితే.. చివర్లో ఇద్దరూ కలిసి ప్రత్యర్థుల మీద పడిపోయే ఎపిసోడ్ ఇంకో ఎత్తు. అక్కడ ‘మాస్’ అనే పదానికి జక్కన్న సరికొత్త నిర్వచనమే చెప్పాడు. ఆ ఘట్టంలో ఇద్దరు హీరోలతో అడవినే కాదు.. తెరను సైతం రాజమౌళి తగలబెట్టించేశాడనే చెప్పాలి.

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి సినిమా కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ను అనివార్యంగా ‘బాహుబలి’తో పోల్చి చూడటం సహజం. ఐతే అది పూర్తిగా కల్పిత కథ కావడంతో రాజమౌళి ఊహలకు హద్దులు లేకపోయాయి. విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయాడు జక్కన్న. కానీ ‘ఆర్ఆర్ఆర్’ను ఆ కోణంలో చూడలేం. ఎన్నో పరిమితుల మధ్య కూడా ఈ కథకు భారీతనాన్ని జోడించే ప్రయత్నం చేశాడు. ఆ భారీతనమంతా ప్రధానంగా యాక్షన్ ఘట్టాల్లోనే కనిపిస్తుంది. ప్రతి యాక్షన్ బ్లాక్ కూడా దేనికదే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఐతే స్వాతంత్ర్య పోరాట నేపథ్యం తీసుకోవడం వల్ల వాస్తవంగా జరిగింది చూపిస్తే కలిగే ఉద్వేగం వేరుగా ఉంటుంది. ఆ నేపథ్యంలో వాస్తవ విరుద్ధమైన కథను చూపించడం వల్ల ఎమోషన్ అనుకున్నంత పండలేదు. ‘ఆర్ఆర్ఆర్’లో చెప్పుకోదగ్గ మైనస్ ఇదే. ఐతే కథ ఎలా ఉన్నప్పటికీ రాజమౌళి మార్కు స్క్రీన్ ప్లే వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టే అవకాశమైతే లేదు. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో బిగి తగ్గినట్లు అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్.. దాని అటు ఇటు వచ్చే సన్నివేశాలతో సినిమా కొంచెం నెమ్మదించిన భావన కలుగుతుంది. కానీ చివరి అరగంటలో రోమాంచితుల్ని చేసే యాక్షన్ ఘట్టాలు సినిమాను మళ్లీ పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ఓవరాల్ గా చూస్తే కథ పరంగా ఆత్మ లోపించినట్లు అనిపించినా.. రాజమౌళి మార్కు విజువల్ మాయాజాలం మాత్రం ఔరా అనే అనిపిస్తుంది. తారక్-చరణ్ అభిమానులకే కాదు.. సగటు ప్రేక్షకులకూ ‘ఆర్ఆర్ఆర్’ విజువల్ గా ఒక విందే.

నటీనటులు:

తారక్-చరణ్.. పెర్ఫామెన్స్ పరంగా ఈ ఇద్దరిలో ఎవరెక్కువ ఎవరు తక్కువ అంటే చెప్పడం కష్టం. ఇద్దరూ తమ పాత్రలను అద్భుత రీతిలో.. తమ అభిమానులు సగర్వంగా చెప్పుకునేలా పోషించారు. పాత్ర పరంగా చరణ్ చేసిన రామ్ పాత్రకు ఎక్కువ ఎలివేషన్ ఉంది. ఆ పాత్రలో ఎక్కువ షేడ్స్ ఉన్నాయి. కథలో ఆ పాత్ర లక్ష్యం కూడా చాలా ఉన్నతమైంది. నిస్సందేహంగా చరణ్ కెరీర్లో ‘ది బెస్ట్’ అనిపించేలా ఆ పాత్రను డిజైన్ చేశారు. అతను కూడా అదే స్థాయి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. లోపల భావోద్వేగాల్ని అదిమి పెట్టుకుంటూ.. సంఘర్షణను దాచుకుంటూ.. పైకి ఇంకోలా కనిపించే పాత్రను చరణ్ ఎంతో పరిణతితో పోషించాడు. పాత్రకు తగ్గట్లుగా తనను తాను మలుచుకున్న తీరు కట్టిపడేస్తుంది. తన అసహనాన్ని చూపించే సన్నివేశాల్లో చరణ్ అదరగొట్టేశాడు. ఇక యాక్షన్ ఘట్టాల్లోనూ ఔరా అనిపించాడు. ఇక అమాయకంగా కనిపిస్తూ.. అవసరమైనపుడు వీరత్వాన్ని పతాక స్థాయిలో చూపించే భీమ్ పాత్రను తాను తప్ప ఇంకెవరూ చేయలేరు అనిపించేలా ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడు. తన పాత్ర పట్ల జాలి.. ఆపేక్ష కలిగేలా చేయడంలో ఎన్టీఆర్ పెట్టిన ఎఫర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేక్షకులను భావోద్వేగాల్లో ముంచెత్తే బాధ్యత అతనే తీసుకున్నాడు. కొమురం భీముడో పాట.. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాల్లో తారక్ నటన అద్భుతం. తెరమీద ఉన్న జనాల్లాగే ప్రేక్షకుల్లోనూ భావోద్వేగం కలిగేలా చేయడంలో తారక్ విజయవంతం అయ్యాడు. యాక్షన్ ఘట్టాల్లో తారక్ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. హీరోయిజం కోణంలో చూస్తే తారక్ పాత్ర తగ్గినట్లు అనిపించినా.. భావోద్వేగాల విషయంలో అతను ఎక్కు మార్కులు అందుకుంటాడు. హీరోలిద్దరి స్థాయిలో ఇంకెవరికీ ఎలివేషన్ దక్కలేదు. కానీ అందరూ బాగానే చేశఆరు. ఆలియా భట్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఆమె ఆకట్టుకుంది. బ్రిటిష్ మహిళగా ఒలీవియా మోరిస్ తన పాత్రలో బాగా ఒదిగిపోయింది. అజయ్ దేవగణ్ తక్కువ నిడివిలోనే బలమైన ముద్ర వేశాడు. శ్రియకు పెద్దగా స్కోప్ లేకపోయింది. స్కాట్ పాత్రలో చేసిన నటుడు ఆకట్టుకున్నాడు. సహాయ పాత్రల్లో సముద్రఖని.. రాహుల్ రామకృష్ణ బాగా చేశాడు.

సాంకేతిక వర్గం:

‘ఆర్ఆర్ఆర్’కు తెర వెనుక చాలామంది హీరోలున్నారు. వారిలో ఎక్కువ మార్కులు పడేది కీరవాణికే. ఆయన నేపథ్య సంగీతం సినిమాను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించింది. దాని గురించి చెప్పడం కంటే అనుభూతి చెందడం కరెక్ట్. పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయంతే. సినిమాలో వాటికి ప్రాధాన్యం కూడా తక్కువే. కొమురం భీముడో అన్నింట్లోకి ప్రత్యేకంగా అనిపిస్తుంది. నాటు నాటు ప్రేక్షకుల్లో ఉత్సాహం తీసుకొస్తుంది. సెంథిల్ కుమార్ ఎప్పట్లాగే కెమెరాతో మాయాజాలం చేశాడు. విజువల్స్ అద్భుతంగా అనిపిస్తాయి. ఇలాంటి భారీ సినిమాలకు అతను తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేడేమో అనిపించేలా తన పనితనాన్ని చూపించాడు. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ గురించి చెప్పదేముంది? ఆయన ఆర్ట్ వర్క్ ఆద్యంతం అద్భుతంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. సాయిమాధవ్ బుర్రా మాటలు చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. విజయేంద్ర ప్రసాద్ ఎన్నో పరిమితుల మధ్య ఈ కథను సాధ్యమైనంత ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. కానీ బేసిక్ ఐడియానే అసహజంగా అనిపించడం వల్ల కథతో కనెక్ట్ కావడం కష్టం. ఇందులో ఆయన్ని తప్పుబట్టడానికి లేదు. రాజమౌళి ప్రతి సన్నివేశంలోనూ తన పనితనాన్ని చూపించాడు. దర్శకుడిగా ఆయనకు తిరుగులేదు. ఒక సన్నివేశాన్ని అత్యుత్తమంగా ప్రెజెంట్ చేయడంలో తనకు తానే సాటి అనిపించాడు. ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఘట్టాల్లో తనకు తిరుగులేదనిపించాడు. కాకపోతే ఆయన ఎంచుకున్న కథలో ఆత్మ లోపించింది. చిన్న పాప ఉదంతం నేపథ్యంలో కథను మొదలుపెట్టడం.. దాని చుట్టూనే సినిమాను ముందుకు నడిపించడం మైనస్ అయింది. ఈ రకంగా జక్కన్న నిరాశ పరిచాడు. మిగతా విషయాల్లో ఆయనకు పేరు పెట్టడానికి లేదు.

చివరగా: ఆర్ఆర్ఆర్.. మనసు నిండదు కానీ.. కడుపు నిండుతుంది

రేటింగ్-3/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED పక్కా కమర్షియల్
×