స్టాండప్ రాహుల్

చిత్రం : స్టాండప్ రాహుల్

నటీనటులు: రాజ్ తరుణ్-వర్ష బొల్లమ్మ-మురళీ శర్మ-ఇంద్రజ-వెన్నెల కిషోర్-దేవీ ప్రసాద్-వెంకటేష్ మహా తదితరులు
సంగీతం: స్వీకార్ అగస్తి
ఛాయాగ్రహణం: శ్రీరాజ్ రవీంద్రన్
మాటలు: నందకుమార్
నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని-భరత్ మగులూరి
రచన-దర్శకత్వం: శాంటో

చాలా ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న యువ కథానాయకుడు.. ఇప్పుడు ‘స్టాండప్ రాహుల్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజే థియేటర్లలోకి దిగిన ఈ చిత్రమైన రాజ్ కోరుకున్న విజయాన్ని అందించేలా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

రాహుల్ (రాజ్ తరుణ్) తన అభీష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు విడిపోవడంతో వారి ఉమ్మడి ప్రేమకు నోచుకోక ఇబ్బంది పడుతున్న కుర్రాడు. తన అమ్మ-నాన్న గొడవపడి విడిపోయారని.. జీవితంలో పెళ్లే చేసుకోకూడదన్న తలంపుతో అతనుంటాడు. అదే సమయంలో తల్లి కోరుకున్నట్లు బుద్ధిగా ఉద్యోగం చేస్తూ జీవితాన్ని నడిపించాలా.. లేక తండ్రి చెప్పినట్లు మనసుకు నచ్చింది చేయాలా అనే కన్ఫ్యూజన్ అతణ్ని వెంటాడుతుంటుంది. అలాంటి సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన అతణ్ని.. చిన్నతనంలో స్కూల్లో కలిసి చదువుకుని ఆ తర్వాత దూరమైన శ్రియ (వర్ష బొల్లమ్మ) కలుస్తుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి రాహుల్ ను పెళ్లి చేసుకోవాలని శ్రియ ఆశ పడుతుంది. కానీ పెళ్లి పట్ల వ్యతిరేక భావంతో ఉన్న రాహుల్.. ఆమెను దూరం పెడతాడు. మరి కెరీర్ విషయంలో తనకున్న కన్ఫ్యూజన్ ను రాహుల్ అధిగమించాడా లేదా.. శ్రియతో అతడి ప్రయాణం ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

నవరసాల్లో కామెడీ అనేది చాలా కష్టమైన రసం అంటారు. ఈ రోజుల్లో అయితే వెండితెరపై కామెడీ పండించడం మరీ కష్టమైపోయింది. జబర్దస్త్ సహా ఎన్నో కామెడీ షోలు టీవీలో కావాల్సినంత వినోదాన్నందిస్తున్నాయి. కొందరు ఆ కామెడీని విమర్శించినా సరే.. వాటికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. సినిమాలు చూసే మెజారిటీ ప్రేక్షకులు టీవీల్లో ఈ కామెడీకి బాగా అలవాటు పడిపోయారు. దీంతో వెండితెరపై కామెడీ పండించడం చాలా చాలా కష్టమైపోతోంది. టిపికల్ క్యారెక్టర్లతో అల్లరల్లరి చేస్తే తప్ప కామెడీ కిక్ రావట్లేదు. ఈ నేపథ్యంలో హీరో స్టాండప్ కమెడియన్ అంటే ఎంతో కొంత కామెడీని ఆశించడం సహజం. కానీ ‘స్టాండప్ రాహుల్’లో మనస్ఫూర్తిగా నవ్వుకునే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి లేకపోవడమే విషాదం. హీరో స్టాండప్ కమెడియన్ అయినంత మాత్రాన కామెడీ ఉండాలా అని అంటే.. మరి వేరే రసాలైనా సరిగా పండించి ఉండాలి. కానీ అదీ లేకపోయింది. రొమాన్స్ పండలేదు. ఫ్యామిలీ డ్రామా అతకలేదు. ఎమోషన్లు బలవంతంగా రుద్దినట్లు అనిపిస్తాయి. మొత్తంగా ‘స్టాండప్ కమెడియన్’ ఏ రకంగానూ మెప్పించ రెండు గంటల బోరింగ్ వ్యవహారంలా మారింది.

హీరో ఐటీ ప్రొఫెషనల్ కమ్ స్టాండప్ కమెడియన్.. హీరోయిన్ అతడి కలీగ్.. హీరో తండ్రి డైరెక్టర్.. హీరో తల్లి ఎయిర్ హోస్టెస్.. ఇలా వారి నేపథ్యాన్ని, ఆహార్యాన్ని ఆధునికంగా చూపించినంత మాత్రాన ట్రెండీ సినిమా అయిపోదు. కథాకథనాల్లో తాజాదనం ఉండాలి. ‘స్టాండప్ రాహుల్’లో అదే మిస్సయింది. హీరో తల్లి కుటుంబం గురించి ఆలోచించే బాధ్యత గల మనిషి. తండ్రేమో తన ప్యాషనే ముఖ్యమనుకునే వ్యక్తి. వీళ్లిద్దరికీ పొసగక విడిపోతే.. హీరో అసలు పెళ్లే వద్దనుకుంటాడు. బాధ్యత లేకుండా ప్యాషన్ ప్యాషన్ అని ఇంటి యజమాని తిరుగుతున్నపుడు ఏ భార్య అయినా ఆ వ్యక్తితో కలిసి నడవడం కష్టం. పైగా ఆమే కుటుంబ భారాన్ని మోస్తున్నపుడు దూరం కాక తప్పదు. ఇక్కడ సమస్య ఏంటో క్లియర్ గా కనిపిస్తున్నపుడు.. హీరో అసలు పెళ్లంటేనే సమస్య అని ఫిక్సయిపోవడంలో.. తనను ప్రేమించే అమ్మాయిని దూరం పెట్టడంలో లాజిక్ కనిపించదు. అయినా ఈ టైపు హీరో క్యారెక్టర్ మనకు కొత్తా అంటా అదీ కాదు. రెండు దశాబ్దాల కిందటే ‘స్వయంవరం’లో చూసిన పాత్రను ఇప్పుడు మళ్లీ చూపిస్తుంటే దాన్ని చూసి కొత్తగా ఎలా ఫీలవుతాం అసలు?

అందరిలో ఒకరిలా ఉద్యోగం చేసుకుంటూ రొటీన్ లైఫ్ లీడ్ చేయడం కాకుండా.. మనసుకు నచ్చింది చేయమని చెప్పే కథలతో ఇప్పటికే చాలా సినిమాలు చూశాం. ఐతే ఈ పాయింట్ ను ఎంచుకున్నపుడు ప్రధాన పాత్రతో ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్టయ్యేలా.. అందులో తమను తాము చూసుకునేలా చేయడం కీలకం. ఐతే ‘స్టాండప్ రాహుల్’లో హీరో పాత్రతో ఏ దశలోనూ కనెక్టవలేం. అతడి ప్రవర్తన చిత్ర విచిత్రంగా అనిపిస్తూ మనకే చికాకు పెడుతుంటుంది. ఇక అతడి తాలూకు ఎమోషన్ ను మనమెలా ఫీల్ కాగలం? హీరోయిన్ సహా మిగతా పాత్రల్లో కూడా ఏదీ లవబుల్ గా అనిపించదు. హీరోను హీరోయిన్ ఎందుకు ప్రేమిస్తుందో అర్థం కాదు. హీరోయిన్ పట్ల హీరో ఫీలింగేంటో అంతుబట్టదు. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అంచనా వేయలేం. ప్రేమకథ ముందు నుంచే ఫోర్స్డ్ గా అనిపించడంతో హీరో హీరోయిన్ల మధ్య ఎడబాటు వచ్చినపుడు మనసు బరువెక్కదు. ఫ్యామిలీ డ్రామాను ఆరంభంలో డీల్ చేసిన విధానంతోనే ముగింపు ఎలా ఉండబోతోందో ఒక అంచనా వచ్చేస్తుంది. అది కూడా ఆకట్టుకోదు. ఇక స్టాండప్ కమెడియన్ అప్పుడప్పుడూ అయినా హీరో వినోదం పంచాడా అంటే అదీ లేదు. హీరో జోకులేస్తుంటే అతనున్న ఆడిటోరియంలో చప్పట్లు కొడుతుంటారు కానీ.. సినిమా చూస్తున్న ఆడియన్స్ లో మాత్రం చలనం ఉండదు. ప్రథమార్ధంలోనే నీరసం తెప్పించేసే ‘స్టాండప్ రాహుల్’ ద్వితీయార్ధంలో కాస్త పర్వాలేదన్న ఫీలింగ్ కలిగిస్తుంది తప్పితే.. ఆహా అని మాత్రం అనిపించదు. ఉద్యోగం చేసుకుంటూనే మనసుకు నచ్చిన పనినీ చేయొచ్చని.. ఇది ఇప్పటి ట్రెండ్ అని ఒక కొత్త పాయింట్ చెప్పడం మినహాయిస్తే.. ‘స్టాండప్ రాహుల్’లో స్టాండౌట్ గా నిలిచే పాయింట్ ఏదీ లేదు.

నటీనటులు:

రాజ్ తరుణ్ ను ఎక్కువగా మాస్ టచ్ ఉన్న పాత్రల్లో చూడటం వల్ల.. ఐటీ ప్రొఫెషనల్ కమ్ స్టాండప్ కమెడియన్ గా అతను కొత్తగా కనిపిస్తాడు. తన మేకోవర్ ఓకే అనిపిస్తుంది. ఐతే నటన పరంగా మాత్రం అతడికిది ప్రత్యేకంగా అనిపించే సినిమా కాదు. ఈ పాత్రను ప్రేక్షకులు ఓన్ చేసుకునేలా ఎక్కడా కనిపించదు. రైటింగ్ దగ్గరే తేలిపోయిన పాత్రను రాజ్ కూడా తన పెర్ఫామెన్స్ తో నిలబెట్టలేకపోయాడు. వర్ష బొల్లమ్మ మంచి ఆర్టిస్టే అయినా.. శ్రియ పాత్ర తనకు పెద్దగా ఛాన్స్ ఇవ్వలేదు. కొన్ని ఎమోషనల్ సీన్లలో ఆమె బాగా చేసింది. లుక్స్ పరంగా వర్ష చాలా యావరేజ్ అనిపించడం మైనస్. మురళీ శర్మ తన పాత్రకు న్యాయం చేసినా.. ఆయన చేయాల్సిన స్థాయి క్యారెక్టర్ కాదది. ఇంద్రజ బాగా చేసింది. వెన్నెల కిషోర్ కామెడీ ఇంతగా తేలిపోయిన సినిమా ఇంకొక్కటి కనిపించదేమో. అతను ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

స్వీకార్ అగస్తి సంగీతం పర్వాలేదు. పాటలు మరీ ప్రత్యేకంగా అనిపించకపోయినా.. సోసోగా సాగిపోయాయి. నేపథ్య సంగీతం బాగుంది. శ్రీరాజ్ రవీంద్రన్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. విజువల్స్ ట్రెండీగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయిలో మెరుగ్గానే ఉన్నాయి. నందకుమార్ మాటలు అక్కడక్కడా కొన్ని మెరిశాయి. కొత్త దర్శకుడు శాంటో నిరాశ పరిచాడు. రైటింగ్ దగ్గరే ‘స్టాండప్ రాహుల్’ తేలిపోయింది. పాత్రల నేపథ్యం వరకు అతను కొత్తగా ఆలోచించాడు తప్పితే.. వాటిని తీర్చిదిద్దడంలో నవ్యత చూపించలేకపోయాడు. కథే అంతంతమాత్రం అంటే.. బోరింగ్ గా సాగే స్క్రీన్ ప్లే దాన్ని మరింత నీరుగార్చేసింది. ఇటు కామెడీ.. అటు ఎమోషన్లను ఏమాత్రం పండించలేక దర్శకుడిగా శాంటో తేలిపోయాడు.

చివరగా: స్టాండప్ రాహుల్.. లేవనే లేదు

రేటింగ్-1.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED మాచర్ల నియోజకవర్గం
×