రాధేశ్యామ్

చిత్రం : రాధేశ్యామ్

నటీనటులు: ప్రభాస్-పూజా హెగ్డే-కృష్ణంరాజు-సచిన్ ఖేద్కర్-జయరాం-మురళీ శర్మ-భాగ్యశ్రీ-జగపతిబాబు-ప్రియదర్శి తదితరులు
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
నేపథ్య సంగీతం: తమన్
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
రచన-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్

‘బాహుబలి’తో శిఖర స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. ఆ తర్వాత వచ్చిన యాక్షన్ మూవీ ‘సాహో’తో నిరాశ పరిచాడు. ఆపై అతను తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ‘రాధేశ్యామ్’ అనే ప్రేమకథ చేశాడు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకుడు. కరోనా సహా కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ భారీ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

70వ దశకంలో నడిచే కథ ఇది. విక్రమాదిత్య (ప్రభాస్) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హస్త సాముద్రిక నిపుణుడు. ప్రధాని ఇందిరా గాంధీ చెయ్యి చూసి అతను.. త్వరలో ఇండియాలో ఎమర్జన్సీ పెట్టబోతున్నారని చెప్పడంతో దేశం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతో కుటుంబంతో సహా వెళ్లి ఇటలీలో సెటిలవుతాడు. తన చేతిలో ప్రేమ రేఖ లేదని నమ్మి తన జీవితంలోకి వచ్చిన ప్రతి అమ్మాయితోనూ కొంత కాలం వరకే ప్రయాణం సాగించి.. ఆ తర్వాత వాళ్ల నుంచి దూరంగా వెళ్లిపోతుంటాడు విక్రమాదిత్య. అలాంటి వ్యక్తి విధిని.. జ్యోతిషాన్ని అస్సలు నమ్మని డాక్టర్ ప్రేరణ (పూజా హెగ్డే)ను చూసి ఇష్టపడతాడు. ఆమె అతణ్ని ప్రేమించినా.. తన జీవితంలో ప్రేమ లేదని చెప్పి దూరమవ్వాలని చూస్తాడు. అప్పుడే ప్రేరణ ఇంకెంతో కాలం బతకదని విక్రమాదిత్యకు తెలుస్తుంది. కానీ తన చేయి చూసి ఆమె నిండు నూరేళ్లు బతుకుతుందని చెబుతాడతను. మరి అతడి మాట నిజమైందా.. ప్రేరణ బతికిందా.. తన చేతిలో ప్రేమ రేఖ లేదన్న విక్రమాదిత్య ప్రేరణతో కలిసి ప్రయాణం సాగించగలిగాడా.. వీరి ప్రేమ ఏ తీరాలకు చేరింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

బాగా ఆకలేస్తుంటుంది.. కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దిన ఒక హోటల్లోకి అడుగు పెడతారు. ఆ హోటల్లో అణువణువూ ఎంతో అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సూటేసుకుని దొరబాబులా ఉన్న వ్యక్తి బంగారు పళ్లెంలో తెచ్చి మీకు భోజనం వడ్డిస్తాడు. ఆహా ఏమి ఆతిథ్యం అనుకుని భోజనం మీద భారీ అంచనాలు పెట్టుకుంటారు. అది అనుకున్నంత రుచిగా లేకుంటే అప్పుడు మీ ఫీలింగేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘రాధేశ్యామ్’ సినిమా చూసే ప్రేక్షకుల పరిస్థితి కూడా సరిగ్గా ఇంతే. ప్రతి సన్నివేశంలోనూ కళ్లు చెదిరిపోయే విజువల్స్.. అద్భుతమైన సెట్టింగ్స్.. తెరనిండా పేరున్న తారాగణం.. తోడుగా అత్యుత్తమ స్థాయి సాంకేతిక నిపుణుల పనితనం.. ప్రభాస్-పూజా హెగ్డేల రూపంలో అందమైన జంట.. ఇలా ‘రాధేశ్యామ్’లో ఉన్న ఆకర్షణలు అన్నీ ఇన్నీ కావు. ఈ అదనపు హంగుల స్థాయిలో.. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ కథాకథనాలు లేకపోవడం ‘రాధేశ్యామ్’లోని మైనస్. ‘బాహుబలి’ తర్వాత అమాంతం పెరిగిపోయిన ప్రభాస్ ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టేసి.. అతణ్ని ఒక మామూలు ప్రేమికుడిగా చూపించడంతో ‘రాధేశ్యామ్’ అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. ఐతే అంచనాల కళ్ల జోడు తీసేసి.. దీన్నో మామూలు ప్రేమకథలా చూస్తే మాత్రం ఓ మోస్తరుగా అనిపిస్తుంది.

‘బాహుబలి’ సినిమాతో అసాధారణంగా పెరిగిపోయిన ప్రభాస్ ఇమేజ్ కు సరిపడా కథలు తయారు చేయడం పెద్ద సవాలుగా మారిపోయింది. ‘సాహో’లో ఎంత యాక్షన్ నింపినా.. ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా.. ఎంత భారీతనం జోడించినా.. ప్రభాస్ ఇమేజ్ ను మ్యాచ్ చేసే సినిమాగా అది నిలవలేదు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రూపంలో ఒక్క యాక్షన్ సీన్ కూడా లేని పూర్తి స్థాయి ప్రేమకథ చేశాడు. ప్రభాస్ ఎలా అయితే తన ఇమేజ్‌ గురించి పట్టించుకోకుండా ప్రేమకథలో ఒదిగిపోవడానికి సిద్ధమయ్యాడో.. ‘రాధేశ్యామ్’కు వెళ్లే అతడి అభిమానులు కూడా తమ హీరో ‘ఇమేజ్’ను వదులుకున్నట్లే అంచనాలను పక్కన పెట్టాలి. అలా రాజీ పడితేనే ఈ కథతో ముందుకు సాగగలం. దృశ్య పరంగా మాత్రం ‘రాధేశ్యామ్’ను ఒక కావ్యంలా తీర్చిదిద్దడాడనికి అన్ని ప్రయత్నాలూ జరిగాయి. 70వ దశకంలో ఇటలీ వాతావరణాన్ని ఎంత అందంగా చూపించారో మాట్లలో చెప్పలేం. ప్రతి సన్నివేశం ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. అందుకోసం కెమెరామన్.. ఆర్ట్ డైరెక్టర్.. కాస్ట్యూమ్ డిజైనర్స్.. పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. కానీ విజువల్ గా ఎంత అద్భుతంగా అనిపించినా.. సన్నివేశాల్లో రచనా బలం లేకపోవడంతో ‘రాధేశ్యామ్’ భారంగానే ముందుకు కదులుతుంది.

హీరో చేయి చూసి జాతకం చెప్పే ఒక హస్త సాముద్రిక నిపుణుడు అనగానే ఇదేదో ‘పాత’ వ్యవహారంలాగా అనిపిస్తుంది. ‘రాధేశ్యామ్’ కథ కూడా రకంగా చూసినా పాతదే. ఈ కథ నడిచేది 70వ దశకం నేపథ్యంలో. పైగా ఇందులో కొత్త పాయింట్ అయితే ఏమీ కనిపించదు. ఒక గొప్ప ప్రేమకథలా ప్రొజెక్ట్ చేసిన ఈ చిత్రంలో.. హీరోయిన్ హీరోను ఎందుకు ప్రేమిస్తుందో తెలుసా? రేప్పొద్దున కాలేజీ బయట నీ కోసం వెయిట్ చేస్తుంటా అని చెప్పిన హీరోకు ఝలక్ ఇచ్చి.. హీరోయిన్ 300 కిలోమీటర్లు రైల్లో ప్రయాణం చేసి మెడికల్ క్యాంపు కోసమని వెళ్లిపోతే.. ఆమె ట్రైన్ దిగగానే అక్కడ హీరో ప్రత్యక్షమవుతాడు. వర్షంలో 300 కిలోమీటర్లు తన కోసం బైక్ వేసుకుని వచ్చేశాడని.. వెంటనే అతడి చేయి అందుకుని బైక్ ఎక్కి కూర్చుంటుంది. ఆ వెంటనే పాట. ఆ పాట అవ్వగానే.. ఇద్దరూ గాఢమైన ప్రేమలో మునిగిపోయినట్లు మాటల ద్వారా తెలుస్తుంటుంది. అంతే తప్ప వాళ్ల ప్రేమను ప్రేక్షకుడు ఫీల్ కాలేడు. ప్రేమకథలకు ‘ఫీల్’ అన్నది చాలా ముఖ్యం. సింపుల్ సన్నివేశాలతో అయినా సరే.. ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టడానికి బలమైన కారణాలు చూపించాలి. మాటలతోనో.. హావభావాలతోనో ఒకరిపై ఒకరికున్న ప్రేమను వ్యక్త పరిచేలా సన్నివేశాలు తీర్చిదిద్దాలి. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చూస్తే వాళ్లిద్దరూ నిజంగా ప్రేమికులు అనే భావన కలగాలి. మణిరత్నం.. గౌతమ్ మీనన్ లాంటి దర్శకుల సినిమాల్లో కనిపించేది ఇదే. కానీ ‘రాధేశ్యామ్’లో ప్రభాస్-పూజాలను చూస్తే ఆ భావనే కలగదు మరి. ఆర్ట్ వర్క్.. కెమెరా వర్క్.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎంత ప్రయత్నించినా కానీ.. సన్నివేశాల్లో బలం లేక.. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాక గాఢమైన ప్రేమ భావనలేమీ కలగవు.

విజువల్స్ వల్ల.. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపించడంతో ‘రాధేశ్యామ్’ సోసోగా ముందుకు నడుస్తుంటుంది కానీ.. కథ పరంగా మాత్రం ప్రథమార్ధంలో ఎక్కడా ముందుకే కదలదు. జగపతిబాబు.. జయరాం.. భాగ్యశ్రీ.. మురళీ శర్మ.. ఇలా పేరున్న తారాగణం జాబితా పెద్దదే. ఒక్కొక్కరుగా తెరపైకి వస్తుంటారు. పక్కకు వెళ్తుంటారు. వీరిలో ఏ ఒక్కరినీ సరిగా ఉపయోగించుకోలేదు. ఏ పాత్రకూ ప్రాధాన్యం లేదు. జగపతిబాబు పాత్ర ప్రవేశంతో హీరోకు.. అతడికి మధ్య ఏదో ‘వార్’ నడవబోతున్న సంకేతాలు కనిపిస్తాయి. ప్రేమకథ కంటే ముందు ఇక్కడ ‘కాన్ఫ్టిక్ట్’ మొదలైందని.. ఈ ట్రాక్ ఏదో బాగుండేలా ఉందని అనుకుంటే.. ఆ పాత్రను పూర్తిగా పక్కన పడేశారు. అది ఎప్పుడో ద్వితీయార్ధంలో మళ్లీ ఇంకో రెండు నిమిషాలు కనిపించి హీరో నిజంగా గొప్ప జ్యోతిషుడే అని హింట్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఈ మాత్రం దానికి ఆ పాత్రలో జగపతిబాబే ఎందుకు అనిపిస్తుంది. ఇక మురళీ శర్మ.. భాగ్యశ్రీ లాంటి వాళ్లకైతే ఈ మాత్రం ప్రాధాన్యం కూడా లేదు. ఉత్సవ విగ్రహాల్లాంటి పాత్రలకు ఆ స్థాయి ఆర్టిస్టులను ఎందుకు పెట్టుకున్నారో ఏమో మరి.

ప్రేమకథలో సంఘర్షణను తీసుకురావడంలోనే చాలా ఆలస్యం జరిగింది. ఐతే ఆలస్యమైనప్పటికీ ఆ పాయింట్ మాత్రం ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇక్కడి నుంచి కొన్ని మలుపులు ఆసక్తి రేకెత్తిస్తాయి. ప్రేమకథ రసపట్టులో పడబోతున్న భావన కలుగుతుంది. పతాక సన్నివేశాల మీద అంచనాలు పెరుగుతాయి. కానీ వాటిని అనుకున్నంత రసవత్తరంగా తీర్చిదిద్దలేకపోయారు. పతాక ఘట్టాలకు ‘భారీతనం’ జోడించాలన్న ఉద్దేశంతో ‘టైటానిక్’ను తలపించేలా షిప్ ఎపిసోడ్ పెట్టారు. ఐతే ఎంత కష్టపడ్డా.. ఖర్చు పెట్టినా.. వాటి వల్ల కథకు చేకూరిన ప్రయోజనం మాత్రం తక్కువే. దీని బదులు ఎమోషనల్ క్లైమాక్స్ పెట్టి ఉంటే ఈ ప్రేమకథకు అది బలమయ్యేదేమో. లాజిక్ లేకుండా.. హడావుడిగా ఆ సన్నివేశాలను లాగించేసి.. మొక్కుబడిగా సినిమాను ముగించేశారు. ప్రి క్లైమాక్స్ లో కాస్త గాడిన పడ్డట్లు కనిపించే ‘రాధేశ్యామ్’.. క్లైమాక్స్ తో మళ్లీ కిందికి పడిపోయింది. మొత్తంగా చూస్తే.. ఒడుదొడుకులతో సాగే ఈ ప్రేమకథలో ఫీల్ మిస్సయినా.. కొన్ని ఆకర్షణలైతే ఉన్నాయి. కానీ సాధ్యమైనంత తక్కువ అంచనాలతో సినిమా చూడటం బెటర్.

నటీనటులు:

ప్రభాస్ కు ఈ చిత్రం ఒక మేకోవర్ లాగా చెప్పొచ్చు. ఇమేజ్ చొక్కా తీసి పక్కన పెట్టేసి ఒక మామూలు పాత్రలో కనిపించడానికి ప్రయత్నించాడు ప్రభాస్. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఓవరాల్ లుక్ కూడా ఓకే. కానీ కొన్ని చోట్ల ముఖంలో వయసు ప్రభావం స్పష్టంగా కనిపించింది. క్లోజప్ షాట్స్ పెట్టినపుడు హావభావాల పరంగా ఇబ్బంది పడ్డాడు ప్రభాస్. అతడి నటన పరంగా స్టాండౌట్ అనిపించే సన్నివేశాలేమీ లేవు. పూజా హెగ్డే ప్రోమోల్లో కనిపించినంత అందంగా సినిమాలో లేదు. ఆరంభ సన్నివేశాల్లో ఆకర్షించినా.. ఆ తర్వాత మామూలుగా కనిపించింది. ప్రభాస్-పూజాల కెమిస్ట్రీ అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాలేదు. మిగతా నటీనటుల్లో ఒక్క సచిన్ ఖేద్కర్ కే చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది. దానికాయన న్యాయం చేశాడు. జగపతిబాబు.. భాగ్యశ్రీ.. జయరాం.. మురళీ శర్మ.. ఇలా ఎవరూ తమ ప్రత్యేకత చాటుకునే అవకాశమే ఇవ్వలేదు వారి పాత్రలు. ప్రియదర్శి కూడా నామమాత్రమే.

సాంకేతిక వర్గం:

‘రాధేశ్యామ్’లో సాంకేతిక ఆకర్షణలకేమీ లోటు లేదు. మనోజ్ పరమహంస తన విజువల్స్ తో ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఆ ప్రపంచాన్ని ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. నిర్మాణ విలువల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ కొన్ని చోట్ల మాత్రం అవసరానికి మించిన భారీతనం కనిపిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ పాటలు మరీ ప్రత్యేకంగా అనిపించవు. అలా అని తీసిపడేసేలా లేవు. ఎవరో వీరెవరో అన్నింట్లోకి బెస్ట్ అని చెప్పొచ్చు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. ఈ మధ్య అతనున్న ఫాంకు తగ్గ స్థాయిలో అయితే ఆర్ఆర్ లేదు. ఇక దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఎంచుకున్నదే డ్రై సబ్జెక్ట్. దానికి ఎంతగా అదనపు హంగులు జోడించినా.. కోరుకున్న ఔట్ పుట్ రాలేదు. తొలి సినిమా ‘జిల్’లో యాక్షన్ కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేసిన రాధాకృష్ణ.. ఈసారి మాత్రం ఓ పాత కథను ఎంచుకుని దాన్ని పాత శైలిలోనే చెప్పాడు. సాంకేతిక హంగులు తీసేసి చూస్తే సినిమా చాలా సాధారణంగా అనిపిస్తుందంటే అది దర్శకుడి వైఫల్యమే.

చివరగా: రాధేశ్యామ్.. బంగారు పళ్లెంలో మామూలు భోజనం

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED పక్కా కమర్షియల్
×