రౌడీ స్టార్ సినిమా వున్నట్టా లేనట్టా?

`పుష్ప : ది రైజ్` పాన్ ఇండియా స్థాయిలో ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో సుకుమార్ పార్ట్ 2 ని మరింత పర్ఫెక్ట్ గా కొత్త హంగులతో ఊహించని ట్విస్ట్ లతో తెరపైకి తీసుకురావాలని పార్ట్ 2 ద్వారా ఉత్తరాది ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం `పుష్ప : ది రూల్` స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారట సుకుమార్. మార్పులు పూర్తయిన వెంటనే ఈ మూవీని ఫిబ్రవరిలోనే పట్టాలెక్కించాలని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీకి ముందు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నానంటూ సుకుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ భారీ చిత్రాన్ని హీరో బన్నీ స్నేహితుడు ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తానని ప్రకటించి కూడా చాలా నెలలవుతోంది. అయితే సుకుమార్ `పుష్ప` ప్రాజెక్ట్ లో పడి ఈ మూవీ ఊసే ఎత్తడం లేదు. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా `లైగర్` హడావిడిలో పడి సుకుమార్ ప్రాజెక్ట్ గురించి పెద్దగా స్పందించడం లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ వున్నట్టా లేనట్టా? అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ ప్రియుల్లోనూ మొదలయ్యాయి. ఇంతకు ముందు ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ కావడంతో ఫాల్క్ క్రియేషన్స్ అధినేత ట్విట్టర్ వేదిగా స్పందించారు.

`కొంత మంది చేసే ప్రచారాన్ని నమ్మకండి. మేము ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న గాసిప్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మూవీ ప్లాన్ లో ఎలాంటి మార్పు లేదు. సుకుమార్ - విజయ్ దేవరకొండల మూవీ చాలా భారీ స్థాయిలో వుండబోతోంది` అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మేకర్స్ నుంచి ప్రకటన వచ్చి కూడా చాలా కాలమే అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన ఓ వార్త తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండ - సుకుమార్ ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా వున్నారని ఇద్దరి కలయికలో చేయాలని భావించిన ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారని ఇక ఈ ప్రాజెక్ట్ లేనట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. `పుష్ప -2` తరువాత సుకుమార్ హీరో రామ్ చరణ్ తో తదుపరి చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇదే సమయంలో విజయ్ దేవరకొండ మరో సారి పూరి జగన్నాథ్ తో కలిసి `జనగణమన` చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ - సుక్కు ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం లేదని చెబుతున్నారు. ఎవరి ప్రాజెక్ట్ లు వారికున్నాయి. దీంతో ఇప్పట్లో ఫాల్కన్ క్రియేషన్స్ మూవీ పట్టాలెక్కడం కష్టమని.. ఈ సినిమా పక్కన పడినట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
× RELATED మెగా అల్లు కాంపౌండ్ లలో ఏం జరుగుతోంది?
×