మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం: నాగార్జున

అక్కినేని నాగచైతన్య - సమంత విడిపోతున్నట్లు ప్రకటించి దాదాపుగా నాలుగు నెలలు గడిచింది. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలను వారు వెల్లడించనప్పటికీ.. దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే లేటెస్టుగా 'బాలీవుడ్ లైఫ్' అనే మీడియా సంస్థ ఓ ఇంటర్వ్యూలో చై-సామ్ విడాకులపై అక్కినేని నాగార్జున స్పందించినట్లు ఓ కథనం ప్రచురించింది.

సమంతే మొదట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందని.. ఆమె నిర్ణయాన్ని గౌరవించి చైతన్య అంగీకారం తెలిపాడని నాగ్ చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని ప్రముఖంగా పేర్కొంటూ వార్తలు ప్రచురించాయి. అయితే తాజాగా నాగార్జున ట్విట్టర్ వేదికగా ఆ వార్తలను ఖండించారు. అవన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు.

నాగార్జున ట్వీట్ చేస్తూ.. ''సమంత & నాగచైతన్య గురించి నేను ప్రకటన చేసినట్లు సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం మరియు అసంబద్ధం. దయచేసి పుకార్లను వార్తలుగా పోస్ట్ చేయడం మానుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నాను'' అని పేర్కొన్నారు. దీనికి #GiveNewsNotRumours అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించారు.
× RELATED అంతా ఆయన్ను కోరుతున్నారు.. మహేష్ మాత్రం నో చెప్పాడట!
×