'వలిమై' రిలీజ్ డేట్ దాదాపు ఖాయమైనట్టే!

తమిళనాట అజిత్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక అక్కడి మాస్ ఆడియన్సులో ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. తన సినిమా రికార్డులను తానే బ్రేక్ చేస్తూ ఆయన ముందుకు వెళుతుంటారు. కొంతకాలంగా అజిత్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన 'వలిమై' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి హెచ్. వినోత్ దర్శకత్వం వహించాడు. అజిత్ సరసన హుమా ఖురేషి కనిపించనుంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అయితే అప్పటికి కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటం వలన .. చాలా ప్రాంతాల్లో థియేటర్లు మూసుకుంటూ వస్తుండటం వలన ఈ సినిమాను విడుదల చేయలేక వాయిదా వేసుకున్నారు. ఇక ఫిబ్రవరిలో కేసులు తగ్గుముఖం పడతాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను మార్చి 4వ తేదీన విడుదల చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. దాదాపు ఈ డేట్ ఖాయమైనట్టేనని అంటున్నారు.

ఈ సినిమాలో దోపిడీలకు పాల్పడుతున్న విలన్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి నియమించబడిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజిత్ కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ యాక్షన్ సినిమాల్లోని ఛేజింగ్ సీన్స్ ను తలపించే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నాయనే విషయం అర్థమైంది. ముఖ్యంగా కందిరీగల్లా దూసుకుపోయే బైక్స్ .. హీరో ఛేజింగ్ ఈ సినిమాకి హైలైట్ గా అనిపిస్తోంది. ఈ షూటింగులో బైక్ పై నుంచి పడిపోయి అజిత్ గాయపడిన సంగతి తెలిసిందే.

ఇక తెలుగులో హీరోగా స్టార్ డమ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర ద్వారా ఆయన పర్సనాలిటీని పర్ఫెక్ట్ గా చూపించే ప్రయత్నం చేశారనే విషయం అర్థమవుతోంది. ఈ పాత్ర తనకి మంచి పేరు తెచ్చిపెడుతుందని కార్తికేయ భావిస్తున్నాడు. విలన్ గా ఆయన అక్కడ బిజీ కావడం ఖాయమని ఇక్కడి ప్రేక్షకులు అనుకుంటున్నారు. తెలుగులోను ఈ సినిమాను తమిళ టైటిల్ తోనే విడుదల చేయాలనుకున్నప్పుడు విమర్శలు తలెత్తాయి. మరి ఈ సారి రిలీజ్ సమయానికి తెలుగు టైటిల్ ను సెట్ చేస్తారేమో చూడాలి.
× RELATED మెగా అల్లు కాంపౌండ్ లలో ఏం జరుగుతోంది?
×