ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఢీ అంటే ఢీ..

ఏపీ అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది కీచులాడుకుంటున్న విషయం తెలిసిందే. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టడం.. దూషించుకోవడం.. ఆఖరుకు.. కత్తులు నూరుకుని అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడం షరా మామూలే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇలాంటి వారిలో రాజమండ్రిలో జక్కంపూడి రాజా వర్సెస్ ఎంపీ మార్గాని భరత్ గుంటూరులో విడదల రజనీ వర్సెస్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అనంతపురంలో ఉషశ్రీచరణ్ వర్సెస్ ఎంపీ తలారి రంగయ్యల మధ్య వివాదాలు.. విభేదాలు తార స్థాయిలో నడుస్తున్నాయి. వీరిలో మరీ ముఖ్యంగా రజనీ వర్సెస్ లావుల మధ్య వివాదాలు పతాక స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి.

గతంలో కోటప్పకొండ తిరునాళ్ల సమయంలో ఎంపీ వర్గం.. ఎమ్మెల్యే బంధువులు(ఎమ్మెల్యే రజనీ మరుదులు) బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. ఈ విషయం అప్పట్లోనే అధిష్టానం వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు.. వీరిమధ్య మరోసారి చిచ్చు రేగింది. చిలకలూరిపేటలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో నేతల మధ్య విభేదాలు బహిర్గమయ్యాయి.  చిలకలూరిపేట మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత అటవీశాఖ ఆధ్వర్యంలో కొండవీడులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన వంటి కార్యక్రమాలు  రూపొందించారు.

మార్కెట్ యార్డు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు వచ్చిన ఆహ్వానిత మంత్రులు ఎమ్మెల్యేల ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటీకి ఎక్కడా ఎంపీ లావు(ఇది ఆయన పార్లమెంటు నియోజకవర్గమే) ఫొటో కనిపించలేదు. దీంతో కార్యక్రమానికి హాజరైన మంత్రులు కృష్ణదేవరాయలును ఫోన్లో సంప్రదించారు. తను ఢిల్లీలో ఉన్నట్లు కార్యక్రమాల గురించి ఎటువంటి సమాచారం ఆహ్వానం లేదని చెప్పారు. మీరెలా వచ్చారంటూ వారిని ఎంపీ ఫోన్లో నిలదీసినట్లు తెలిసింది. ఎంపీని కూడా ఆహ్వానించామని తమకు చెప్పడం వల్లే కార్యక్రమానికి హాజరయ్యామని ఇక్కడికి వచ్చాక పరిస్థితి అర్థమై ఫోన్ చేసినట్లు వారు చెప్పినట్లు తెలిసింది.

ఎంపీకి ఆహ్వానం లేదని తెలుసుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు. దీంతో కొండవీడు కార్యక్రమం రద్దు అయ్యింది. అయితే అప్పటికే ఎంపీ ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలుమార్లు ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఇకపై ఉపేక్షించేది లేదని తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమని వైసీపీ పెద్దలకు కృష్ణదేవరాయులు తెలిపినట్టు సమాచారం. మొత్తానికి మరోసారి రజనీ వర్సెస్ లావు వివాదం అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
× RELATED తిరుపతికి బాలాజీ పేరేంటి స్వామీ... ?
×